పవన్‌కు ‘హోదా’ ఇప్పుడు గుర్తొచ్చిందా? | Sakshi
Sakshi News home page

పవన్‌కు ‘హోదా’ ఇప్పుడు గుర్తొచ్చిందా?

Published Sun, Aug 28 2016 3:40 AM

పవన్‌కు ‘హోదా’ ఇప్పుడు గుర్తొచ్చిందా? - Sakshi

వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ధ్వజం
విశాఖపట్నం: రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మోసం చేస్తున్నాయని వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఎంపీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా శనివారం విశాఖపట్నం వచ్చిన ఆయనకు అభిమానులు ఘన  స్వాగతం పలికారు. అభిమానులు ఏర్పాటు చేసిన భారీ మోటార్ సైకిల్, కార్ల ర్యాలీతో సింహాచలం వెళ్లిన విజయసాయిరెడ్డి.. అప్పన్న దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల సమయంలో తిరుపతి, విశాఖపట్నంలో జరిగిన సభల్లో నరేంద్ర మోదీతోపాటు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా పాల్గొన్నారని గుర్తుచేశారు. ఆనాడు ఆంధ్రప్రదేశ్‌కు మోదీ ఇచ్చిన హామీలపై రెండున్నరేళ్ల తర్వాత మేల్కొన్న పవన్ కల్యాణ్ ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం తప్పని, పోరాటం చేస్తానంటున్నారని ఎద్దేవా చేశారు. పవన్‌కు ప్రత్యేక హోదా ఇప్పుడు గుర్తొచ్చిందా? అని ప్రశ్నించారు. రాష్ట్రం విడిపోయిన రోజు నుంచీ ఈ రోజు వరకూ ఏపీకి ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పోరాడుతున్నారని చెప్పారు.  

ఈ పోరాటం కొనసాగుతుందన్నారు.రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను రాజ్యసభ ద్వారా కేంద్రం దృష్టికి తీసుకెళ్లి, పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ప్రత్యేక హోదా, రైల్వేజోన్ ముఖ్యమైనవని తెలిపారు.  వైఎస్సార్‌సీపీ,  జగన్ మాత్రమే తమ ఆకాంక్షను నెరవేరుస్తారని ప్రజలు  భావిస్తున్నారన్నారు. జగన్ సీఎం కావాలని జనం కోరుకుంటున్నారని తెలిపారు. వారి కోరిక వచ్చే ఎన్నికల్లో నెరవేరుతుందన్నారు.

Advertisement
Advertisement