‘పరీవాహక’ భూములకు డిమాండ్‌ | Sakshi
Sakshi News home page

‘పరీవాహక’ భూములకు డిమాండ్‌

Published Sun, Jul 24 2016 11:48 PM

‘పరీవాహక’ భూములకు డిమాండ్‌ - Sakshi

సాక్షి, విజయవాడ బ్యూరో/కొల్లిపర :
 కృష్ణానది పరీవాహక ప్రాంతంలో ఇసుక మేట వేసిన పట్టా భూములకు డిమాండ్‌ పెరుగుతోంది. ఉచిత రీచ్‌ల్లోని ఇసుక తవ్వకాలను రద్దు చేస్తూ అధికారులు చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో నదీపరీవాహక భూములకు డిమాండ్‌ పెరుగుతోంది.  రెండు రోజుల క్రితం గుంటూరు జిల్లా కలెక్టర్‌ కాంతిలాల్‌ దండే 14 రీచ్‌ల్లోని ఇసుక తవ్వకాలను రద్దు చేశారు.  కృష్ణాజిల్లా కలెక్టర్‌  ఐదారు రీచ్‌ల్లో ఇసుక తవ్వకాలను రద్దు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. కృష్ణానదికి వరద వచ్చిన తరువాత కొత్త రీచ్‌లకు అనుమతి ఇస్తామని అధికారులు చెబుతున్నప్పటికీ, సాగునీటి విడుదలే ప్రశ్నార్థకమైన తరుణంలో వరద ఎక్కడ ఉంటుందని భావిస్తూ కొందరు వ్యాపారులు నదీపరీవాహక ప్రాంతాల్లోని పట్టా భూములను లీజుకు తీసుకుంటున్నారు. కొందరు టీడీపీ సానుభూతిపరులు, కార్యకర్తలకు ఉచితరీచ్‌ల్లోని ఇసుక తవ్వకాల రద్దు సమాచారం ముందుగానే తెలియడంతో పట్టా భూములు కలిగిన 30 మంది రైతులతో దరఖాస్తు చేయించారు. మరికొందరు రైతులను సంప్రదిస్తూ భూముల కొనుగోలు, కౌలుకు తీసుకునేందుకు సంప్రదింపులు జరుపుతున్నారు.  
కాగా,  నదికి ఎగువ భాగంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలు పెరుగుతున్న నేపథ్యంలో నదికి వరద వచ్చే అవకాశాలు తక్కువగా ఉండటంతో ప్రకాశం బ్యారేజి దిగువ ఆప్రాన్‌ పరిధిలోని కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని నదిపరీవాహక భూములను కౌలుకు, కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ప్రయత్నాలు ప్రారంభించారు. గుంటూరు జిల్లాలో దుగ్గిరాల, కొల్లిపర, కొల్లూరు, కృష్ణాజిల్లాలో నందిగామ, జగ్గయ్యపేట, పెనమలూరు నియోజకవర్గాల పరిధిలోని నదిపరీవాహక భూములపై దృష్టిని కేంద్రీకరించారు. గతంలో ఈ ప్రాంతాల్లోని భూములను ఆరు నెలలకు లీజుకు ఇచ్చేందుకు రైతులు రూ.3 నుంచి రూ.7 లక్షలు తీసుకునేవారు. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని లీజు మొత్తాలను రూ.10 లక్షల వరకు రైతులు చెబుతున్నారు. మరికొంత మంది వ్యాపారులు ఇసుక తవ్వకాలకు గతంలో ఎన్‌ఒసీ సరిఫికెట్లు పొందిన రైతులను సంప్రదిస్తున్నారు. ఇసుక రీచ్‌లు రద్దుకానున్నాయనే సమాచారం ముందుగానే తెలుసుకున్న టీడీపీ నేతలు, వారి అనుయాయులు 30 మంది రైతులతో  రెండు జిల్లాల మైనింగ్‌శాఖల వద్ద ఇంతకు ముందే ధరఖాస్తు చేయించారు. మొత్తంగా పుష్కరాల తరువాత పట్టా భూముల్లో ఇసుక తవ్వకాలకు అనుమతి వచ్చే అవకాశాలున్నాయని  అధికారులు చెబుతున్నారు.
త్వరలో ఉత్తర్వులు ..!
మార్చినెలలో రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక వి«ధానాన్ని అమలులోకి తీసుకువచ్చింది. సాంకేతిక నిపుణుల బృందం (రెవిన్యూ, మైనింగ్, గ్రౌండ్‌ వాటర్‌ డిపార్టుమెంట్లు) సూచనల మేరకు కృష్ణాజిల్లాలో 24, గుంటూరు జిల్లాలో 37 రీచ్‌ల్లో  ఇసుక తవ్వకాలకు అనుమతి ఇచ్చింది. ఆయా రీచ్‌ల్లో ఇసుక లభ్యతను ఆధారంగా చేసుకుని తవ్వకాలకు అనుమతి ఇచ్చింది. అయితే తమ సూచనల కంటే గుంటూరులోని 14 రీచ్‌ల్లో ఇసుక తవ్వకాలు ఎక్కువగా జరిగినట్టు గుర్తించిన నిపుణుల బృందం  జిల్లా యంత్రాంగానికి నివేదిక ఇచ్చింది. ఈ మేరకు కలెక్టర్‌ కాంతిలాల్‌ దండే ఆ రీచ్‌ల్లోని ఇసుక తవ్వకాలను రద్దు చేశారు. అలాగే కృష్ణాజిల్లాలోని 24 రీచ్‌ల్లో ఐదారింటిలో ఇసుక తవ్వకాలు ఎక్కువ జరిగినట్టు నిపుణుల బృందం జిల్లా యంత్రాంగానికి నివేదిక ఇవ్వనుంది. త్వరలో ఈ రీచ్‌ల్లోని తవ్వకాలను రద్దు చేస్తూ కలెక్టర్‌ ఉత్తర్వులు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. రద్దయిన రీచ్‌ల స్థానే∙కొత్త రీచ్‌లను గుర్తించి తవ్వకాలకు అనుమతి ఇస్తామని అధికారులు చెబుతున్నారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement