పొరుగు రాష్ట్రాల ఇసుకను నియంత్రించండి | Sakshi
Sakshi News home page

పొరుగు రాష్ట్రాల ఇసుకను నియంత్రించండి

Published Wed, Dec 2 2015 3:17 AM

పొరుగు రాష్ట్రాల ఇసుకను నియంత్రించండి

♦ అక్రమ రవాణా నిరోధానికి చెక్‌పోస్టుల ఏర్పాటు: మంత్రి హరీశ్
♦ హైదరాబాద్, రంగారెడ్డిలో మైనింగ్ జోన్లకు అనుమతి
♦ ‘సేవ్ గండిపేట’ మొదటి దశకు రూ.12 కోట్లు
 
 సాక్షి, హైదరాబాద్: పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమంగా రవాణా అవుతున్న ఇసుక మూలంగా రాష్ట్ర ఖజానాకు నష్టం వాటిల్లుతోందని నీటి పారుదల, మైనింగ్ శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. ఇసుక అక్రమ రవాణా నిరోధించేందుకు చెక్‌పోస్టుల నిర్వహణ మరింత కట్టుదిట్టంగా చేయాలని అధికారులను ఆదేశించారు. మైనింగ్‌తో పాటు వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో మంగళవారం సచివాలయంలో పలు అంశాలపై మంత్రి సమీక్ష నిర్వహించారు. పెద్దసంఖ్యలో సమీకృత చెక్‌పోస్టుల ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేయాల్సిందిగా ఆదేశించారు. మైనింగ్, రెవెన్యూ, వాణిజ్య పన్నులు, అటవీ, మార్కెటింగ్ శాఖల అధికారులు చెక్‌పోస్టుల ఏర్పాటు, నిర్వహణకు ప్రత్యేకంగా సమావేశం కావాలన్నారు.

హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో గుర్తించిన మైనింగ్ జోన్లకు అనుమతులు ఇవ్వాల్సిందిగా రెవెన్యూ, అటవీ శాఖల అధికారులను మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. రంగారెడ్డి జిల్లాలో 14 మండలాల్లో అక్రమంగా కొనసాగుతున్న మైనింగ్‌ను తక్షణమే అరికట్టాలని, మైనింగ్ జోన్లలో అనుమతులు పొందిన విస్తీర్ణం మేరకే మైనింగ్ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇసుకకు ప్రత్యామ్నాయంగా రాతి ఇసుక వాడకాన్ని ప్రోత్సహించేలా మైనింగ్ శాఖ కార్యాచరణ రూపొందించాల్సిందిగా సూచించారు. ఖమ్మం జిల్లాలో బెరైటీస్ లీజులపై ఉన్న కోర్టు కేసుల స్థితిగతులపై ఆరా తీశారు. కేసులను సత్వరమే పరిష్కరించుకుని సర్వే పూర్తి చేయాలన్నారు.

 సేవ్ గండిపేటకు మిషన్ కాకతీయ నిధులు
 హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో అత్యంత ప్రాధాన్యత కలిగిన గండిపేట చెరువును పరిరక్షించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి హరీశ్‌రావు సమీక్ష నిర్వహించారు. మిషన్ కాకతీయ ట్రస్టు ద్వారా నిధులు సేకరించి గండిపేట చెరువు పరిరక్షణ దిశగా పలు కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. గండిపేట చెరువు అభివృద్ధికి రూ. 50 కోట్లు అవసరమవుతాయని అంచనా వేయగా, తొలి విడతలో రూ.12 కోట్లతో ఎఫ్‌టీఎల్ నిర్ధారణ, వాకింగ్ ట్రాక్, ఫెన్సింగ్ తదితర పనులను ప్రతిపాదించారు. చెరువు అభివృద్ధికి సేవ్ గండిపేట పేరిట స్టార్ క్రికెట్ మ్యాచ్‌లు, బెనిఫిట్ షోలు, 10కె రన్ వంటివి నిర్వహించాలని సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్‌కు సూచించారు. సమావేశంలో నీటిపారుదల, రెవెన్యూ, పరిశ్రమల, పురపాలక శాఖల ముఖ్య కార్యదర్శులు ఎస్‌కే జోషి, బీఆర్ మీనా, అరవింద్‌కుమార్, ఎంజీ గోపాల్, అదనపు పీసీసీఎఫ్ శోభ, టీఎస్‌ఎండీసీ ఎండీ ఇలంబర్తి, సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement