ప్ర‘జల'రథాలు | Sakshi
Sakshi News home page

ప్ర‘జల'రథాలు

Published Wed, Apr 27 2016 3:44 AM

ప్ర‘జల'రథాలు - Sakshi

ప్ర‘జల’ సాక్షిగా ముందడుగు
నిన్న చలివేంద్రాలు.. నేడు వాటర్ ట్యాంకర్ల
ద్వారా నీరు గుండ్లమాచునూర్
గ్రామానికి నీటి సరఫరా
పచ్చజెండా ఊపి ట్యాంకర్లను ప్రారంభించిన కలెక్టర్


నిన్న చలివేంద్రాల ద్వారా బాటసారులకు బాసట.. నేడు వాటర్ ట్యాంకర్ల ద్వారా.. నీటి కోసం తల్లడిల్లుతున్న పల్లెలకు ఊరట.. ప్ర‘జల’ మస్యలను ప్రస్తావించడమేకాదు.. పరిష్కరించడంలోనూ ‘సాక్షి’ భాగస్వామి అవుతోంది.. గుక్కెడు నీళ్ల కోసం ప్రజలు తండ్లాడుతున్న వేళ.. అక్షరం.. ‘నీటి’బద్ధమైంది. కరువు నేలపై ప్రజల గొంతు తడిపేందుకు ‘జల’రథమై కదులుతూ.. అమృతధారలు కురిపిస్తోంది.. ఎండుతున్న గొంతులకు ‘జల’జీవాలనిస్తూ.. దాహార్తి తీరుస్తూ.. ప్ర‘జల’ సాక్షిగా ముందడుగు వేస్తోంది... మంగళవారం హత్నూర మండలం గుండ్లమాచునూర్‌లో ‘సాక్షి’ చేపట్టిన నీటి సరఫరా కార్యక్రమాన్ని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు.

విశ్వసనీయత పెరుగుతుంది
సేవా కార్యక్రమాలతో ‘సాక్షి’పై ప్రజల్లో ఇంకా విశ్వసనీయత పెరుగుతుంది. నీటిఎద్దడి సమయంలో పత్రిక చేసిన సాయం అభినందనీయం. ప్రభుత్వపరంగా జిల్లా లోని వెయ్యి గ్రామాల్లో బోర్లు అద్దెకు తీసుకొని, ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నాం. ఇందుకోసం ప్రత్యేకాధికారిని నియమించాం. స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది.       - రోనాల్డ్‌రాస్, కలెక్టర్

 హత్నూర/నర్సాపూర్: నీళ్ల కోసం నోళ్లు తెరిచిన ఆ పల్లెపై అమృతధారల కురిశాయి. నిన్నటి వరకు ప్రజల మదిని తొలచిన కన్నీటి వ్యథ తీరిపోయింది. ఁసాక్షి* చూపిన చొరవ, కోవలెంట్, హానర్ పరిశ్రమ సహకారంతో సమస్య గట్టెక్కింది. ఒక్కరోజు, రెండు రోజుల కార్యక్రమం కాదిది. ఏకంగా వర్షాలు పడే వరకు నిత్యం లక్ష లీటర్ల నీటి పంపిణీ జరగనుంది. మంగళవారం ప్రారంభమైన ‘జలధార’పై స్పెషల్ స్టోరీ...

 హత్నూర మండలం గుండ్లమాచునూర్, మదిర గ్రామం బొక్కలగూడెంలో 3,500 పైగా జనాభా ఉన్నారు. వరుస కరువులు పల్లెపై నీటి కష్టాలను కుమ్మరించాయి. పాతాళగంగను పైకి తెచ్చేందుకు గ్రామస్తులు విశ్వప్రయత్నాలు చేశారు. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్‌లో మొత్తం 26 బోర్లు వేయించారు. అయినా వాళ్ల గొంతుల తడి ఆరలేదు. ఈక్రమంలో గుండ్లమూచునూర్ జల కష్టాలు ‘సాక్షి’ని కదిలించాయి. ప్రజల జలగోసకు పరిష్కారం చూపించే దిశగా ముందడుగు వేసింది. గ్రామ శివార్లలోని కోవలెంట్, హానర్ పరిశ్రమల హెచ్‌ఆర్ మేనేజర్లు మోహన్‌రావు, సుభాష్‌రెడ్డిని ‘సాక్షి’ ప్రతినిధి కలిసి.. ప్రజల ఇబ్బందులు వివరించారు. ‘సాయం చేయండి, సాక్షి మీకు తోడుగా ఉంటుంది’అని హామీ ఇచ్చారు. దీంతో పరిశ్రమలు సుమారు లక్ష లీటర్ల నీటిని నిత్యం ట్యాంకర్ల ద్వారా అందించేందుకు అంగీకరించారు. వర్షాలు పడేంత వరకు ఈ బృహత్కార్యం కొనసాగిస్తామని భరోసా ఇచ్చారు.

 సంప్‌హౌస్ ద్వారా సరఫరా
జలధార పథకాన్ని కలెక్టర్ రోనాల్డ్‌రాస్ మంగళవారం ప్రారంభించారు. ఉదయం 11 గంటలకు రెండు ట్యాంకర్లు ఊరి పొలిమేర్లకు చేరుకున్నాయి. ప్రజలకు నేరుగా నీళ్లు అందిస్తే వృథా అవుతాయని భావించిన సర్పంచ్ ఈశ్వరమ్మ నర్సింహులు, ఎంపీటీసీ లావణ్య కృష్ణ, ఉప సర్పంచ్ నర్సింహారెడ్డి, హానర్.. కోవలెంట్ పరిశ్రమల హెచ్‌ఆర్ మేనేజర్లు సుభాష్‌రెడ్డి, మోహన్‌రావు, వార్డుసభ్యులు ఓ నిర్ణయం తీసుకున్నారు. శివారులోని సంప్‌హౌస్‌లో నీళ్లు నింపి అక్కడి నుంచి ఓవర్‌హెడ్ ట్యాంక్‌కు ఆపై నల్లాల ద్వారా నీరు సరఫరా చేయాలని భావించారు. ఇందుకోసం అవసరమైన విద్యుత్తును అందించేందుకు హానర్ పరిశ్రమ ముందుకొచ్చింది. దీంతో ఊరు మొత్తం నీళ్లు సరఫరా అయ్యాయి. తమ కష్టాలు తీర్చిన ‘సాక్షి’కి, కోవలెంట్, హానర్ పరిశ్రమలకు ఊరి ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement
Advertisement