పిల్లలందరికీ ‘అల్బెండజోల్‌’ అందించాలి | Sakshi
Sakshi News home page

పిల్లలందరికీ ‘అల్బెండజోల్‌’ అందించాలి

Published Fri, Feb 10 2017 10:47 PM

పిల్లలందరికీ ‘అల్బెండజోల్‌’ అందించాలి

► జిల్లా వైద్యాధికారి జలపతినాయక్‌
►  నేడు జిల్లావ్యాప్తంగా మాత్రల పంపిణీ


నిర్మల్‌ రూరల్‌ : జాతీయ నులిపురుగుల నిర్మూలన దినం సందర్భంగా శుక్రవారం జిల్లాలో నులిపురుగులను నివారిం చేందుకు పిల్లలందరికీ అల్బెండజోల్‌ మాత్రలు అందిస్తున్నామని డీఎంహెచ్‌వో జలపతినాయక్‌ అన్నారు. స్థానిక జిల్లా వైద్యశాఖాధికారి కార్యాలయంలో ఆయన గురువారం విలేకరులతో మాట్లాడారు. తప్పనిసరిగా పిల్లలందరికీ ఈ మాత్రలు చేరేలా ఏర్పాట్లు పూర్తి చేశామన్నా రు. ఇప్పటికే సిబ్బందికి శిక్షణ ఇచ్చామని చెప్పారు.

19ఏళ్ల లోపు వారికి..
ప్రతీ 100మంది పిల్లలో 68మంది పిల్లలు నులిపురుగులతో బాధపడుతున్నారని జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి (డీఐఓ) రాము తెలిపారు. కలుషిత ఆహారం, తాగునీరు తీసుకోవడం, తినేముందు, మలమూత్ర విసర్జనల తర్వాత చేతులు సబ్బుతో శుభ్రం చేసుకోకపోవడంతో పిల్లల కడుపులో నులిపురుగులు, నట్టలు తయారవుతాయన్నారు. వీటితో పిల్లలు శారీరకంగా, మానసికంగా ఎదగరని, ఎప్పుడూ సుస్తిగా ఉంటారన్నారు. వీటితో రక్తహీనత, ఎదుగుదల లోపం కూడా ఉంటుందన్నారు. ఒక ఏడాది నుంచి 19ఏళ్ల పిల్లల వరకు ఇవి కనిపిస్తాయని చెప్పారు. వీటి నివారణకు అల్బెండజోల్‌ మాత్రను ప్రతీ ఆరునెలలకొకటి చప్పరిస్తే సరిపోతుందన్నారు.

ఎవరికీ ఎలా అంటే..
నులిపురుగుల నిర్మూలనకు అల్బెండజోల్‌ మాత్రను మధ్యాహ్న భోజనం తర్వాత చప్పరించాలని డీఐవో పేర్కొన్నారు. ఆర్నెళ్లకోసారి ఒక మాత్రను మాత్రమే చప్పరించాలన్నారు. రెండేళ్లలోపు పిల్లలకు సగం మాత్రను దంచి పొడిగా చేసి గ్లాసు నీళ్లలో కలిపి తాగించాలన్నారు. రెండేళ్లపై నుంచి 19ఏళ్ల వరకు పిల్లలకు ఒక మాత్ర ఇవ్వాలన్నారు. వీటిని మింగకుండా చప్పరించేలా చూడాలని స్పష్టంచేశారు. జాతీయ నులిపురుగుల నిర్మూలన దినంలో భాగంగా శుక్రవారం జిల్లాలో 2లక్షల 14వేల 500మంది పిల్లలకు మాత్రలు అందిస్తున్నామన్నారు. ఇప్పటికే అన్ని పాఠశాలలు, అంగన్ వాడీలు, కళాశాలలకు మాత్రలను చేరవేశామని చెప్పారు. శుక్రవారం వేసుకోని పిల్లలకు ఈనెల 15న వేయించాలని పేర్కొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement