పర్సంటేజీ పేచీ | Sakshi
Sakshi News home page

పర్సంటేజీ పేచీ

Published Sun, Feb 19 2017 11:44 PM

పర్సంటేజీ పేచీ

ముఖ్యనేత కాసుల వేట  
అందుకోసం చిల్లర వేషాలు
రూ.కోటిన్నర రోడ్డుకు మోకాలడ్డు 
వేలాదిమందికి ఇబ్బందులు
 
‘ప్రజా సంక్షేమానికి పాటుపడే నాయకులు ఒకప్పుడుండేవారట!’ అనే రోజులు వచ్చేసేలాఉన్నాయి. ప్రజలెలా పోతే నాకేంటి? నాకు రావాల్సిన పర్సంటేజీ వస్తే చాలనుకుంటున్న నేతలే టీడీపీ హయాంలో ఎక్కువగా కనిపిస్తున్నారు. కోనసీమ కేంద్రమైన అమలాపురంలో ఓ నియోజకవర్గ నేత తీరు ఇలాగే ఉంది. పర్సంటేజీలు లేకుండా ఏ పనైనా చేసేది లేదంటూ తెగేసి చెబుతూండడంతో సహచర నేతలే నివ్వెరపోతున్నారు.
 
సాక్షి ప్రతినిధి, కాకినాడ : అమలాపురం శివారు ఇందుపల్లి వంతెన నుంచి భట్లపాలెం మీదుగా అమలాపురం ఎత్తు రోడ్డు వరకూ రెండు కిలోమీటర్ల పంచాయతీరాజ్‌ రహదారి ఉంది. ఆ రోడ్డుపై నిత్యం పది పన్నెండు వేల మంది ప్రయాణిస్తుంటారు. వీరిలో కళాశాలలు, పాఠశాలల విద్యార్థులే 3 వేల మంది పైగా ఉంటారు. ట్రాఫిక్‌ రద్దీ ఉండే అమలాపురం పట్టణంలోకి వెళ్లాల్సిన అవసరం లేకుండా.. అల్లవరం మండలం బోడసకుర్రు, సామంతకుర్రు, డి.రావులపాలెం, దేవగుప్తం, పేరూరు, పాశర్లపూడి నుంచి వచ్చేవారు ఇందుపల్లి మీదుగా అంబాజీపేట, పి.గన్నవరం, రావులపాలెం తదితర ప్రాంతాలకు వెళ్లేందుకు ఇది బాగా దగ్గర మార్గం. ఈ రోడ్డులో వెళ్తే మూడు కిలోమీటర్ల దూరం కూడా కలిసి వస్తుంది. ఇంత ముఖ్యమైన ఈ రోడ్డుకు పెద్ద పెద్ద గోతులు పడి, రాళ్లు పైకి లేచిపోవడంతో ప్రజలు మూడున్నరేళ్లుగా నిత్యం నరకం చవి చూస్తున్నారు. పదేపదే విజ్ఞప్తులు చేయగా.. రెండేళ్ల క్రితం ఈ రోడ్డు మరమ్మతుల కోసం జెడ్పీ నుంచి రూ.5 లక్షలు ఇచ్చారు. మరమ్మతులు చేశారు. మళ్లీ మామూలే అయిపోయింది.
గోదావరి పుష్కరాల మిగులు నిధుల నుంచి ఈ రోడ్డు ఆధునికీకరణ కోసం మూడు నెలల క్రితం రూ.1.50 కోట్లు కేటాయించారు. ఈ విషయం తెలిసి ఆ రోడ్డులో ప్రయాణించేవారు చాలా సంతోషించారు. ఈ రోడ్డుకు మహర్దశ పడుతుందని గంపెడాశతో ఎదురుచూస్తున్నారు. రోడ్డు పనులకు ఆన్‌లైన్‌ టెండర్లు కూడా పిలిచారు. రావులపాలేనికి చెందిన కాంట్రాక్టర్‌ పనులు దక్కించుకున్నారు. ఇక పనులు మొదలవుతాయని ఎదురు చూస్తున్న తరుణంలో నియోజకవర్గ ముఖ్య నేత ఒకరు ఆ రోడ్డుపై చిల్లర ఏరుకునేందుకు సిద్ధమయ్యారు. పర్సంటేజీ విషయంలో పేచీ మొదలు పెట్టారు. దీంతో రోడ్డు ఆధునికీకరణ పనులకు శంకుస్థాపన అర్ధాంతరంగా నిలిచిపోయింది. సాధారణంగా ఇటువంటి అభివృద్ధి పనులు చేపట్టేటప్పుడు ఆన్‌లైన్‌ టెండర్లయితే ఆ ప్రాంతానికి చెందిన ముఖ్య నేతకు 2 శాతం పర్సంటేజీ ఇవ్వడం ఆనవాయితీగా వస్తున్నదే. కానీ ఆ నియోజకవర్గ ముఖ్యనేత అందరి మాదిరిగా 2 శాతం కుదరదంటూ డీల్‌కు అంగీకరించలేదని సమాచారం. 2 శాతం పర్సంటేజీ అంటే రూ.3 లక్షలివ్వాలి. దీనికి మరో రూ.లక్ష వేసి రూ.4 లక్షలు ఇస్తామని ఆ నేత వద్దకు రెండో దఫా ప్రతిపాదన రాగా తిరస్కరించారు. కాయగూరల బేరంలా ఇటువంటివేమీ కుదరవని, ఇస్తే రూ.8 లక్షలు ఇవ్వాలని, లేకుంటే తనకు ముఖం చూపించవద్దని ఆ నేత కేకలు వేసి పంపించేశారని చెబుతున్నారు.
ఆందోళన చేస్తే కేసులంటూ బెదిరింపులు
ఈ పరిస్థితుల్లో ని««దlులు సిద్ధంగా ఉన్నా పనులు ముందుకు కదలకపోవడంతో ఆగ్రహించిన స్థానికులు ఇటీవల మూడు గంటలపాటు ఆందోళన చేశారు. వారికి సంఘీభావంగా ఆ రోడ్డుపై నిత్యం ప్రయాణిస్తూ ఇబ్బందులు ఎదుర్కొంటున్న బీవీసీ ఇంజినీరింగ్‌ కళాశాల విద్యార్థులు సైతం ధర్నాలో పాల్గొన్నారు. ఈ ఆందోళన ఆ నేతకు ఎంతమాత్రం రుచించలేదు. ఆందోళన చేసిన స్థానికులతోపాటు కాలేజీ విద్యార్థులపై కూడా కేసులు నమోదు చేయాలని అమలాపురం పోలీసులపై ఒత్తిడి తీసుకువచ్చి తన అక్కసు వెళ్లగక్కారు. ఇప్పటికీ విద్యార్థులపై కేసులు పెట్టమంటున్నారని తెలిసింది. పనుల శంకుస్థాపన జరగకపోవడానికి ఆ నేతకు పర్సంటేజీ పేచీయే కారణం కాగా, పైకి మాత్రం ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్పకు డేట్‌లు సర్దుబాటు కావడం లేదనే కుంటిసాకులు చెబుతున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement