ఆవశ్యం.. లీచ్‌ పిట్‌ టెక్నాలజీ | Sakshi
Sakshi News home page

ఆవశ్యం.. లీచ్‌ పిట్‌ టెక్నాలజీ

Published Sun, Feb 19 2017 10:11 PM

ఆవశ్యం.. లీచ్‌ పిట్‌ టెక్నాలజీ - Sakshi

మలం నుంచి క్లీన్‌ కంపోస్ట్‌
తయారుచేసే పరిజ్ఞానం అద్భుతం
పంట పొలాలకు అత్యంత సురక్షితమైన సేంద్రియ ఎరువు
 కేంద్ర ఆర్‌డబ్ల్యూఎస్, శానిటేషన్‌ సెక్రటరీ  పరమేశ్వరన్‌ అయ్యర్‌


హన్మకొండ : ‘లీచ్‌ పిట్‌ టెక్నాలజీ’ (రెండు గుంటల పద్ధతి)తో మరుగుదొడ్లను నిర్మించుకుని మలం నుంచి అత్యంత సురక్షితమైన సేంద్రియ ఎరువును తయారుచేసే పరిజ్ఞానం ప్రపంచానికి ఆవశ్యకమని కేంద్ర ప్రభుత్వ ఆర్‌డబ్ల్యూఎస్‌ అండ్‌ శానిటేషన్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ పరమేశ్వరన్‌ అయ్యర్‌ అన్నారు. కేంద్ర ఆర్‌డబ్ల్యూఎస్‌ అండ్‌ శానిటేషన్‌ సంయుక్త కార్యదర్శి అరుణ్‌ బొరోఖా, డైరెక్టర్‌ నిపుణ్‌ వినాయక్, రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ నీతూప్రసాద్‌తో పాటు 26 రాష్ట్రాల గ్రామీణాభివృద్ధి, పీఆర్‌ సెక్రటరీలు, స్వచ్ఛభారత్‌ మిషన్‌ డైరెక్టర్లు, ఎన్‌ఐఆర్‌డీ, యూనిసెఫ్‌ ప్రతినిధులతో కలిసి ఆయన శనివారం జాతీయ ఆదర్శ గ్రామమైన గంగదేవిపల్లిని సందర్శించారు. ఈ సందర్భంగా ‘లీచ్‌ పిట్‌ టెక్నాలజీ’తో నిర్మించిన మరుగుదొడ్లను పరిశీలించారు. ఆ తర్వాత పరమేశ్వరన్‌ అయ్యర్‌ మాట్లాడుతూ రెండు గుంటల పద్ధతిలో మరుగుదొడ్లను  నిర్మించుకోవడం చాలా శుద్ధమైన, భద్రమైన పరిజ్ఞానమన్నారు. మలం నుంచి తయారైన క్లీన్‌ కంపోస్ట్‌ సేంద్రియ ఎరువు రసాయన ఎరువులతో పోలిస్తే అత్యంత సురక్షితమన్నారు. అదేవిధంగా పారిశుద్ధ్య నిర్వహణ విషయంలో ఈ విధానం తిరుగులేనిదని తెలిపారు. కాగా, లీచ్‌ పిట్‌ టెక్నాలజీతో పారిశుద్ధ్య నిర్వహణ చేయడంతో పాటు మలం నుంచి అత్యంత సురక్షితమైన ఎరువును తయారు చేసే విషయంలో గంగదేవిపల్లి గ్రామం ప్రపంచంలోనే 15 ఏళ్లు ముందుందని అయ్యర్‌ కొనియాడారు.

ఇదీ ‘లీచ్‌ పిట్‌ టెక్నాలజీ’...
లీచ్‌ పిట్‌ టెక్నాలజీ (రెండు గుంటల విధానం)లో మరుగుదొడ్డి నిర్మించుకునే సమయంలో పక్కపక్కనే రెండు సెప్టిక్‌ ట్యాంకులు కడతారు. ముందుగా ఒక ట్యాంక్‌ పూర్తిగా నిండిన తర్వాత దానిని మూసివేసి రెండో ట్యాంక్‌కు మలం వెళ్లేలా చేస్తారు. రెండేళ్ల తరువాత మొదటి ట్యాంక్‌లో ఉన్న మలం మొత్తం సురక్షితమైన సేంద్రియ ఎరువుగా మారుతుంది.గంగదేవిపల్లిలో 2000 సంవత్సరంలోనే 100శాతం మరుగుదొడ్లను లీచ్‌ పిట్‌ టెక్నాలజీతో నిర్మించి ప్రపంచానికే ఆదర్శంగా నిలబడ్డారు.

వావ్‌... ఇట్స్‌ గోల్డ్‌!
గీసుకొండ(పరకాల) : వావ్‌.. ఇట్స్‌ గోల్డ్‌.. అని ఒకరు అంటుంటే.. మరొకరు ‘యే కాఫీ పౌడర్‌ జైసేహే.. వెరీ స్మూత్‌‘ అని మరొకరు.. ఇలా గంగదేవిపల్లిని సందర్శించిన కేంద్ర ప్రభుత్వ,యూనిసెఫ్‌ అ«ధికారులు అన్నారు. గ్రామంలో వ్యక్తిగత మరుగుదొడ్ల మలం వెళ్లడానికి ఏర్పాటు చేసుకున్న రెండు పిట్లలో ఒక పిట్‌ ఏడాది క్రితం నిండిపోగా, మరో పిట్‌కు కనెక్షన్‌ ఇచ్చుకున్నరు. మలంతో నిండిపోయి , ఆ తర్వాత ఎండిపోయి మట్టిగా మారిన పిట్‌ పరిశీలించేందుకు అధికారులు రాగా.. పిట్‌ తెరిచి ఉండడంతో తొలుత కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి పరమేశ్వరన్‌ అయ్యర్‌ ఒక్కసారిగా అందులోకి దిగి మట్టి రూపంగా ఎండిపోయి ఉన్న మలంను బయటకు తోడారు. ఆ తర్వాత చేతుల్లోకి తీసుకని వావ్‌.. గోల్డ్‌లా ఉంది. కాఫీ పౌడర్‌లా మెత్తగా ఉందంటూ చమత్కరించారు. గ్లవ్స్‌ లేకుండానే చేతులతో పిట్స్‌లోని మట్టి తవ్వడం ద్వారా ప్రజల్లో ఉన్న అపోహలు తెలగించే ప్రయత్నం చేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement