దౌర్జన్య పాలన సహించం | Sakshi
Sakshi News home page

దౌర్జన్య పాలన సహించం

Published Mon, Jul 25 2016 3:56 AM

దౌర్జన్య పాలన సహించం - Sakshi

 నిర్వాసితులపై లాఠీచార్జి అమానుషం: కోదండరాం
 సంగారెడ్డి టౌన్ /రేగోడ్: శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మల్లన్నసాగర్ భూనిర్వాసితులపై పోలీసుల లాఠీచార్జి అమానుషమని టీజేఏసీ చైర్మన్  ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ‘మనది పోరాడి తెచ్చుకున్న తెలంగాణ.. ఇక్కడ దౌర్జన్య పాలనను సహించం’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అవసరం లేని ప్రాజెక్టు కోసం బలవంతంగా భూసేకరణ చేయడమే కాకుండా రైతులపై లాఠీచార్జి చేయడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. ఈ ప్రాజెక్టుపై ఉద్యమిస్తున్న వారిని ప్రభుత్వం టార్గెట్ చేసిందన్నారు.
 
 దాడిని ప్రతి ఒక్కరూ ఖండించాలని పిలుపునిచ్చారు. ఆదివారం మెదక్ జిల్లా సంగారెడ్డిలో, అంతకుముందు రేగోడ్ మండలం దోసపల్లిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘ప్రాజెక్టులు ప్రజల అవసరానికి ఉపయోగపడాలి తప్ప.. ప్రభుత్వాలకు కాదు. ప్రాజెక్టు కట్టి తీరుతామని రైతుల్ని భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. సాదాబైనామాలతో రైతులను బెదిరిస్తూ రిజిస్ట్రేషన్లు చేసుకోవడం అన్యాయం. రైతులతో చర్చిస్తేనే మల్లన్నసాగర్ భూ సేకరణ సమస్య పరిష్కారం అవుతుంది’’ అని అన్నారు. ప్రభుత్వాలు అంబేడ్కర్ ఆశయ సాధనకు కృషి చేస్తున్నట్టు చెబుతున్నా.. ఆచరణలో విఫలం అవుతున్నాయన్నారు. ఎస్సీల  వర్గీకరణ అమలు కావాలని కోరుతున్నామన్నారు.
 
 అమానుషం: జస్టిస్ చంద్రకుమార్
 మల్లన్నసాగర్ ప్రాజెక్టు బాధిత రైతులపై పోలీసులు లాఠీచార్జి చేయడం అమానుషం అని రైతు సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ చైర్మన్, తెలంగాణ రైతు సంక్షేమ సమితి అధ్యక్షుడు జస్టిస్ చంద్రకుమార్ ఒక ప్రకటనలో  పేర్కొన్నారు. లాఠీచార్జిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న రైతులపై పోలీసులు నిర్దాక్షిణ్యంగా లాఠీచార్జి చేశారని పేర్కొన్నారు.

Advertisement
Advertisement