ఖేడ్.. ష్..! | Sakshi
Sakshi News home page

ఖేడ్.. ష్..!

Published Fri, Feb 12 2016 2:42 AM

ఖేడ్.. ష్..! - Sakshi

ముగిసిన ప్రచారం నేతల తిరుగుపయనం
పోలింగ్‌కు సర్వంసిద్ధం162 గ్రామాల్లో 286 కేంద్రాలు
119 సమస్యాత్మక కేంద్రాలు భారీ బందోబస్తు


సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి/నారాయణఖేడ్: నారాయణఖేడ్‌లో ఎన్నికల ప్రచారం ముగిసింది. మరోవైపు పోలింగ్‌కు అధికారులు సర్వం సిద్ధం చేశారు. శనివారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. ప్రచారం కోసం వచ్చిన వివిధ పార్టీల నాయకులు నియోజకవర్గాన్ని వదిలివెళ్లిపోయారు. టీఆర్‌ఎస్ పార్టీకి అన్నీ తానై నడిపిన భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు సాయంత్రం నాలుగు గంటలకే పటాన్‌చెరుకు వెళ్లారు. కాంగ్రెస్ నాయకులు దామోదర రాజనర్సింహతో పాటు వివిధ  రాజకీయ పార్టీలకు చెందిననేతలు కూడా నియోజకవర్గాన్ని వదిలి వెళ్లారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి వాసం వెంకటేశ్వర్లు  నియోజకవర్గాన్ని పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకున్నారు.

నియోజకవర్గంలోని 162 రెవెన్యూ గ్రామాల్లో 1.89 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వీళ్ల కోసం  286 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి, 1,174 మంది ఎన్నికల సిబ్బందిని నియమించారు. నియోజకవర్గాన్ని  33 సెక్టార్లుగా విభజన చేసి  ప్రతి సెక్టార్‌కు ఒక రూట్ అధికారి, ఒక సెక్టార్ అధికారికి, మోడల్ కోడ్‌ఆఫ్ కండక్ట్ అధికారి, ఫ్లయింగ్ స్క్వాడ్‌ను  నియమించారు. సెల్ ఫోన్‌సిగ్నిల్స్ అందిన 282 పోలింగ్  కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌ను ఏర్పాటు చేశారు. ఇందుకోసం కోసం 300మంది విద్యార్థులను సిద్ధం చేశారు. 125 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించారు.

ప్రతి పోలింగ్ కేంద్రంలో పోలింగ్ సరళిని  వీడియో తీస్తామని ఎన్నికల అధికారి వాసం వెంకటేశ్వర్లు  తెలిపారు. 286 పోలింగ్ కేంద్రాలకు  286 ఈవీఎంలను సిద్ధం చేశారు. ఎక్కడైనా ఈవీఎంలలో సాంకేతిక సమస్యలు తలెత్తితే  అత్యవసర సమయంలో ఉపయోగించుకోవడానికి మరో 100  ఈవీఎంలను ఏర్పాటు చేశారు.  వీటిని ప్రస్తుతానికి నారాయణఖేడ్‌లోని  పాలిటెక్నిక్ కళాశాలలోని స్ట్రాంగ్ రూంలో భద్రపరిచారు. శుక్రవారం ఉదయం పోటీలో ఉన్న అభ్యర్థుల సమక్షంలో స్ట్రాంగ్‌రూం నుంచి ఈవీఎంలను ఎన్నికల అధికారులకు అప్పగిస్తారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి ఒక పోలింగ్ అధికారి, ముగ్గురు సిబ్బందిని నియమిస్తున్నారు. ఈవీఎంల సాంకేతిక  సమస్య  తక్షణ నివారణకు ఐదుగురు ఇంజనీర్లను అందుబాటులో ఉంచారు.. 

 20 మోడల్ పోలింగ్ కేంద్రాల ఏర్పాటు
నియోజకవర్గంలో 20 మోడల్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ పోలింగ్ కేంద్రాల్లో ఆహ్లాదకర వాతావరణం కల్పించనున్నారు. ఓటువేసేందుకు వెళ్ళిన ప్రతి ఓటరుకు గులాబిపువ్వు ఇచ్చి అధికారులు స్వాగతం పలుకుతారు. షెల్టర్‌తోపాటు, తాగేందుకు మంచినీళ్లు, మజ్జిగ అందుబాటులో ఉంచుతున్నారు. 95 శాతం పోలింగ్ నమోదైన పంచాయతీకి రూ.2లక్షల నజరానా ఇవ్వనున్నట్లు రిటర్నింగ్ అధికారి వాసం వెంకటేశ్వర్లు తెలిపారు.

 సమస్యాత్మక కేంద్రాలపై నిఘా
నియోజకవర్గంలో 54 అత్యంత సమస్యాత్మక, మరో 65 సమస్యాత్మకంగా పోలింగ్ కేంద్రాలను అధికారులు గుర్తించారు. అతి సమస్యా త్మక పోలింగ్ కేంద్రాల వద్ద పారామిలటరీ బలగాలు, సివిల్, సాయుధ పోలీసులను నియమిస్తున్నారు.

 మొబైల్  పోలింగ్ బలగాలు ఎప్పటికప్పుడు ఈ  పోలింగ్ కేంద్రాలను పర్యవేక్షిస్తుంటాయి. ఇప్పటివరకు 1398 మందిని బైండోవర్ చేశారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన మూడు ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులకు ఎన్నికల అధికారులు ఇప్పటికే  షోకాజ్ నోటీసులు జారీచేశారు. ఈ నోటీసులకు వారు ఆర్‌ఓకే సమాధానం ఇచ్చినట్లు రిటర్నింగ్ అధికారి తెలిపారు.

Advertisement
 
Advertisement
 
Advertisement