తాడిపత్రి కోర్టుకు ఇప్పాల | Sakshi
Sakshi News home page

తాడిపత్రి కోర్టుకు ఇప్పాల

Published Sat, May 27 2017 11:28 PM

తాడిపత్రి కోర్టుకు ఇప్పాల - Sakshi

-  రవీంద్రకు బెయిల్‌ మంజూరు చేసిన న్యాయస్థానం
- వైఎస్సార్‌సీపీ నాయకుల సంఘీభావం
- పోలీసుల ఓవరాక‌్షన్


తాడిపత్రి రూరల్‌ : ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు పోస్టు చేశారంటూ స్థానిక జెడ్పీటీసీ సభ్యురాలు సావిత్రి వేసిన ప్రైవేటు కేసుకు సంబంధించి బెంగళూరుకు చెందిన సోషల్‌ మీడియా యాక్టివిస్టు ఇప్పాల రవీంద్రను పోలీసులు శనివారం తాడిపత్రి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆయనకు బెయిల్‌ మంజూరు చేసింది. ఇప్పటికే రవీంద్ర మరో కేసుకు సంబంధించి వైజాగ్‌ కేంద్ర కారాగారంలో రిమాండ్‌లో ఉన్నారు. ఆయనను అక్కడి నుంచి తీసుకొచ్చిన పోలీసులు శనివారం ఇక్కడి కోర్టులో హాజరుపర్చగా బెయిల్‌ మంజూరైంది. అనంతరం తిరిగి వైజాగ్‌ తీసుకెళ్లారు. సెక‌్షన్‌ 501 ఐపీసీయూ/ఎస్‌66ఏ(బి)ఆఫ్‌ ఐపీ యాక్ట్‌ 156(3)సీ ఆర్‌పీసీ కింద(క్రైం నెంబరు 78/17) కేసు నమోదైందని, ఇందులో భాగంగానే రవీంద్రను తాడిపత్రి కోర్టులో హాజరుపరిచామని పట్టణ సీఐ భాస్కర్‌రెడ్డి తెలిపారు.

పోలీసుల ఓవరాక‌్షన్‌
కోర్టుకు హాజరుపర్చడానికి ముందు రవీంద్రను పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఉంచారు. ఆయన్ను పరామర్శించడానికి వైఎస్సార్‌సీపీ తాడిపత్రి నియోజకవర్గ సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆధ్వర్యంలో పలువురు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు స్టేషన్‌ వద్దకు చేరుకున్నారు. వారిని రవీంద్రతో మాట్లాడడానికి అనుమతించకుండా పోలీసులు ఓవరాక‌్షన్‌ చేశారు.

సంఘీభావం తెలిపిన ప్రముఖ నేతలు
రవీంద్రకు వైఎస్సార్‌సీపీ నేతలు సంఘీభావం తెలిపారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత వెంకటరామిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు శంకర్‌నారాయణ, ఎమ్మెల్సీ గోపాల్‌రెడ్డి, తాడిపత్రి  సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి రమేష్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి వీఆర్‌ వెంకటేశ్వరరెడ్డి, జిల్లా నాయకులు రాగేపరశురాం, కౌన్సిలర్‌ మున్నా తదితరులు తామున్నామంటూ  భరోసా ఇచ్చారు. అనంతరం వారు మాట్లాడుతూ సోషల్‌ మీడియాలో వైఎస్సార్‌సీపీకి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకనే నెటిజన్లపై  కేసులు బనాయిస్తోందని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో సోషల్‌ మీడియా సాయంతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఇప్పుడు అదే  మీడియాను కట్టడి చేయాలని చూస్తుండటం దారుణమన్నారు. టీడీపీ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరించారు. కేసులు, బెదిరింపులతో సోషల్‌ మీడియా కార్యకర్తలను అడ్డుకోలేరని స్పష్టం చేశారు.

Advertisement
 
Advertisement
 
Advertisement