యంత్రాంగం కదిలింది | Sakshi
Sakshi News home page

యంత్రాంగం కదిలింది

Published Tue, Aug 23 2016 11:47 PM

యంత్రాంగం కదిలింది - Sakshi

సాగు నీరందక రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఎట్టకేలకు ప్రభుత్వ యంత్రాంగంలో కదలిక వచ్చింది. జిల్లాలో వరి సాగు దుస్థితిపై ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురిస్తున్న విషయం విదితమే. ముఖ్యమంత్రి ఎన్‌.చంద్రబాబు నాయుడు అట్టహాసంగా ప్రారంభించిన ఏరువాక కార్యక్రమం సైతం అభాసు పాలైన విషయాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. 
 
సాక్షి  ప్రతినిధి, ఏలూరు :
నరసాపురం మండలం చిట్టవరంలో స్వయంగా చంద్రబాబు నాట్లు వేసిన పొలంలోనూ నాట్లు ఎండిపోయి తుంగ గడ్డి మొలి చింది. ఈ దుస్థితిపై ‘నారుపోసి.. నీళ్లు మరిచి’ శీర్షికన 23వ తేదీ సంచిక మెయిన్‌ 11వ పేజీలో పరిశీలనాత్మక కథనం ప్రచురితమైంది. దీంతో జిల్లా కలెక్టర్‌ కాటంనేని భాస్కర్, ఇరిగేషన్‌ 
అధికారులు మంగళవారం డెల్టా మండలాల్లోని వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లారు. నీరందకపోవడానికి కారణాలేమిటనే విషయాన్ని పరిశీలించారు. శివారు ప్రాంతాలకు నీరు రాకుండా వేసిన అనధికార తూములను తొలగించాలని నిర్ణయించారు. అవసరమైతే మోటార్లు ఏర్పాటు చేసి నీరు అందించాలని అధికారులను ఆదేశించారు. ఆచంట, పాలకొల్లు, నరసాపురం, నిడదవోలు నియోజకవర్గాల్లో కలెక్టర్, నీటి పారుదల శాఖ అధికారులు పర్యటించారు. కాలువలు, ్రyð యిన్లలో ఏర్పాటు చేసిన అనధికారిక తూములను రాజకీయ వత్తిళ్లకు తలొగ్గకుండా తక్షణమే తొలగించాలని ఆదేశించారు.  వాతావరణ మార్పుల కారణంగా నీరంతా అవిరైపోతోందని,  కాలువలో నీరున్నా శివారు ప్రాంతాలకు అందడం లేదని కలెక్టర్‌ అభిప్రాయపడ్డారు. జిల్లాకు 6వేల క్యూసెక్కుల నీరు అవసరం కాగా, 7,300 క్యూసెక్కుల నీటిని వదులుతున్నా సరిపోవడం లేదన్నారు. జూన్, జూలై నెలల్లో పూర్తి కావాల్సిన నాట్లు ఇప్పటివరకూ కాలేదని, ప్రస్తుతం సుమారు 6 వేల ఎకరాలకు నీరు అందడం లేదని గుర్తించామన్నారు. రెండు రోజుల్లో ఈ సమస్యను పరిష్కరిస్తామన్నారు. అవసరమైతే అడ్డుకట్టలు వేసి సాగునీరు అందిస్తామన్నారు. బ్యాంక్‌ కెనాల్, రాపాక చానల్, చించినాడ చానెల్‌ పరిధిలో లో 16, 17 గ్రామాలకు తీవ్ర నీటిఎద్దడి ఉందన్నారు. ప్రధానంగా వర్షాలు కురవకపోవడం వల్ల శివారు భూములకు కాలువల ద్వారా సాగునీరు సక్రమంగా అందక ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. రెవెన్యూ, ఇరిగేషన్, వ్యవసాయ శాఖ అధికారులు, నీటిసంఘాల అధ్యక్షులు సమన్వయంతో పనిచేసి అవసరమైన చోట మోటార్లు ఏర్పాటు చేసుకుని నీటిని తోడుకోవాలన్నారు. అవసరమైన చోట్ల ఆయిల్‌ ఇంజిన్లు ఏర్పాటు చేసి శివారు భూములు ఎండిపోకుండా సాగునీరు అందిస్తామన్నారు. జిన్నూరు కాలువ పొడవునా అనధికార తూములు ఏర్పాటు చేసుకోవడంతో శివారు ప్రాంతాలకు నీరందడం లేదని రైతులు కలెక్టర్‌ దృష్టికి తీసుకు రాగా, వెంటనే తొలగించాలని ఇరిగేషన్‌ ఈఈని ఆదేశించారు. వడలి సుబ్బారాయుడుపుంత వద్ద రైతులు కలెక్టర్‌ రాక కోసం ఎదురుచూశారు. ఆయన పెనుగొండ మండలంలో ఎక్కడా ఆగకుండా నేరుగా ఆచంట మండలానికి వెళ్లిపోవడంతో రైతులు  నిరాశకు గురయ్యారు. 
 

 

Advertisement

తప్పక చదవండి

Advertisement