‘దివీస్’ భగభగలు | Sakshi
Sakshi News home page

‘దివీస్’ భగభగలు

Published Mon, Aug 29 2016 3:25 AM

‘దివీస్’ భగభగలు - Sakshi

- లేబొరేటరీ పనులను అడ్డుకున్న రైతులు
నిర్మాణ సామగ్రి దహనం.. పెద్ద ఎత్తున నినాదాలు
- రైతుల ఆందోళనకు అండగా  వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే రాజా
 
 తొండంగి
 తూర్పు గోదావరి జిల్లా తొండంగి మండలం కోన తీరప్రాంతంలో దివీస్ లేబొరేటరీస్ పరిశ్రమ ఏర్పాటును వ్యతిరేకిస్తూ పరిసర గ్రామాల రైతులు ఆ భూముల్లోకి ఆదివారం ప్రవేశించి పనులను అడ్డుకున్నారు. దానవాయిపేట పంచాయతీ కొత్తపాకలు గ్రామంలో ప్రభుత్వం దివీస్ లేబొరేటరీస్‌కు 505 ఎకరాలు కేటాయించింది. ఇటీవల రెవెన్యూ అధికారులు ఎకరాకు రూ.5 లక్షల పరిహారం చెల్లించి కొంతమంది రైతుల నుంచి భూములు సేకరించారు. అయితే ఈ పరిశ్రమ వల్ల పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని, గాలి, నీరు, నేల కలుషితమై తీరప్రాంత గ్రామాల మనుగడ దెబ్బ తింటుందని పేర్కొంటూ.. పంపాదిపేట, కొత్తపాకలు, తాటియాకులపాలెం తదితర గ్రామాల రైతులు భూములిచ్చేది లేదంటూ తీవ్రంగా వ్యతిరేకించారు. సమస్యను తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా దృష్టికి తీసుకువెళ్లి తమకు న్యాయం చేయాలని కోరగా పంపాదిపేటలో బాధిత రైతులతో ఎమ్మెల్యే ఆదివారం చర్చించారు.

దివీస్ సేకరించిన భూముల్లో క్లియరింగ్ పనులు రెండు రోజుల క్రితం ప్రారంభమయ్యాయని రైతులు వివరించారు. అక్కడున్న మహిళలు, రైతులతో కలిసి ఎమ్మెల్యే రాజా పాదయాత్రగా పరిశ్రమకు సేకరించిన భూముల పరిశీలనకు వెళ్లారు. తాటియాకులపాలేనికి చెందిన రైతు ఎన్.నాగేశ్వరరావు భూమిలో దివీస్ ప్రతినిధులు బలవంతంగా పనులు నిర్వహిస్తున్నారని గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆగ్రహానికి గురైన రైతులు తమపై బలప్రయోగానికి దిగితే ఊరుకునేది లేదని హెచ్చరిస్తూ.. అక్కడ షెడ్డు నిర్మించేందుకు వేసిన స్తంభాలను, తాటిదూలాలను తొలగించారు. తాటియాకులను తగలబెట్టి నిరసన తెలిపారు. పరిశ్రమ నిర్మాణ పనులు సాగనివ్వబోమని నినాదాలు చేశారు.

 రైతులకు అండగా వైఎస్సార్‌సీపీ: ఎమ్మెల్యే రాజా
  కాకినాడ సెజ్ ప్రాంతంలో సేకరించిన భూములు ఖాళీగా ఉండగా.. పేద రైతుల భూములను తక్కువ ధరకు బలవంతంగా సేకరించడం అన్యాయం. సెజ్ ప్రాంతంలో పరిశ్రమను స్థాపిస్తే ఎకరాకు రూ.70 లక్షల చొప్పున దాదాపు రూ. 350 కోట్లు అవుతుందని, కానీ, కోన ప్రాంతంలోని పేద రైతుల భూములను రూ. 25 కోట్లకే చేజిక్కించుకునేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోంది. ఎన్నో ఏళ్లుగా భూమినే నమ్ముకుని బతుకుతున్న తీరప్రాంత రైతులంతా పరిశ్రమ స్థాపనతో వచ్చే కాలుష్యం వల్ల వలస పోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ ప్రాంత ప్రజల మనుగడను ప్రశ్నార్థకం చేసే దివీస్ పరిశ్రమ స్థాపనను ప్రభుత్వం విరమించుకునే వరకూ ఎమ్మెల్యేగా, వైఎస్సార్‌సీపీ నేతగా ప్రజల పక్షాన పోరాడతాను.

Advertisement
Advertisement