మాలో కోటీశ్వరులకు రిజర్వేషన్లు ఇవ్వక్కర్లేదు | Sakshi
Sakshi News home page

మాలో కోటీశ్వరులకు రిజర్వేషన్లు ఇవ్వక్కర్లేదు

Published Mon, Feb 8 2016 2:08 PM

మాలో కోటీశ్వరులకు రిజర్వేషన్లు ఇవ్వక్కర్లేదు - Sakshi

కాపు  రిజర్వేషన్ సమస్యను రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టికి తీసుకెళ్లేందుకు చేసిన దీక్ష తగిన ఫలితం ఇవ్వడంతో దీక్షను విరమించానని.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ హామీలు అమలయ్యేలా చూసే బాధ్యతను ఇకమీదట కూడా చేపడతానని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తెలిపారు. కాపులలో కూడా పేదవారికి మాత్రమే రిజర్వేషన్లు కోరుతున్నామని, ఇందులో లక్షాధికారులు, కోటీశ్వరులకు అక్కర్లేదని ఆయన స్పష్టం చేశారు. కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలను బీసీలలో కలుపుతామని సీఎం కూడా అనేక సభల్లో చెప్పారన్నారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో చేరుస్తామని చెప్పినా.. తర్వాత వేర్వేరు సమస్యల కారణంగా దాన్ని అమలు చేయలేదని, తాను రోడ్డెక్కాక స్పందించి.. తనను ఒక మెట్టు దిగమన్నారని, అవసరమైతే రెండు మెట్లు దిగుతానని, జాతికి మంచి జరగాలన్నదే తన ఉద్దేశమని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి పంపిన బృందం చేసిన ప్రతిపాదనలలో చిన్న చిన్న సడలింపులున్నా, జాతి హితం కోసం తాను అంగీకరించినట్లు వెల్లడించారు.

తాను ఎప్పుడూ సీఎంను కావాలని తిట్టాలని గానీ, అవమానించాలని గానీ తాను దీక్ష చేపట్టలేదని.. తన జాతి ఆకలి కేకలు తట్టుకోలేక రోడ్డెక్కాను తప్ప తనకు ఎవరినీ అవమానించే ఆలోచన లేదని అన్నారు
20 ఏళ్లుగా ఈ ఉద్యమాన్ని అణచిపెట్టుకున్నామని.. అయితే ఇప్పటికీ దానిపై స్పందన లేకపోవడం, అలాంటి సందర్భంలో సీఎం బలమైన హామీ ఇవ్వడం వల్లే దాన్ని నెరవేర్చాలని తాము రోడ్డెక్కామన్నారు. ఆ హామీ అమలు ఆలస్యం కావడంతో పలు రకాల అనుమానాలు వచ్చి.. అనరాని మాటలు అని ఉంటానని, వాటికి క్షమించాలని కోరారు. మంజునాథ కమిషన్ నివేదిక తెప్పించుకుని, కేబినెట్‌లో పెట్టి, కేంద్రానికి పంపి అక్కడ కూడా ఆమోదింపజేస్తే మీ ఇంటికొచ్చి పళ్లెంలో కాళ్లు కడుగుతామని ఆయన అన్నారు. తమ జాతికి తగిన ఫలాలు ఇస్తే సీఎం కాళ్లు మొక్కడానికి కూడా ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపారు. అత్యంత పేదవారికి మాత్రమే రిజర్వేషన్లు కావాలని అడుగుతున్నాం తప్ప.. ఇందులో లక్షాధికారులు, కోటీశ్వరులకు అక్కర్లేదని స్పష్టం చేశారు. రిజర్వేషన్లు ఇచ్చే సమయంలోనే ఈ క్లాజు కూడా పెట్టాలని చెప్పారు. బీసీ కోటాలో తగ్గించడం వద్దని, వాళ్లు, ఎస్సీ ఎస్టీలు అనుభవించే కోటా కాకుండా తమకు కొంత హక్కు ఇవ్వాలని కోరాము తప్ప.. వాళ్ల నోటి దగ్గర కూడు తీసే ఆలోచన తమకు లేదని ఆయన అన్నారు. తమకిచ్చిన హామీని త్వరితగతిన నెరవేర్చాలని ఆయన మరోసారి కోరారు. తుని ఘటనలో చాలామంది మీద అక్రమంగా కేసులు బనాయించారని, కేసుల జాబితాను తనకు కూడా ఇవ్వాలని.. పూర్తి విచారణ తర్వాత మాత్రమే చర్యలు తీసుకోవాల్సిందిగా కోరానని ఆయన అన్నారు.

తనతో పాటు ఈ నాలుగు రోజులుగా తన కుటుంబ సభ్యులు, అమలాపురంలో మరికొందరు నాయకులు కూడా దీక్షలు చేస్తున్నారని, రాష్ట్రవ్యాప్తంగా కూడా చాలా చోట్ల చేస్తున్న దీక్షలను విరమించాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. ఉద్యమానికి వైఎస్ఆర్‌సీపీ నాయకుడు జగన్, పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, చిరంజీవి, దాసరి నారాయణరావు, వట్టి వసంతకుమార్, వి.హనుమంతరావు, హర్షకుమార్, బీజేపీ నేతలు సోము వీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణ, ఇంకా పలువురు నాయకులు, ఎంఆర్‌పీఎస్ నేతలు తమ ఉద్యమానికి పూర్తి మద్దతు తెలిపారని, వాళ్లందరికీ తాను, తన జాతి ప్రజలు కృతజ్ఞతగా ఉంటామని ఆయన అన్నారు.

Advertisement
Advertisement