లిబియాలో కిడ్నాపైన భారతీయులు క్షేమం | Sakshi
Sakshi News home page

లిబియాలో కిడ్నాపైన భారతీయులు క్షేమం

Published Fri, Jul 31 2015 6:18 PM

ఐఎస్ ఉగ్రవాదుల చెర నుంచి విడుదలైన లక్ష్మీకాంత్ (ఎడమ), విజయ్ కుమార్

హైదరాబాద్: లిబియా ముఖ్యపట్టణం సిర్తేలో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు కిడ్నాప్ చేసిన నలుగురు తెలుగువారు క్షేమంగా ఉన్నారు. బందీలు నలుగురిని ఉగ్రవాదులు ఈరోజు సాయంత్రం విడుదల చేశారు. విడుదలైన లక్ష్మీకాంత్, విజయ్ కుమార్ లలో ఒకరు రాయ్చూర్ కు చెందినవారుకాగా, మరొకరు బెంగళూరుకు చెందిన వ్యక్తి. వీరిద్దరూ విడుదలైనట్టు విదేశాంగ శాఖ ధ్రువీకరించింది.

కాగా, తాము కూడా కిడ్నాపర్ల చెర నుంచి విడుదలైయ్యామని, క్షేమంగా ఉన్నామని ఏపీ, హైదరాబాద్ లకు చెందిన గోపీకృష్ణ, బలరామ్ తమ కుటుంబ సభ్యులకు మెసేజ్ పెట్టారు. అయితే వీరిద్దరూ విడుదలైనట్టు విదేశాంగ శాఖ ఇంకా ధ్రువీకరించలేదు. వీరిని కిడ్నాప్ చేసింది ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు కాదని, స్థానిక ముఠా అని వార్తలు వస్తున్నాయి. కిడ్నాపైన వారిలో వీరిలో ముగ్గురు సిర్తేలోని యూనివర్సిటీలో లెక్చరర్లుగా పనిచేస్తుండగా, మరో వ్యక్తి వేరే వృత్తిలో ఉన్నాడు. కిడ్నాప్ ఉదంతంపై స్పందించిన విదేశీ వ్యవహారాల శాఖ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తోంది.

నలుగురు భారతీయులు కిడ్నాప్ కు గురైనట్లు జులై 29నే తెలిసిందని, అప్పటినుంచి వారి విడుదల కోసం అవిశ్రాంతంగా కృషి చేశామని విదేశాంగ శాఖ అధికారులు తెలిపారు. బందీల విడుదలపై విదేశాంగశాఖ మంత్రి సుష్మా స్వరాజ్ హర్షం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు.

Advertisement
Advertisement