డెబిట్ కార్డుతో పుస్తకాలపై డిస్కౌంట్
- రచయిత అమీష్ త్రిపాఠీతో జట్టు
- కో-బ్రాండెడ్ కార్డును ఆవిష్కరించిన కోటక్ బ్యాంక్
- కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా సేవల్లో మార్పు
- బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సుమిత్ బాలి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బ్యాంకింగ్ వ్యవస్థలో కస్టమర్ల అభిరుచులు వేగంగా మారుతున్నాయని, వారికి తగ్గట్టు బ్యాంకింగ్‌లో తాము పలు మార్పులు తీసుకొస్తున్నామని కోటక్ మహీంద్రా బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సుమిత్ బాలి చెప్పారు. కస్టమర్లతో మరింత బలమైన అనుబంధం కోసం వారికిష్టమైన పుస్తకాల్ని వారి ఇళ్లకే అందించేందుకు రచయితలతో ఒప్పందాలు చేసుకుంటున్నట్లు తెలియజేశారు. ప్రముఖ రచయిత, ‘శివ ట్రయాలజీ’ సృష్టికర్త అమీష్ త్రిపాఠీ రాసిన తాజా పుస్తకం ‘సియాన్ ఆఫ్ ఇక్ష్వాకు’ ముఖచిత్రంగా కో-బ్రాండెడ్ డెబిట్ కార్డును మంగళవారమిక్కడ ఆయన ఆవిష్కరించారు.
ఈ కార్డు సాయంతో మిగిలిన బ్యాంకింగ్ కార్యకలాపాలతో పాటు అమీష్ త్రిపాఠీ పుస్తకాలపై 15 శాతం డిస్కౌంట్ పొందవచ్చని వెల్లడించారు. ‘‘ఈ పుస్తకాన్ని మా బ్యాంక్ మొబైల్ యాప్ ద్వారా కానీ, వెబ్‌సైట్ ద్వారా కానీ ఆర్డర్ చేయొచ్చు. అమెజాన్‌తో ఒప్పందం ద్వారా సదరు పుస్తకాలను నేరుగా కస్టమర్ల ఇళ్లకు డెలివరీ చేస్తాం’’ అని సుమిత్ బాలి వివరించారు. వినియోగదారుల అభిరుచులు మారుతున్నాయని, వారితో బలమైన బంధం కోసం తాము గతంలో పీవీఆర్ కో-బ్రాండెడ్ కార్డులు ప్రవేశపెట్టామని, చెన్నై మారథాన్ కార్డులు కూడా తెచ్చామని, ఇవన్నీ విజయం సాధించటంతో కస్టమర్లు పుస్తకాలంటే ఎక్కువ ఇష్టపడుతున్నారని గ్రహించి తాజా సేవలు ఆరంభించామని చెప్పారు.
ఈ పుస్తకాన్ని ట్వీటర్‌లో కూడా ఆర్డర్ చేయొచ్చన్నారు. డిజిటల్ బ్యాంకింగ్ గురించి మాట్లాడుతూ... బ్రాంచీల వెలుపలే అత్యధిక లావాదేవీలు జరిగే పరిస్థితులు ఏర్పడుతున్నాయని, ఫేస్‌బుక్, ట్వీటర్ వంటి సోషల్ మీడియా ద్వారా లావాదేవీలు సురక్షితంగా జరుపుకోవటానికి తాము ప్లాట్‌ఫామ్‌ను అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. ఐఎన్‌జీ టేకోవర్ వల్ల తాము దక్షిణాదిలో బాగా బలపడ్డామని, ఈ టేకోవర్ 2015 ఏప్రిల్ 1 నుంచే అమల్లోకి వచ్చిందని చెప్పారు. ఈ సంవత్సరం 2015-16 బ్యాలెన్స్ షీట్‌లో ఉమ్మడి ఫలితాలు ప్రతిఫలిస్తాయని తెలియజేశారు. తొలి క్వార్టర్ ఫలితాలు కూడా ఉమ్మడిగానే ఉంటాయన్నారు. ఐఎన్‌జీ కలయికతో తమ ఉద్యోగుల సంఖ్య 40వేలకు చేరుకుందని, బ్యాలెన్స్ షీట్ రూ.2 లక్షల కోట్లకు చేరిందని వెల్లడించారు.
బ్యాంకింగ్ మారుతోంది...
రచయిత అమీష్ త్రిపాఠీ మాట్లాడుతూ... తాను రచయితగా మారక ముందు మూడు బ్యాంకుల్లో ఉద్యోగాలు చేశానని, తాను ఐడీబీఐలో చేసినపుడు ఆ బ్యాంక్ బ్యాలెన్స్ షీట్ విలువ కేవలం రూ.60 వేల కోట్లని చెప్పారు. అయితే 60 వేల కోట్లకు చేరటానికి ఆ బ్యాంకుకు చాలా సమయం పట్టిందని, కానీ కోటక్ అతి తక్కువ కాలంలో 2 లక్షల కోట్లకు చేరిందని తెలియజేశారు. ‘సియాన్ ఆఫ్ ఇక్ష్వాకు’ కో-బ్రాండెడ్ కార్డును ఆవిష్కరించాక మాట్లాడుతూ... ఈ సిరీస్‌లో ఇది తొలి పుస్తకమని, మరో 4 పుస్తకాలు రానున్నాయని తెలిపారు.
ఈ-బుక్‌ల ప్రవేశంతో మామూలు పుస్తకాలు చదివే అలవాటు తగ్గుతోందన్న వాదనను ఆయన తోసిపుచ్చారు. ‘‘సంప్రదాయ పుస్తక పఠనం కూడా పెరుగుతోంది. అయితే ఈ-బుక్ రీడింగ్ ఇంకా వేగంగా పెరుగుతోంది. నేను రాసిన శివ ట్రయాలజీ 25 లక్షల కాపీలు అమ్ముడుపోవటమే దీనికి నిదర్శనం’’ అన్నారాయన.