పోలీసులమని చెప్పి.. మాటల్లో పెట్టి.. | Sakshi
Sakshi News home page

పోలీసులమని చెప్పి.. మాటల్లో పెట్టి..

Published Tue, Mar 21 2017 11:12 AM

unknown persons theft the gold in nellore district

 
► మహిళకు చెందిన ఐదు సవర్ల గొలుసు చోరీ    

కావలి : పోలీసులమని ఓ మహిళను మాటల్లో దించి ఐదు సవర్ల గొలుసుతో ఉడాయించిన సంఘటన కావలిలో చోటుచేసుకుంది. శనివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి. శనివారం స్థానిక మున్సిపాలిటీ కార్యాలయం సమీపంలో ఒక మహిళ వద్దకు వచ్చిన ఇద్దరు తాము పోలీసులమని చెప్పారు. మీరెళ్లే దారిలో పోలీసులు అన్ని తనిఖీలు చేస్తున్నారని, రశీదులు లేని బంగారు వస్తువులు ఉంటే ఇబ్బందులు పడుతారని మాయమాటలు చెప్పి నమ్మించారు.

దీంతో ఆయోమయానికి గురైన సదరు మహిళ ఇప్పుడేం చేయాలని వారినే అడగ్గా, మెడలో ఉన్న బంగారు గొలుసు తీసి పేపర్‌లో చుట్టుకొని ఇంటికెళ్లమని సలహా ఇచ్చారు. వారి మాటలు నమ్మిన సదరు మహిళ గొలుసును తీస్తుండగా, ఒకతను పాత పేపర్‌ తీసి ఇందులో పెట్టిస్తాను ఇవ్వండి అని చెప్పి తీసుకున్నాడు. ఆమె గొలుసు ఇవ్వగా మరో వ్యక్తి పోలీసు అంశాలను ప్రస్తావించి దృష్టి మరల్చాడు. తర్వాత ఇద్దరూ అక్కడి నుంచి ఉడాయించారు. వారు వెళ్లిపోయిన తర్వాత సదరు మహిళ గొలుసు ఇవ్వలేదని గుర్తించింది.

కుటుంబసభ్యులకు విషయం చెప్పగా వారు సోమవారం కావలి పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ఇటీవలే స్థానిక మానస సెంటర్‌లో ఇటువంటి ఘటనే జరిగింది. మధ్యవయస్కులైన మహిళలనే ముఠా లక్ష్యంగా చేసుకుని ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఉద్యోగాలు చేసే వారు, సాయంత్రం వేళల్లో వాకింగ్‌ చేసే మహిళలు అప్రమత్తంగా ఉండాలని పోలీసు ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. 
 
మత్తుమందు చల్లి    
 
వెంకటగిరి : పట్టణంలోని కాశీపేట ప్రాంతానికి చెందిన నాగం రమణమ్మ తన ఇంటిలో ఒంటరిగా ఉన్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తి వచ్చి మత్తుమందు చల్లి మెడలో ఉన్న 4.50 సవర్ల బంగారు గొలుసు చోరీ చేసిన సంఘటన ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. రమణమ్మ కాశీపేటలో తన కుమారుడితో కలిసి జీవిస్తోంది. ఆదివారం ఆమె కుమారుడు వ్యవసాయపనుల నిమిత్తం వెళ్లడంతో ఇంట్లో ఒంటిరిగా ఉంది. మధ్యాహ్నం మూడు గంటల 
సమయంలో గుర్తుతెలియని వ్యక్తి వచ్చి రమణమ్మపై మత్తుమందు చల్లి మెడలో ఉన్న బంగారు గొలుసు లాక్కొని వెళ్లాడు. బాధితురాలు కుమారుడికి చెప్పడంతో సోమవారం అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement
Advertisement