వ్యవసాయానికి అరకొర బడ్జెట్ | Sakshi
Sakshi News home page

వ్యవసాయానికి అరకొర బడ్జెట్

Published Fri, May 16 2014 2:41 AM

Two crores budget for Agriculture

సాక్షి, నెల్లూరు : వ్యవసాయ రంగానికి ప్రభుత్వం నామమాత్రపు నిధులు కేటాయించడంతో ఆ శాఖాధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఎన్నికల ముందు మార్చిలో జిల్లాకు దాదాపు రూ.2 కోట్ల నిధులు కేటాయించిన ప్రభుత్వం వెంటనే నిధుల విడుదలను నిలిపి వేసింది.  దీంతో జిల్లా వ్యవసాయశాఖ అన్ని పనులను అటకెక్కించింది. జిల్లాలోని ఆదర్శ రైతులకు 16 నెలలుగా గౌరవ వేతనాలు చెల్లించాల్సి ఉంది. జిల్లాలో 1,256 మంది ఆదర్శ రైతులు ఉండగా వారికి నెలకు రూ.వెయ్యి చొప్పున గౌరవవేతనం చెల్లించాల్సి ఉంది. ఈ లెక్కన నెలకు అందరు ఆదర్శ రైతులకు రూ.12.56 లక్షలు చెల్లించాల్సి ఉంది. 16 నెలల బకాయిలు కలిపి రూ.2.96 కోట్లు చెల్లించాల్సి ఉంది.
 
 కానీ ప్రభుత్వం ఇంత వరకూ చెల్లించలేదు. తాజాగా ప్రభుత్వం కేవలం రూ.33.68 లక్షలు మాత్రమే కేటాయించారు. ఇది కేవలం 3 నెలల వేతనాలు చెల్లించడానికి కూడా సరిపోదు. మిగిలిన 13 నెలల జీతం  ఎప్పుడు వస్తుందో అర్థంకాని పరిస్థితి. దీంతో ఆదర్శరైతులు ఆందోళన చెందుతున్నారు. ఇటు ఆదర్శ రైతులకు సమాధానం చెప్పలేక జిల్లా వ్యవసాయాధికారులు సైతం తలలు పట్టుకుంటున్నారు. ఇక కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తరువాతనే బడ్జెట్ వచ్చే అవకాశముందని అధికారులు పేర్కొంటున్నారు.
 

Advertisement
Advertisement