నేడు రథసప్తమి | Sakshi
Sakshi News home page

నేడు రథసప్తమి

Published Mon, Jan 26 2015 6:08 AM

నేడు రథసప్తమి

తిరుమలలో భక్తజన కోటి
* వాహన సేవలను తిలకించేందుకు తరలివచ్చిన అశేష భక్తజనం
* ఏడు వాహనాలపై విహరించనున్న శ్రీవారు
* విస్తృత ఏర్పాట్లు చేసిన టీటీడీ

సాక్షి,తిరుమల : ఒకరోజు బ్రహ్మోత్సవంగా ప్రసిద్ధి పొందిన రథసప్తమి వేడుకలకు తిరుమల సిద్ధమైంది. ఏడు వాహన సేవల్లో విహరించే శ్రీవారిని దర్శించి తరించేందుకు అశేష భక్తకోటి తరలివచ్చింది. ఉదయం 5.30 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు స్వా మివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో వాహనాలపై విహరిస్తూ భక్తులను కటాక్షించనున్నారు. వాహన సేవలను తిలకించేందుకు వచ్చే భక్తుల కోసం టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది.

ఆలయం వద్ద, నాలుగు మాడ వీధుల్లో ప్రత్యేక బ్యారికేడ్లు, గ్యాలరీలు, చలువ పందిళ్లు నిర్మించారు. గాలరీల్లో ఉంటూ వాహన సేవలను తిలకించే భక్తులకు అన్న ప్రసాదాలు, మజ్జిగ, నీళ్లు, వేడిపాలు అందజేయనున్నారు. ఏకదాటిగా  ఏడు వాహ సేవలు ఉండడంతో  కచ్చితమైన సమయాభావాన్ని పాటించేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 3  మధ్యలో  పుష్కరిణిలో చక్రస్నానం జరుగనుంది. సుదర్శన చక్రతాళ్వారు స్నానమాచరించే పుణ్యప్రదేశంలో సాధారణ భక్తులు చొరబడకుండా ఇనుప కమ్మీలు నిర్మించారు.
 
ఏర్పాట్లు పరిశీలించిన ఈవో, జేఈవో
రథసప్తమి ఏర్పాట్లను టీటీడీ ఈవో దొండపాటి సాంబశివరావు, జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు ఆదివారం సాయంత్రం ఏర్పాట్లు పరి శీలించారు. ఆలయంతో పాటు నాలుగు మాడ వీధులను పరిశీలించారు. స్వామి వారిని ఊరేగించనున్న వాహనాలను పరిశీలించారు. ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశామని ఈవో, జే ఈవో మీడియాకు తెలిపారు.

Advertisement
Advertisement