మా కడుపులు కొట్టొద్దు | Sakshi
Sakshi News home page

మా కడుపులు కొట్టొద్దు

Published Sat, Aug 1 2015 4:27 AM

మా కడుపులు కొట్టొద్దు - Sakshi

- కలెక్టర్‌తో నిప్పులవాగు పరీవాహక రైతుల మొర
వెలుగోడు:
నిప్పులవాగు విస్తరణకు  జీవనోపాధి అయిన భూములను తీసుకొని తమ కడుపులు కొట్టొద్దని బాధిత రైతులు కలెక్టర్ సీహెచ్ మోహన్‌తో మొర పెట్టుకున్నారు. స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో నిప్పుల వాగు విస్తరణ పనుల్లో భూములు కోల్పోతున్న బాధిత రైతులతో శుక్రవారం కలెక్టర్ విజయమోహన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ 2009లో సంభవించిన వరదల కారణంగా విలువైన భూములు కోల్పోవాల్సి వచ్చిందన్నారు. వాటిని సాగులోకి తెచ్చుకునేందుకు వేలాది రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చిందన్నారు. ఏదోలాగా పంట పొలాలను ఇప్పుడిప్పుడే సాగులోకి తెచ్చుకున్నామని పేర్కొన్నారు. అయితే నిప్పుల వాగు విస్తరణ పనుల్లో నామమాత్రపు పరిహారం చెల్లించి బలవంతంగా భూములు లా క్కొనేందుకు చర్యలు తీసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఎకరాకు రూ.10 లక్షలు చెల్లించిన తర్వాతే పను లు చేపట్టాలని రైతులు రామలింగారెడ్డి, మురళీధర్‌రెడ్డి తది తరులు తెగేసి చెప్పారు. ఈ సందర్భంగా కలెక్టర్ విజయమోహన్ మాట్లాడుతూ రైతుల అంగీకారంతోనే భూములు తీసుకుంటామన్నారు. ఇందు కోసం ఎకరాకు రూ.3.50 లక్షలు పరిహారం, జీవనోపాధి కోల్పోతున్న కారణంగా ఒక్కొక్క కుటుంబానికి రూ.5.50 లక్షలు ప్రోత్సాహకం అందజేస్తామని వివరించారు. రైతులు భూములు ఇవ్వకపోతే చట్ట ప్రకారం ప్రభుత్వ నిబంధనల మేరకు విస్తరణ పనులకు అవసరమైన భూములు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన రైతులు అంగీకార పత్రం అందజేస్తే 15 రోజుల్లో పరిహారం చెల్లించి పనులు చేపడుతామని హామీ ఇచ్చారు. అయితే ఇందుకు కొందరు రైతులు అంగీకరించగా మరికొందరు వ్యతిరేకించారు. కార్యక్రమంలో జేసీ హరికిరణ్, ఆర్‌డీఓ రఘుబాబు, తహశీల్దార్లు అనురాధ, తిరుమలవాణి, కేసీ కెనాల్ అధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement