రెండు రోజుల్లో పెళ్లి కాబోతుందనగా... | Sakshi
Sakshi News home page

రెండు రోజుల్లో పెళ్లి కాబోతుందనగా...

Published Wed, Feb 10 2016 12:06 AM

రెండు రోజుల్లో పెళ్లి కాబోతుందనగా... - Sakshi

రోడ్డు ప్రమాదంలో గాయపడిన వైనం  వాయిదా పడిన వివాహం
 
 మునగపాక:  మరో రెండు రోజుల్లో ఆ ఇంట పెళ్లి బాజా మోగవలసింది. ఇప్పటికే బంధువులకు, స్నేహితులకు ఆహ్వానాలు పంపారు. సన్నాయి మేళాన్ని, కల్యాణమండపాన్ని సిద్ధం చేసుకున్నారు. ఇంతలో రోడ్డుప్రమాదం రూపంలో అవాంతరం ఎదురైంది.  దంపతులు కానున్న ఇద్దరూ రోడ్డు ప్రమాదంలో గాయపడి విశాఖలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.   రెండురోజుల్లో జరగాల్సిన వివాహం ఆగిపోయింది.   ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని మూలపేట గ్రామానికి చెందిన కాండ్రేగుల శ్రీనివాసరావు, ధనలక్ష్మి దంపతుల పెద్దకుమారుడు ప్రభాకరరావు అచ్యుతాపురంలోని బ్రాండెక్స్‌కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.   ఎస్ రాయవరానికి చెందిన బొడ్డేడ శంకరరావు, పద్దేశమ్మ దంపతుల   కూతురు  సంతోషి కూడా అదే కంపెనీలో పని చేస్తోంది.

రెండు కుటుంబాలకు చెందిన పెద్దలు వీరిద్దరికీ   వివాహం చేసేందుకు నిర్ణయించారు. ఈనెల 11న వరుడు ప్రభాకరరావు నివాసం ఉంటున్న మూలపేటలో   వివాహం చేసేందుకు ఏర్పాట్లు చేశారు.  వారిద్దరూ  కలిసి ఫొటోలను తీసుకునేందుకు సోమవారం ఉదయం అనకాపల్లికి వచ్చారు. తిరుగు ప్రయాణంలో సంతోషిని స్వగ్రామం రాయవరంలో దించేందుకు స్కూటీపై పయనమయ్యారు. మరో  పది నిమిషాల్లో ఇంటికి చేరిపోతున్నామనుకున్న సమయంలో సంతోషి తాను స్కూటీ నడుపుతానని ముందుకు వచ్చింది. ఏం జరిగిందో తెలియదు సమీపంలోని కాలువలోకి స్కూటీ దూసుకుపోయింది. ఈ సంఘటనలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులు ప్రభాకరరావు, సంతోషిలను అనకాపల్లి వందపడకల ఆస్పత్రికి తరలించి,  పరిస్థితి ప్రమాదకరంగా ఉండడంతో విశాఖలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించిన  విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో  ఈనెల 11వ తేదీన జరగాల్సిన వివాహం  వాయిదా పడింది.   రెండు రోజుల్లో ఒక్కటి కావాల్సిన జంట రోడ్డు ప్రమాదంలో  గాయపడి ఆస్పత్రిలో చేరడంతో వారి బంధువులు ఆందోళన చెందుతున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement