దొనకొండనే రాజధాని చేయాలి | Sakshi
Sakshi News home page

దొనకొండనే రాజధాని చేయాలి

Published Thu, Jul 31 2014 2:20 AM

దొనకొండనే రాజధాని చేయాలి - Sakshi

ఒంగోలు అర్బన్ : జిల్లాలోని దొనకొండనే రాజధానిగా ఎంపిక చేయాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, జెడ్పీ వైస్ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ డిమాండ్ చేశారు. రాజధానికి కావాల్సిన అన్ని అర్హతలూ ఆ ప్రాంతానికి ఉన్నప్పటికీ టీడీపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా పక్కనపెడుతోందని విమర్శించారు. స్థానిక వైఎస్‌ఆర్ సీపీ జిల్లా కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దొనకొండలో 55 వేల ఎకరాల ప్రభుత్వ భూమి, బ్రిటీష్ కాలంలో 136 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేసిన విమానాశ్రయం, 120 ఎకరాల్లో రైల్వేస్టేషన్ ఉన్నాయని తెలిపారు.
 
కేవలం ఆరు కిలోమీటర్ల దూరంలో సాగర్ కెనాల్, 20 కిలోమీటర్ల దూరంలో వెలిగొండ ప్రాజెక్టు, జాతీయ రహదారి ఉన్నాయన్నారు. రాజధానికి అవసరమైన ముఖ్య వసతులన్నీ ఇక్కడ ఉన్నాయని పేర్కొన్నారు. రాష్ట్రం మధ్యలో దొనకొండ ఉన్నందున అన్ని ప్రాంతాల ప్రజలకు అందుబాటులో ఉంటుందని, అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుందని చెప్పారు. రాయలసీమ సాధన సమితి కూడా రాజధానిని తమ ప్రాంతంలో ఏర్పాటు చేయాలని, లేకుంటే దొనకొండలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్న విషయాన్ని బాలాజీ గుర్తుచేశారు.
 
ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోంది...
రాష్ట్రంలోని ఉత్తరాంధ్రతో పాటు రాయలసీమ జిల్లాల ప్రజలందరికీ ఆమోదయోగ్యమైన దొనకొండను రాజధానిగా పరిశీలించకుండా ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని బాలాజీ విమర్శించారు. రాజధాని విషయంలో స్పష్టమైన వైఖరి అవలంబించకుండా దోబూచులాడుతోందని మండిపడ్డారు. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి విజయవాడ, గుంటూరు ప్రాంతాలనే పట్టుకుని వేలాడుతోందన్నారు. అక్కడ రాజధాని నిర్మించాలంటే భూ సేకరణకే వేల కోట్ల రూపాయలు అవసరమన్నారు. అసలే లోటు బడ్జెట్‌లో ఉన్న ప్రభుత్వం ఆ ప్రాంతంలో భూములు సేకరించి రాజధాని నిర్మించడం అసాధ్యమన్నారు.
 
దొనకొండలో భూముల కోసం రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదని, నిర్మాణాలపై దృష్టిపెడితే సరిపోతుందని బాలాజీ పేర్కొన్నారు. సముద్రమట్టానికి ఎత్తులో ఉండటం వల్ల ప్రకృతి వైపరీత్యాలు కూడా సంభవించవని తెలిపారు. దొనకొండను కాదని, విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో రాజధాని నిర్మిస్తే భవిష్యత్తులో మరో విభజన ఉద్యమం పుట్టే అవకాశముందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి దొనకొండనే రాజధానిగా ఎంపిక చేయాలని బాలాజీ సూచించారు.
 
ప్రజలకు అందుబాటులో ఎంపీ, ఎమ్మెల్యేలు...
వైఎస్‌ఆర్ సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, జిల్లాలోని ఆరుగురు ఎమ్మెల్యేలు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్నారని బాలాజీ తెలిపారు. పార్లమెంట్ జరిగే సమయంలో తప్ప మిగతా సమయంలో వైవీ సుబ్బారెడ్డి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులోనే ఉంటున్నారని చెప్పారు. గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డిపై అక్రమ కేసులు బనాయించడాన్ని ఆయన ఖండించారు. విలేకరుల సమావేశంలో వైఎస్‌ఆర్ సీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర కో ఆర్డినేటర్ పాలడుగు విజేంద్రబహుజన్, జిల్లా కన్వీనర్ కంచర్ల సుధాకర్, గ్రామీణ ఉపాధి కల్పనా విభాగం జిల్లా కన్వీనర్ బొగ్గుల శ్రీను పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement