'సాధ్యమైనంతవరకూ ఇంట్లోనే ఉండండి' | Sakshi
Sakshi News home page

'సాధ్యమైనంతవరకూ ఇంట్లోనే ఉండండి'

Published Fri, May 22 2015 9:33 AM

'సాధ్యమైనంతవరకూ ఇంట్లోనే ఉండండి'

హైదరాబాద్ : భానుడు భగభగలతో జనాలు అల్లాడిపోతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు అగ్నిగుండాన్ని తలపిస్తున్నాయి.దాంతోపాటు వడగాడ్పులు అదే స్థాయిలో ఉధృతమవుతున్నాయి. వరసగా నాలుగు రోజుల నుంచి వేడిగాలులు జనాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో వడదెబ్బకు సుమారు 225మంది మృతి చెందారు. వడదెబ్బకు ఏపీలో 78 మంది, తెలంగాణలో 147 మంది మృత్యువాత పడ్డారు.

 హైదరాబాద్లో కూడా అత్యధికంగా ఉష్ణోగ్రత నమోదు అవుతోంది. శుక్రవారం ఉదయం 9గంటలకే 35 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది. నిన్న గరిష్ట ఉష్ణోగ్రత 44.3 డిగ్రీలకు చేరిన విషయం తెలిసిందే. కాగా 1966లో హైదరాబాద్ చరిత్రలో 45.5 డిగ్రీల అత్యధిక పగటి ఉష్ణోగ్రత నమోదు అయింది. అయితే రానున్న రెండు రోజుల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రత నమోదు అయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొన్నారు. శుక్రవారానికి 45 డిగ్రీలకు చేరే అవకాశముందని తెలిపింది.

మరోవైపు ఈ  రెండు రోజులు ఉష్ణోగ్రతలు, వడగాడ్పులు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరో మూడు రోజులు అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉన్నందున సాధ్యమైనంత వరకూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ బయటకు రావద్దని సూచిస్తున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, గర్భిణులు ఇళ్లకే పరిమితమవ్వాలని చెబుతున్నారు. అత్యవసరంగా బయటకు వెళ్లాల్సి వస్తే అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

లక్షణాలు ఇవీ....

    *అధిక ఉష్ణోగ్రత, శరీరం పొడిబారటం, దాహం ఎక్కువగా అవ్వడం
    *వాంతులు, నీరసం
    *తల తిరగడం
    *దడ, ఆయాసం, గుండె వేగంగా కొట్టుకోవడం
    *చిరాకు, స్థలము-సమయం తెలియకపోవడం
    *భ్రమలతో కూడుకున్న అలోచనలు  
    *చివరిగా స్పృహ కోల్పోవడం

చికిత్స ఇలా...

వడ దెబ్బ మెడికల్ ఎమెర్జెన్సీ. దీనికి అత్యవసరంగా చికిత్స చేయాలి. లేకపోతే ఒక్కోసారి ప్రాణాలకే ప్రమాదం. కానీ కొద్దిపాటి జాగ్రత్తలతో
కూడుకున్న ప్రథమ చికిత్సకే రోగులు త్వరగా కోలుకుంటారు..

    *మొదటిగా పేషంట్ను చల్లబరచాలి..
    *బట్టలు తీసి, చల్లని నీటి ఆవిరిని గానీ, నీరు గానీ మొత్తం శరీరం అంతా సమంగా తగిలించాలి.
   *చల్లని నీళ్లతో తడిపిన వస్త్రాలు కప్పాలి.
   *భుజాల కింద, గజ్జల్లోను చల్లని ఐస్ ముక్కలు ఉంచాలి.
   *ఇవి చేస్తూ దగ్గరలో ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లాలి.

నివారణ మార్గాలు ఇవీ..
    వడ దెబ్బకు గురి కాకుండా తగు నివారణోపయాలు తీసుకుంటే చాలా మంచిది. అవి..
    *తరచుగా చల్లని నీరు తాగడం
    *బయట పనిచేసే వాళ్లు అప్పుడప్పుడు విరామం తీసుకోవడం
    *సాధ్యమైనంత వరకు మిట్ట మధ్యాహ్నం ఎండలో తిరగకూడదు
    *వేసవిలో తెల్లని వదులైన కాటన్ దుస్తులు ధరించాలి
    *మద్యం తాగకూడదు.
    *ఇంట్లో కూడా వేడి తగ్గేలా చూసుకోవాలి.

Advertisement
Advertisement