లా అండ్ ఆర్డర్... విభజన షురూ | Sakshi
Sakshi News home page

లా అండ్ ఆర్డర్... విభజన షురూ

Published Mon, Jun 27 2016 12:20 AM

Resumes division of law and order

ఇద్దరు డీసీపీల నియామకం
ఒక్కొక్కరికి మూడు జోన్ల కేటాయింపు

కొత్త డీసీపీలు రెండు రోజుల్లో రాక

 

విజయవాడ : విజయవాడ పోలీస్ కమిషనరేట్‌లో పని విభజన మొదలైంది. ఐపీఎస్‌ల బదిలీల్లో భాగంగా ముగ్గురు అధికారుల్ని ప్రభుత్వం కమిషనరేట్‌కు కేటాయించింది. ఈ క్రమంలో కమిషనరేట్ అప్‌గ్రేడ్ అయిన తర్వాత మొదటిసారిగా పోస్టులన్నీ భర్తీ చేశారు. లా ఆండ్ ఆర్డర్ విభాగానికి ఇద్దరు డీసీపీలను ప్రభుత్వం కేటాయించింది. ట్రాఫిక్‌కు మరో డీసీపీని నియమించింది. నూతనంగా కేటాయించిన ముగ్గురు ఐపీఎస్ అధికారులు మరో రెండు రోజుల్లో విధుల్లో చేరే అవకాశం ఉంది. ఈ క్రమంలో కమిషనరేట్ ఉన్నతాధికారులు లా ఆండ్ ఆర్డర్ విభజన ప్రక్రియపై దృష్టి సారించి ప్రాథమికంగా పూర్తి చేశారు.

 
ప్రస్తుతం విభాగాలు ఇలా...

కమిషనరేట్ పరిధిలో కొత్తగా ఏర్పాటు చేసిన జోన్లతో కలిపి ఐదు పోలీస్ సబ్ డివిజన్లు, వీటి పరిధిలో 20 పోలీస్ స్టేషన్లు, ఇవి కాకుండా ట్రాఫిక్, సీసీఎస్, టాస్క్‌ఫోర్స్, మహిళా పోలీస్ స్టేషన్ ఇలా అనేక విభాగాలు ఉన్నాయి. ఈ విభాగాలన్నీ ఇప్పటి వరకు ఏసీపీ పర్యవేక్షణలోనే కొనసాగుతున్నాయి. లా అండ్ ఆర్డర్, పరిపాలన విభాగానికి మాత్రమే డీసీపీలు ఉండేవారు. లా అండ్ ఆర్డర్ విభాగం గత రెండు నెలలుగా ఖాళీగా ఉంది. గతంలో లా అండ్ ఆర్డర్ డీసీపీగా ఉన్న కాళిదాసు రంగారావును విజయనగరం జిల్లా ఎస్పీగా నియమించటంతో ఆ స్థానం భర్తీ కాకుండా  ఉండటంతో పరిపాలన విభాగం డీసీపీ అశోక్ కుమార్ దానిని కూడా ఇప్పటి వరకు పర్యవేక్షించారు. కమిషనరేట్‌లో అదనపు డీజీ క్యాడర్‌లో ఉన్న కమిషనర్ పోస్టుతో పాటు ఐజీ క్యాడర్‌లో అదనపు కమిషనర్ పోస్టు, డీఐజీ క్యాడర్‌లో జాయింట్ కమిషనర్ పోస్టులతో పాటు నాలుగు డీసీపీ పోస్టులు ఉన్నాయి. కొత్తగా వచ్చిన ముగ్గురు డీసీపీలతో కలిపి అన్ని పోస్టులూ భర్తీ అయినట్టే. ఇక అదనపు కమిషనర్ పోస్టు మాత్రమే ఖాళీగా ఉంది. గతంలో ఈ పోస్టులో మహేష్ చంద్ర లడ్హా కొద్ది రోజులు పనిచేసి బదిలీపై వెళ్లిపోయారు.

 
లా అండ్ ఆర్డర్‌కు ఇక ఇద్దరు డీసీపీలు...

లా అండ్ ఆర్డర్‌కు ఇప్పటి వరకు ఒక్కరే డీసీపీగా కొనసాగుతూ వచ్చారు. దీనిని తాజాగా రెండుగా విభజించారు. కమిషనరేట్ పరిధిలో ఈస్ట్, వెస్ట్. సౌత్, నార్త్, సెంట్రల్ జోన్లతో పాటు, సీసీఎస్ (క్రైం) ఉన్నాయి. లా అండ్ ఆర్డర్ డీసీపీ-1గా డాక్టర్ కొయ్య ప్రవీణ్‌ను, డీసీపీ-2గా జి.పాల్‌రాజును నియమించారు. డీసీపీ-1 పరిధిలోకి మూడు జోన్లు, డీసీపీ-2 పరిధిలోకి సీసీఎస్‌తో కలిపి మూడు జోన్లు కేటాయించనున్నారు. జోన్ల పరిధి, సరిహద్దును పరిగణనలోకి తీసుకొని వీటిని ఏర్పాటు చేయనున్నారు. దీంతో పాటు కమిషనరేట్ పరిధిలోని ప్రత్యేక టాస్క్‌లకూ డీసీపీలనే ఎక్కువగా వినియోగించనున్నారు. ట్రాఫిక్ విభాగాన్ని ఏడీసీపీ నాగరాజు పూర్తిస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. ట్రాఫిక్ విభాగానికి డీసీపీగా క్రాంతి రతన్ టాటాను నియమించారు. ట్రాఫిక్ స్టేషన్లు పరిమితంగా ఉండటం, ఒక్కరే డీసీపీ కావటంతో ఎలాంటి విభజన లేకుండా ఈ విభాగాన్ని రతన్ టాటాకు అప్పగించనున్నారు.

 

Advertisement
Advertisement