జిల్లాలో రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా వడ్డన | Sakshi
Sakshi News home page

జిల్లాలో రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా వడ్డన

Published Fri, Nov 28 2014 1:40 AM

registration charges increased

ఒంగోలు సబర్బన్: రాష్ట్ర ప్రభుత్వం చడీచప్పుడు లేకుండా జిల్లా ప్రజలపై అదనపు బాదుడికి సన్నద్ధమైంది. ముఖ్యమంత్రి జపాన్ పర్యటనకు వెళ్తూ అత్యంత రహస్యంగా రెండు జీవోలను రాష్ట్ర ప్రజలపై రుద్దారు. రిజిస్ట్రేషన్ చార్జీలను పెంచేశారు. అది కూడా బుధవారం నుంచి అమలులోకి వస్తుందని ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. జిల్లాలో రెండు జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయాలున్నాయి. ఒకటి ఒంగోలు జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయం కాగా, రెండోది మార్కాపురం జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయం.

ఈ రెండింటి పరిధిలో తొమ్మిదేసి చొప్పున సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలున్నాయి. మొత్తం 18 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల ద్వారా రిజిస్ట్రేషన్ల క్రయ, విక్రయాలు జరుగుతుంటాయి. భూములు, స్థలాలు నిర్ణయించిన మార్కెట్ విలువను బట్టీ స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులను నిర్ణయిస్తారు. గతంలో కంటే ప్రతి రిజిస్ట్రేషన్‌పై చార్జీల మోత మోగించిన ఘనత ఒక్క ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికే దక్కింది. ముందెన్నడూ ఈ విధంగా అన్ని రకాల సేవలపై చార్జీలు పెంచలేదు.

 2014-15 ఆర్థిక సంవత్సరానికిగాను జిల్లా మొత్తం మీద 209 కోట్ల రిజిస్ట్రేషన్ ఆదాయలక్ష్యంగా విధించారు. అయితే ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు, రాష్ట్రం విడిపోయినప్పటికీ జిల్లాకు ప్రత్యేకంగా ఎలాంటి పారిశ్రామిక అభివృద్ధి జరగకపోవడంతో భూముల ధరలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంలా తయారైంది. రిజిస్ట్రేషన్ పరంగా జిల్లావ్యాప్తంగా స్టాంప్ డ్యూటీదే సింహభాగం. ఒంగోలు జిల్లా రిజిస్ట్రార్ పరిధిలో 2014-15 ఆర్థిక సంవత్సరానికి 125 కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా నిర్ణయించారు. దీంతో పాటు ప్రభుత్వం పెంచిన రిజిస్ట్రేషన్ చార్జీల వలన అదనంగా 15 కోట్ల భారం జిల్లా ప్రజలపై పడనుంది.

 మార్కాపురం జిల్లా రిజిస్ట్రార్ పరిధిలో ఈ ఆర్థిక సంవత్సరానికి 84 కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా నిర్ణయించారు. దీంతో పాటు పెంచిన రిజిస్ట్రేషన్ చార్జీల వల్ల అదనంగా మరో 10 కోట్ల భారం ప్రజలపై పడనుంది. స్టాంప్‌డ్యూటీ గతంలో 4 శాతం ఉంటే ప్రస్తుతం ఒక శాతం పెంచడంతో అది 5 శాతమైంది. అదే విధంగా రిజిస్ట్రేషన్ చార్జీల కింద గతంలో స్టాంప్ డ్యూటీ మీద 0.5 శాతం విధించేవారు దానిని ఇప్పుడు ఒక శాతానికి పెంచారు.

 సెటిల్‌మెంట్స్, గిఫ్ట్ డీడ్‌లపై మార్కెట్ విలువను బట్టీ ఒకశాతం స్టాంప్ డ్యూటీ విధించేవారు, దానిని ప్రస్తుతం 2 శాతంగా పెంచారు. దీంతో పాటు రక్త సంబంధీకులకు కానుకల రూపంలో ఇచ్చే రిజిస్ట్రేషన్లు, కుటుంబ సభ్యుల మధ్య జరిగే ఒప్పందానికి సంబంధించిన రిజిస్ట్రేషన్లు, ఇతరుల మధ్య జరిగే భాగస్వామ్య ఒప్పందాల రిజిస్ట్రేషన్ల స్టాంప్ డ్యూటీని కూడా ఒకటి నుంచి 2 శాతానికి పెంచారు.

 ఇతరుల మధ్య జరిగే ఒప్పందాలు (అగ్రిమెంట్లు) రిజిస్ట్రేషన్లపై గతంలో 2 శాతం స్టాంప్‌డ్యూటీ ఉండేది. ప్రస్తుతం దానిని 3 శాతానికి పెంచారు. అదే విధంగా ఇతరుల మధ్య కానుకలకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు జరిగితే గతంలో  4 శాతం డ్యూటీ విధించేవారు, దానిని ప్రస్తుతం 4 నుంచి 5 శాతానికి పెంచారు. కుటుంబ సభ్యుల మధ్య ఒప్పందాలు (అగ్రిమెంట్లు) రూపంలో రిజిస్ట్రేషన్లు చేసుకుంటే గతంలో 0.5 శాతంగా ఉండేది, దానిని ఒక శాతానికి పెంచారు. అన్ని రకాల ఒప్పందాలు, రిజిస్ట్రేషన్లపై పెంచి కూర్చోవడంతో ప్రజలు ఇక రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లాలంటే భయపడే పరిస్థితి నెలకొంది.

Advertisement
Advertisement