ఇసుక దందాపై నిరసన.. అంతలోనే ప్రమాదం | Sakshi
Sakshi News home page

ఇసుక దందాపై నిరసన.. అంతలోనే ప్రమాదం

Published Fri, Apr 21 2017 3:14 PM

ఇసుక దందాపై నిరసన.. అంతలోనే ప్రమాదం - Sakshi

చిత్తూరు జిల్లా ఏర్పేడు వద్ద ప్రమాదంలో అంత ఎక్కువ మంది మరణించడానికి ప్రధాన కారణం.. తమ సమస్యల పరిష్కారం కోసం ధర్నా చేయడమేనని తెలుస్తోంది. ఏర్పేడు మండలం వరదలపాలెం ప్రాంతంలో ఇసుక దందా భారీగా జరుగుతోంది. దానిపై నిరసన వ్యక్తం చేసేందుకు మండల కార్యాలయం ఏర్పేడుకు స్థానికులు భారీ సంఖ్యలో వచ్చారు. వాళ్లంతా మండల పరిషత్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేస్తున్నారు. అంతలో తిరుపతి అర్బన్ ఎస్పీ పోలీసు స్టేషన్ వద్దకు వచ్చారని తెలిసి, ఆయనను కలిసేందుకు ఆందోళనకారులంతా అక్కడకు వెళ్లారు.

పోలీసు స్టేషన్ వద్ద వాళ్లంతా కలిసి నిరసన వ్యక్తం చేస్తుండగా అదుపుతప్పిన లారీ వాళ్ల మీదకు దూసుకొచ్చింది. ఈ ఘటనలో 20 మంది మరణించారు. లారీ విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో కొంతమంది విద్యుత్ షాక్‌తోను, మరికొంతమంది ప్రమాదంలోను మరణించినట్లు తెలుస్తోంది. మరో 15 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రుల పరిస్థితి కూడా విషమంగానే ఉండటంతో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా.. క్షతగాత్రులలో సీఐ సాయినాథ్, ఎస్ఐ రామకృష్ణ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇసుక దందా గురించి ఇంతకుముందు కూడా చాలాసార్లు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదని, ఇప్పుడు ఆ సమస్యే ఇంతమంది ప్రాణాలు తీసిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Advertisement