మా లారీలకు సింగిల్ పర్మిట్ ఇవ్వండి | Sakshi
Sakshi News home page

మా లారీలకు సింగిల్ పర్మిట్ ఇవ్వండి

Published Wed, Nov 30 2016 2:49 AM

మా లారీలకు సింగిల్ పర్మిట్ ఇవ్వండి - Sakshi

  • ఏపీ సీఎంను కోరిన రాష్ట్ర లారీ యజమానుల సంఘం
  • వినతిపత్రం సమర్పించిన సంఘం గౌరవాధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్
  • సాక్షి, అమరావతి: తమ లారీలకు సింగిల్ పర్మిట్ ఇవ్వాలని కోరుతూ తెలంగాణ లారీ యజమానుల సంఘం ప్రతినిధులు మంగళవారం విజయవాడలోని ఏపీ సీఎం చంద్రబాబు క్యాంపు కార్యాలయం వద్ద కొద్దిసేపు నిరసన తెలిపారు. తమ లారీలకు సింగిల్ పర్మిట్ ఇవ్వాలని ప్లకార్డులు ప్రదర్శించారు. సీఎం కార్యాలయం ప్రధాన ప్రవేశ ద్వారం వద్ద ఏర్పాటు చేసిన బారికేడ్ల వరకూ వచ్చి వారు నిరసన తెలపటం విశేషం. సంఘం గౌరవాధ్యక్షుడు, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే వి.శ్రీనివాస్‌గౌడ్ చంద్రబాబును కలసి వినతిపత్రం అందచేసి అనంతరం సంఘం ప్రతినిధులు ఎన్.భాస్కరరెడ్డి, జి.దుర్గాప్రసాద్‌తో కలిసి సీఎం క్యాంపు కార్యాల యంలోని మీడియా పాయింట్‌లో శ్రీనివాస్‌గౌడ్ విలేకరులతో మాట్లాడుతూ గతంలో ఉమ్మడిగా ఉండి ప్రస్తుతం విడిపోయిన రాష్ట్రాల్లో సింగిల్ పర్మిట్ విధానం లారీలకు లేకపోవటం బాధాకరమన్నారు.

    గతంలో తెలంగాణ ప్రాంతంలో ఏపీ లారీలను ఆపినపుడు సింగిల్ పర్మిట్‌కు సంబంధించిన ఫైల్ తెలంగాణ సీఎం వద్ద అపరిష్కృతంగా ఉందని చెప్పారని, తాము పరిశీలిస్తే అలాంటి ఫైల్ ఏదీ తమ రాష్ట్రానికి రాలేదన్నారు. పొరుగున ఉన్న ఛత్తీస్‌గఢ్, ఒడిశా, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల లారీలకు సింగిల్ పర్మిట్‌ను అమలు చేస్తున్నందున ఏపీ కూడా అదే విధానాన్ని అమలు చేయాలన్నారు. 2 రాష్ట్రాలు ఈ విధానాన్ని అమలు చేయాలన్నారు. సింగిల్ పర్మిట్‌కు సంబంధించి తెలంగాణ సీఎం సంతకం చేసిన ఫైల్ ఏపీలో అపరిష్కృతంగా ఉందన్నారు. ఉద్యోగుల సమస్యలను కూడా పరిష్కరించాలని తాము సీఎంను కోరామన్నారు. తెలంగాణ నుంచి ఏపీకి వస్తామన్న ఉద్యోగులను తీసుకోవాలని విజ్ఞప్తి చేశామన్నారు. ఆస్తుల విభజనకు సంబంధించి మంత్రివర్గ ఉప సంఘాన్ని నియమించామని, త్వరలోనే పరిష్కరిస్తామని సీఎం చంద్రబాబు చెప్పారని శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు.

Advertisement
Advertisement