సోమేశ్వరంలో భారీ అగ్ని ప్రమాదం | Sakshi
Sakshi News home page

సోమేశ్వరంలో భారీ అగ్ని ప్రమాదం

Published Tue, Apr 12 2016 2:15 AM

సోమేశ్వరంలో భారీ అగ్ని ప్రమాదం

* నిరాశ్రయమైన ఆరు కుటుంబాలు  
* నాలుగిళ్లు, పాన్‌షాపు, స్కూల్ బస్సు దగ్ధం   
* రూ.12 లక్షల ఆస్తినష్టం

సోమేశ్వరం (రాయవరం) : నాలుగేళ్ల క్రితం జరిగిన అగ్ని ప్రమాదం భయానక దృశ్యాలను వారింకా మరువలేదు. మరోసారి అగ్ని ప్రమాదం వారి జీవితాల్లో నిప్పులుకక్కింది. సోమేశ్వరం గ్రామంలో సోమవారం రాత్రి జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో నాలుగిళ్లు, ఓ పాన్‌షాప్‌తో పాటు స్కూల్ బస్సు పూర్తిగా కాలిపోయింది. సుమారు రూ.12 లక్షల ఆస్తినష్టం వాటిల్లింది.
 
దీపంలో చమురు పోస్తుండగా..

సోమేశ్వరస్వామి ఆలయం ఎదురుగా ఉన్న రుద్రగుండాన్ని ఆనుకుని సబ్బెళ్ల మంగ, మట్టా రామారావు, అచ్చాలు, విత్తనాల మంగ, చింతా వీరన్న కుటుంబాలు తాటాకిళ్లలో నివ సిస్తున్నాయి. వెలుగుతున్న కిరోసిన్ దీపంలో అచ్చమ్మ చమురు పోస్తుండగా, మంటలు ఎగిసిపడ్డాయి. ఆ ఇంటిని చుట్టుముట్టిన మంటలు.. పక్కనున్న ఇళ్లకూ వ్యాపించాయి. ఈ సంఘటనలో నాలుగు తాటాకిళ్లు, నందికోళ్ల శ్రీనివాస్‌కు చెందిన పాన్‌షాపు దగ్ధమయ్యాయి. కుతుకులూరుకు చెందిన  ఓ ప్రైవేటు పాఠశాల బస్సు డ్రైవర్‌గా అడట ప్రసాద్ పనిచేస్తున్నాడు. బస్సును సంఘటన స్థలానికి సమీపంలో పార్కింగ్ చేసి, చింతలూరు తీర్థానికి వెళ్లాడు. అగ్నిప్రమాదంలో ఆ బస్సు కూడా పూర్తిగా కాలిపోయింది.

అదుపు చేసేందుకు యత్నం
మంటలు ఎగిసిపడిన వెంటనే స్థానికులు వాటిని అదుపు చేసేందుకు విఫలయత్నం చేశారు. మంటల తీవ్రత ఎక్కువగా ఉండడంతో వారేమీ చేయలేకపోయారు. సమాచారం అందుకున్న రామచంద్రపురం అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకునేసరికి నాలుగిళ్లు, పాన్‌షాపు, బస్సు భస్మీపటలమయ్యాయి. ఇంటిలోని సామగ్రి తెచ్చుకునేందుకు కూడా వీల్లేకపోవడంతో ఆయా కుటుంబాలు కట్టుబట్టలతో మిగిలాయి. రామచంద్రపురం, మండపేట అగ్నిమాపక అధికారులు ఎన్.నాగేంద్రప్రసాద్, డి.చిన్నిబాబు ఆధ్వర్యంలో సిబ్బంది మంటలను అదుపు చేశారు. సోమేశ్వరం-రాజానగరం రహదారి పక్కనే సంఘటన చోటుచేసుకోవడంతో ట్రాఫిక్ స్తంభించింది.
 
సర్వం కోల్పోయాం

ప్రమాదంలో తాము సర్వం కోల్పోయామని బాధితులు బోరున విలపించారు. అప్పు తెచ్చిన రూ.10 వేలు బూడిదైనట్టు మట్టా రామారావు విలపించాడు. మనవడి కాలి ఆపరేషన్ చేయించేందుకు తెచ్చిన రూ.30 వేలు బుగ్గయినట్టు సబ్బెళ్ల మంగ రోదించింది. 2010 డిసెంబర్ 4న ఇదే ప్రాంతంలో అగ్నిప్రమాదం జరిగింది. కాగా బాధిత కుటుంబాలకు  స్థానిక కొబ్బరితోట పాఠశాలలో పునరావసం కల్పించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement