బెజవాడ వేదికగా.. | Sakshi
Sakshi News home page

బెజవాడ వేదికగా..

Published Mon, Oct 20 2014 1:35 AM

బెజవాడ వేదికగా.. - Sakshi

  • నవ్యాంధ్రలో రేపు పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం
  •  కొత్త రాజధానిలో తొలిసారి ప్రభుత్వ  అధికారిక కార్యక్రమం
  •  హాజరుకానున్న సీఎం చంద్రబాబు
  •  ఇందిరాగాంధీ స్టేడియంలో అమరవీరుల తాత్కాలిక స్తూపం సిద్ధం
  • సాక్షి, విజయవాడ : రాష్ట్ర పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ సభకు నవ్యాంధ్ర రాజధాని విజయవాడ సిద్ధమైంది. రాజధానిలో తొలిసారి నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి అధికారిక కార్యక్రమం కావడంతో అధికారులు అట్టహాసంగా ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొననున్న దృష్ట్యా పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు ఉమ్మడి రాష్ట్రంలో అమరులైన పోలీసు అమరవీరుల జాబితా మాత్రమే ఉంది.

    రాష్ట్ర విభజన క్రమంలో మళ్లీ లెక్క తేల్చి అమరుల జాబితాను ఈ వేదికపై ప్రకటించే అవకాశం ఉంది. సభ నిర్వహించే ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో పోలీసు అమరవీరుల సంస్మరణ స్తూపాన్ని తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో హైదరాబాద్‌లోని గోషామహల్ స్టేడియంలో ఉన్న పోలీసు అమరవీరుల స్తూపం తెలంగాణకు వెళ్లింది.

    దీంతో ఆంధ్రప్రదేశ్‌లో కొత్త స్తూపం నిర్మించేందుకు పలు ప్రాంతాలు పరిశీలించిన అధికారులు సమయాభావం వల్ల తాత్కాలిక స్తూపం ఏర్పాటు చేస్తున్నారు. వాస్తవానికి రాష్ట్ర విభజన వెంటనే నవ్యాంధ్రలో పోలీసుల అమరవీరుల స్తూపాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది. రాజధాని ఎంపిక ఆలస్యం కావడంతో పోలీసు శాఖ ఈ విషయంపై దృష్టి పెట్టలేదు. దీంతో పోలీసు చరిత్రలోనే తొలిసారిగా తాత్కాలిక స్తూపానికి నివాళి అర్పించాల్సిన పరిస్థితి తలెత్తింది.
     
    ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్న డీజీ గౌతమ్ సవాంగ్

    బెటాలియన్స్ డీజీ గౌతమ్ సవాంగ్ ఆదివారం స్టేడియంలో ఏర్పాట్లను పర్యవేక్షించారు. సోమవారం రాష్ట్ర డీజీపీ జేవీ రాముడు రానున్నారు. ఇప్పటికే ప్రాంగణంలో తాత్కాలిక స్తూపం నిర్మాణం దాదాపు పూర్తయింది. డీజీ గౌతమ్ సవాంగ్‌కు ఏర్పాట్ల గురించి డీసీపీ(పరిపాలన) జీవీ అశోక్ కుమార్ వివరించారు. ఏసీపీ లావణ్యలక్ష్మి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

    శాశ్వత స్తూపానికి కసరత్తు

    అమర వీరుల సంస్మరణ కార్యక్రమం ముగిసిన అనంతరం శాశ్వత స్తూపం ఏర్పాటుకు అధికారులు కసరత్తు ప్రారంభించే అవకాశం ఉంది. ఇప్పటికే ఇందుకోసం 5 నుంచి 10 ఎకరాల స్థలం కేటాయించాలని పోలీసులు అధికారులు రెవెన్యూ ఉన్నతాధికారులను కోరారు. డీజీపీ కార్యాలయం విజయవాడ లేదా మంగళగిరిలో ఏర్పాటు చేసే అవకాశం ఉన్నందున నగరంలో గానీ, శివారు ప్రాంతాల్లో గాని భూమిని సేకరించి శాశ్వత స్తూపం ఏర్పాటు చేసే అవకాశం ఉంది.
     

Advertisement

తప్పక చదవండి

Advertisement