చిన్ని మా గూళ్లు.. బాగయ్యేదెన్నడో? | Sakshi
Sakshi News home page

చిన్ని మా గూళ్లు.. బాగయ్యేదెన్నడో?

Published Thu, Feb 11 2016 12:40 AM

ntr Grhanavikarana Scheme

‘ఎన్‌టీఆర్ గృహనవీకరణ’కు రూ.17 కోట్లు
 మూడు నెలలవుతున్నా పథకంలో కానరాని పురోగతి
 జన్మభూమి కమిటీల తాత్సారంతో పేదల్లో నిరాశ

 
 ఎన్నడో సర్కారు నిర్మించి ఇచ్చిన తమ చిన్నిగూళ్లలో.. కాలక్రమంలో తలెత్తిన చిన్నాపెద్దా లోపాలను సరిదిద్దుకోవడానికి తిరిగి సర్కారే చేయూతనిస్తోందని సంతోషించారు పేదలు. 1993-2004 మధ్య ప్రభుత్వం నిర్మించిన ఇళ్ల మరమ్మతులకు జిల్లాకు రూ.17 కోట్లు మంజూరు కాగా..నియోజకవర్గానికి 1,000 ఇళ్లను ఎంపిక చేయూల్సి ఉంది. అయితే జన్మభూమి కమిటీల జాప్యం పేదలను నిరాశకు గురి చేస్తోంది.
 
 మండపేట : పేదల ఇళ్లకు మరమ్మతులు చేసేందుకు నిర్దేశించిన ‘ఎన్‌టీఆర్ గృహనవీకరణ’ పథకం జిల్లాలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడ అన్న చందాన ఉంది. ఈ పథకం కింద మరమ్మతులకు రూ.17 కోట్లు మంజూరై దాదాపు మూడు నెలలు కావస్తున్నా క్షేత్రస్థాయిలో కార్యరూపం దాల్చడం లేదు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఇంకా ప్రారంభంకాలేదు. జన్మభూమి కమిటీలు పట్టనట్టు  వ్యవహరిస్తుండటం ఇందుకు కారణంగా తెలుస్తోంది. 1993 -2004 మధ్య కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వం నిర్మించిన పేదల ఇళ్లకు ఎన్‌టీఆర్ గృహ నవీకరణ పథకం కింద మరమ్మతులు చేరుుంచేందుకు మూడు నెలల క్రితం ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.
 
 జిల్లాలోని అర్బన్ నియోజకవర్గాలు మినహా మిగిలిన 17 నియోజకవర్గాలకు ఒక్కో నియోజకవర్గానికి వెయ్యి ఇళ్లకు నిధులను కేటాయించింది. ఒక్కో ఇంటి మరమ్మతుల నిమిత్తం రూ.10 వేల చొప్పున రూ.17 కోట్లను మంజూరు చేసింది. ఆ రూ.10 వేలతో దెబ్బ తిన్న ఇంటి పైకప్పు మరమ్మతులు, ప్లాస్టింగ్, ఫ్లోరింగ్, గోడలు, శానిటరీ లీకేజీలు, విద్యుత్ వ్యవస్థ తదితరాలకు మరమ్మతులు చేరుుంచుకుని, పాడైన ఇళ్లను నివాసయోగ్యంగా మార్చుకోవచ్చు. లబ్ధిదారుల ఎంపిక బాధ్యతను సర్కారు జన్మభూమి కమిటీలకు అప్పగించింది. జనవరి ఒకటి నుంచి ప్రారంభించి మూడు నెలల వ్యవధిలో పూర్తి చేయాలని సూచించింది. కాగా జిల్లాలో ఎక్కడ ఈ పథకం అమలుకాకపోవడం విమర్శలకు తావిస్తోంది.
 
 జిల్లాలో 17 వేల ఇళ్లకు అవకాశం
 1993 - 2004 మధ్య కాలంలో జిల్లావ్యాప్తంగా 2,01,780 ఇళ్లను నిర్మించగా ఎన్‌టీఆర్ గృహనవీకరణ పథకం కింద 17 వేల ఇళ్లను మాత్రమే నవీకరించుకునే వీలుంది. ఇంటి పట్టా, ఆధార్, రేషన్‌కార్డు, బ్యాంకు పాస్‌బుక్, సెల్‌నంబర్ తదితర వివరాలతో కూడిన దరఖాస్తులను జన్మభూమి కమిటీలు ఆమోదించి గృహనిర్మాణ శాఖ పరిశీలన నిమిత్తం పంపాలి. ఆ దిశగా జన్మభూమి కమిటీలు చొరవ చూపకపోవడంతో ఈ పథకం ఎక్కడా ముందుకు సాగడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
 
 ఎంపిక చేసిన ఇళ్లను గృహ నిర్మాణసంస్థ సిబ్బంది జియో ట్యాగింగ్ పరిధిలోకి తీసుకురావాలి. వీడియో కాన్ఫరెన్స్‌లలో తరచూ అధికారులు పథకం అమలు తీరుపై సమీక్షించడం మినహా క్షేత్రస్థాయిలో కార్యరూపం దాల్చకపోవడం గమనార్హం. ఈనెల 15 నాటికి  లబ్ధిదారుల వివరాలు అందజేయాలని ఇప్పటికే ఉన్నతస్థాయి నుంచి జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు అందినట్టు సమాచారం. కాగా ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల మేరకు లబ్ధిదారుల వివరాలను జన్మభూమి కమిటీలు  ఇవ్వకపోతే ఏం చేయగలమని అధికారులు ప్రశ్నిస్తున్నారు. నిధులు మంజూరై, మరమ్మతులు చేరుుంచుకుంటే మరికొంత కాలం తమ ఇళ్లు పదిలంగా ఉంటాయని గంపెడాశతో ఉన్న పేదలు పథకాన్ని త్వరగా అమలు చేయాలని కోరుతున్నారు.
 
 లబ్ధిదారుల వివరాలు రావాలి..
 ఈ పథకం లబ్ధిదారుల వివరాలను ఈనెల 15 నాటికి పంపాల్సి ఉందని గృహ నిర్మాణ సంస్థ పీడీ సెల్వరాజ్ చెప్పారు. ఆ దిశగా జన్మభూమి కమిటీలు వివరాలు సేకరించాలని మండల పరిషత్ అధికారులకు సూచించామన్నారు. త్వరితగతిన లబ్ధిదారుల వివరాలు సేకరించి మంజూరు నిమిత్తం ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు.
 

Advertisement
Advertisement