దండకారణ్యంలో దడ.. దడ | Sakshi
Sakshi News home page

దండకారణ్యంలో దడ.. దడ

Published Wed, Dec 2 2015 12:01 AM

దండకారణ్యంలో దడ.. దడ

మావోయిస్టు పార్టీ  ఏటా నిర్వహించే పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ(పీఎల్‌జీఎ) వారోత్సవాలు బుధవారం నుంచి ప్రారంభమవుతున్నాయి. డిసెంబర్ 2 నుంచి 8వ తేదీ వరకూ జరిగే ఈ వారోత్సవాల్లో ఉద్యమంలో అమరులకు నివాళులర్పించడమే కాకుండా భారీ విధ్వంసానికి మావోలు వ్యూహ రచన చేస్తున్నారని ఇంటిలిజెన్స్ హెచ్చరించడంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమయింది. -సాక్షి, విశాఖపట్నం
 
విశాఖ మన్యంలో మావో ఉద్యమం 1981-82 మధ్య ప్రారంభమైంది. 1885లో జర్రెల ప్రారంతో తొలి దాడి జరిగింది. అనంతరం ధారకొండలో కొందరిని హత్య చేశారు. అక్కడి నుంచి మావోల కార్యకలాపాలు విస్తరించడం ప్రారంభమైంది. 2000 సంవత్సరంలో పోలీసులు మావోల అంశాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. తర్వాత ప్రభుత్వం శాంతి చర్చలకు పిలవడంతో రెండేళ్ల పాటు ఉద్యమం చల్లారిపోయింది. ఆ తరువాత కొద్దిగా కదలికలు ఉన్నప్పటికీ  2014 వరకూ  మావోయిస్టులు స్తబ్దుగా ఉన్నారు. గతేడాది గమ్మెలి సంజీవరావు అనే వ్యక్తిని మావోయిస్టులు ఇన్‌ఫార్మర్ నెపంతో హత్య చేశారు. దానికి కొనసాగింపుగా చింతపల్లి మండలం కోరుకొండ సమీపంలో  వీరవరంలో సింహాచలం అనే వ్యక్తిని ప్రజాకోర్టులో హతమార్చేందుకు మావోయిస్టులు ప్రయత్నించారు. వారిని గిరిజనులు అడ్డుకుని మావోయిస్టు పార్టీ దళ కమాండర్ శరత్‌తో పాటు మిలీషియా సభ్యులు గణపతి, నాగేశ్వరావులను హతమార్చడంతో మళ్లీ ఉద్యమం ఎరుపెక్కింది.

అప్రమత్తమైన బలగాలు : బాక్సైట్ అంశాన్నే  మావోయిస్టులు ఆయుధంగా మార్చుకుంటున్నారని పోలీసులు అంటున్నారు. మళ్లీ పార్టీని బలోపేతం చేసేదిశగా ఛత్తీస్‌గఢ్ నుంచి మావోయిస్టులు విశాఖ మన్యంలో అడుగుపెట్టారని గుర్తించారు. గతేడాది ‘పీఎల్‌జీఎ’లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. అమర వీరులకు నివాళిగా  30 అడుగుల స్థూపాన్ని నిర్మించాలని మావోలు అనుకున్నప్పటికీ దానిని కూడా పోలీసులు అడ్డుకున్నారు. కానీ ఈసారి బాక్సైట్ ఉద్యమం నేపధ్యంలో భారీ విధ్వంసానికి మావోలు ప్రణాళికలు రచిస్తున్నట్లు పోలీసులకు సమాచారం ఉంది. దీంతో సాధారణ రోజుల్లో ఉపయోగించే సిబ్బందికి అదనంగా కేంద్ర, రాష్ట్ర ప్రత్యేక బలగాలను పీఎల్‌జీఏ వారోత్సవాలను అడ్డుకునేందుకు రప్పిస్తున్నారు. అత్యాధునిక అయుధాలు, వైర్‌లెస్ సెట్లు, వాహనాలను వారికి సమకూర్చుతున్నారు.

కాలి నడకన కిలోమీటర్ల కొలదీ దూరాలు ప్రయాణిస్తూ ఈ బలగాలు తనిఖీలు నిర్వహించేలా ప్రణాళికలు వేశారు. ప్రభుత్వ కార్యాలయాలు, పోలీస్ స్టేషన్లు, రైల్వే ట్రాక్‌లు, సెల్ టవర్లు, ఘాట్ రోడ్లు, రద్దీ ప్రాంతాల్లో బాంబ్ స్క్వాడ్ బృందాలు అణువణువునూ జల్లెడపట్టనున్నాయి. మావోయిస్టులకు ఆశ్రయం కల్పించే ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. అక్కడ ప్రతి ఇంటినీ సోదా చేయనున్నారు. గుర్తింపు కార్డు లేని వారిని, అనుమానితులను మన్యంలో అడుగుపెట్టనివ్వకూడదని నిర్ణయించారు.
 

Advertisement
Advertisement