‘సీమ’లో మూడు ఎత్తిపోతలకు గ్రీన్‌ సిగ్నల్‌  | Sakshi
Sakshi News home page

‘సీమ’లో మూడు ఎత్తిపోతలకు గ్రీన్‌ సిగ్నల్‌ 

Published Tue, Nov 19 2019 4:47 AM

Green signal for all three Lift Irrigation scheme in Rayalaseema - Sakshi

సాక్షి, అమరావతి: కృష్ణా వరదను ఒడిసి పట్టి రాయలసీమ సాగు, తాగునీటి ఇబ్బందులను అధిగమించే మూడు ఎత్తిపోతల పథకాలకు రూ.4.27 కోట్లతో తొలి దశ పరిపాలనా అనుమతులు మంజూరయ్యాయి. గత సెప్టెంబర్‌ 2వ తేదీన పులివెందుల ప్రాంత అభివృద్ధి సంస్థ (పీఏడీఏ) పరిధిలో చేపట్టాల్సిన పనులపై ముఖ్యమంత్రి జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఇందులో తీసుకున్న నిర్ణయాల ఆధారంగా మూడు ఎత్తిపోతల పథకాలకు పరిపాలనా అనుమతి ఇస్తూ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ ఉత్తర్వులు జారీ చేశారు. డీపీఆర్‌ సిద్ధమయ్యాక పనులు చేపట్టేందుకు రెండో దశ పరిపాలన అనుమతి మంజూరవుతుంది. వీటి ఆధారంగా టెండర్లు పిలుస్తారు. 

1,050 క్యూసెక్కుల ఎత్తిపోత ఇలా.. 
గాలేరు–నగరి ప్రధాన కాలువ నుంచి రోజుకు 1,050 క్యూసెక్కుల చొప్పున కాలేటివాగు రిజర్వాయర్‌కు తరలించి అక్కడి నుంచి 350 క్యూసెక్కులను ఎత్తిపోసి చక్రాయిపేట, రామాపురం, లక్కిరెడ్డిపల్లె మండలాల్లో చెరువులను నింపుతారు. కాలేటివాగు రిజర్వాయర్‌ నుంచి 700 క్యూసెక్కులను లిఫ్ట్‌ చేసి హంద్రీ–నీవా ప్రధాన కాలువలో 473 కి.మీ వద్దకు తరలిస్తారు. వెలిగల్లు, శ్రీనివాసపురం, అడవిపల్లి రిజర్వాయర్లను నింపుతారు. ఈ పనుల డీపీఆర్‌ తయారీకి రూ.3.58 కోట్లు మంజూరు చేశారు. ఈ పనులు చేపట్టడానికి రూ.1,272 కోట్లు అవసరం అవుతాయని ప్రాథమికంగా అంచనా వేశారు. 

వేముల, వేంపల్లిలో 15 వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ 
గాలేరు–నగరి ప్రధాన కాలువ నుంచి రోజుకు 240 క్యూసెక్కులను లిఫ్ట్‌ చేసి అలవపాడు చెరువు నింపుతారు. అక్కడి నుంచి పులివెందుల బ్రాంచ్‌ కెనాల్‌(పీబీసీ)లో 52 కి.మీ. వద్ద ఎత్తిపోసి వేముల, వేంపల్లి మండలాల్లో 15 వేల ఎకరాల ఆయకట్టును స్థిరీకరిస్తారు. దీని డీపీఆర్‌ తయారీకి రూ.18 లక్షలు మంజూరు చేశారు. ఈ పనులు చేపట్టడానికి రూ.57 కోట్లు అవసరం అవుతాయని ప్రాథమికంగా అంచనా వేశారు. చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ నుంచి యర్రబల్లి చెరువును నింపడంతోపాటు పరిసర ప్రాంతాల్లోని లింగాల, పులివెందుల మండలాల్లో చెరువులు కూడా నింపుతారు. ఈ పనుల డీపీఆర్‌కు రూ.51 లక్షలు మంజూరు చేశారు. ఈ పనులు చేపట్టడానికి రూ.108 కోట్లు అవసరం అవుతాయని ప్రాథమికంగా అంచనా వేశారు.  

నీటి కష్టాల నుంచి విముక్తి.. 
వైఎస్సార్‌ జిల్లాలో పాపాఘ్ని నదిపై 4.56 టీఎంసీల సామర్థ్యంతో వెలిగల్లు రిజర్వాయర్‌ నిరి్మంచినా వర్షాభావంతో ఆయకట్టుకు నీళ్లందించలేని దుస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో పులివెందుల, లింగాల మండలాల్లో సాగు, తాగునీటి ఇబ్బందులను అధిగమించేందుకు గాలేరు–నగరి జలాలను వినియోగించుకునే ప్రతిపాదనకు ముఖ్యమంత్రి జగన్‌ ఆమోదముద్ర వేయడంతో నీటి కష్టాలు తీరనున్నాయి.  

Advertisement
 
Advertisement
 
Advertisement