రైతుపై ప్రభుత్వం చిన్నచూపు : మోపిదేవి | Sakshi
Sakshi News home page

రైతుపై ప్రభుత్వం చిన్నచూపు : మోపిదేవి

Published Tue, Jul 28 2015 4:00 PM

రైతుపై ప్రభుత్వం చిన్నచూపు : మోపిదేవి - Sakshi

నిజాంపట్నం (గుంటూరు) : ఇకనైనా సీఎం చంద్రబాబు రాజధాని జపం మాని రైతుల జపం చేయాలని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోపిదేవి వెంకట రమణారావు హితవు పలికారు. మంగళవారం నిజాంపట్నంలోని తన నివాసంలో ఏర్పాటు చేసి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వర్షాలు లేక నారుమడులు పొయ్యాలా వద్దా అనే సందిగ్ధంలో రైతులు ఉంటే, వారికి స్పష్టమైన సమాచారాన్ని ఇవ్వాల్సిన ప్రభుత్వం చోద్యం చూస్తుందన్నారు. ప్రభుత్వం రైతులకు మనోధైర్యం కల్పించడంలో పూర్తిగా విఫలమైందన్నారు.

రైతుల గత బకాయిలు చెల్లించక బ్యాంకర్లు క్రాప్ లోనులు ఇవ్వడం లేదని, అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టే పరిస్థితులు లేక రైతులు విలవిలలాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి రాజధాని అవసరమేనని అయితే ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు రాజధాని జపమే తప్ప సీఎం చంద్రబాబు రైతుల గురించి ఆలోచించే పరిస్థితే లేకుండా పోయిందన్నారు.

చేతగాని దద్దమ్మ ప్రభుత్వం

రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ అధికారులపై దాడులు అధికమౌతున్నాయని మోపిదేవి ఆరోపించారు. మహిళా తహశీల్దార్‌పై దాడికి పాల్పడిన ఎమ్మెలేపై చర్యలు తీసుకోలేని అసమర్ధ ప్రభుత్వమన్నారు. దానిని ఆసరాగా తీసుకుని విఆర్‌వో, విఆర్‌ఎలపై దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అధికారులపై దాడులను పార్టీ తరుఫున ఖండిస్తున్నట్లు ఆయన తెలిపారు.
 

Advertisement
Advertisement