నకిలీ మావోయిస్టు అరెస్టు | Sakshi
Sakshi News home page

నకిలీ మావోయిస్టు అరెస్టు

Published Fri, Oct 31 2014 12:14 AM

నకిలీ మావోయిస్టు అరెస్టు - Sakshi

 కాకినాడ క్రైం :మావోయిస్టునని చెప్పి బెదిరించిన ఓ యువకుడిని టూ టౌన్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ఎస్సై కేవీవీ సత్యనారాయణ కథనం ప్రకారం... కిర్లంపూడి మండలం తూమువారి వీధికి చెందిన 22 ఏళ్ల దాడి సంతోష్ కుమార్ 2012 కాకినాడలోని ఓ ప్రైవేటు కంప్యూటర్ సెంటర్‌లో ఒకేషనల్ కోర్సు పూర్తి చేశాడు. అప్పట్లో అతడు కిర్లంపూడి నుంచి కాకినాడ వచ్చి వెళుతుండేవాడు. ఆ క్రమంలో ఒక రోజు బస్సులో టాటా డొకోమో సిమ్ అతడికి దొరికింది. అనంతరం అతడు 2013లో హైదరబాద్ బంజారాహిల్స్‌లోని ఓ అడ్వర్‌టైజ్‌మెంట్ కంపెనీలో ఎలక్ట్రీషియన్‌గా విధులు నిర్వహించేవాడు. 2014 జూన్‌లో అతడు ఉద్యోగం మానివేసి కాకినాడ బయలుదేరాడు.
 
 ఆ సమయంలో అతడికి గౌతమి ఎక్స్‌ప్రెస్‌లో ఒక సెల్‌ఫోన్ దొరికింది. అంతకు ముందు దొరికిన సిమ్‌కార్డును ఆ సెల్‌ఫోన్‌లో వేసి ఆగస్ట్ ఏడోతేదీన కిర్లంపూడికి చెందిన పంచాయతీ రాజ్ రిటైర్డ్ ఏఈ నున్న లక్ష్మణరావుకు ఫోన్ చేసి తాను మావోయిస్టునని చెప్పాడు. రూ.పది లక్షలు ఇవ్వని పక్షంలో చంపేస్తానని బెదిరించాడు. అదేవిధంగా కాకినాడకు చెందిన శ్రీరామ్ హోమియో హాస్పిటల్ అధినేత సానబోయిన శ్రీనివాసరావుకు కూడా ఫోన్ చేసి బెదిరించాడు. ఏటీఎం కార్డు ద్వారా సొమ్మును తనకు అందజేయాల్సిందిగా సూచించాడు. దీంతో నున్న లక్ష్మణరావు, సానబోయిన శ్రీనివాసరావు టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు సంతోష్ కుమార్‌ను అరెస్టు చేశారు.
 

Advertisement
Advertisement