కిడ్నీలు పాడై.. అప్పుల పాలై | Sakshi
Sakshi News home page

కిడ్నీలు పాడై.. అప్పుల పాలై

Published Sat, May 28 2016 1:19 AM

Damaged kidneys debt fell ..

* నాలుగేళ్లుగా కేజీహెచ్‌లో డయాలసిస్
* ఆర్థిక స్తోమత లేక రోడ్డున పడ్డ కుటుంబం
* ఆదుకోవాలని కిడ్నీవ్యాధిగ్రస్తుని వినతి

ధర్మవరం (శృంగవరపుకోట రూరల్) : కారుడ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. భార్య, ఇద్దరు పిల్లలతో ఉన్నంతలో జీవితాన్ని గడుపుతున్నాడు. ఇప్పుడా ఇంటి యజమానికి తీవ్ర అనారోగ్యం చేసింది. రెండు కిడ్నీలు పాడైపోవడంతో కుటుంబం పస్తులుంటోంది. ఎస్.కోట మండలం ధర్మవరం ఎస్టీ కాలనీకి చెందిన గొర్లె నారాయణరావు దీనగాధ ఇది.

ధర్మవరానికి చెందిన గొర్లె నారాయణరావు విశాఖలో కారు డ్రైవరుగా పనిచేస్తూ కుటుంబంతో నివసించేవాడు. నాలుగేళ్ల కిందట ఒంట్లో బాగోలేక విశాఖలోని కేర్ ఆస్పత్రికి వెళ్లగా తనిఖీ చేసిన వైద్యులు అతని రెండు కిడ్నీలు పని చేయడం లేదని తెలియజేసి కేజీహెచ్‌లో చేరాలని సూచించారు. అప్పటి నుంచి కేజీహెచ్ చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది. భార్య గౌరమ్మ, పిల్లలు నవీన్, జగదీష్‌ల తో కలిసి స్వగ్రామమైన ధర్మవరం చేరుకున్నాడు. కుటుంబ సభ్యులు అప్పు చేసి విశాఖలోని కేజీహెచ్‌కు నారాయణరావును తీసుకెళ్లి డయాలసిస్ చేయించుకొస్తున్నారు.

ఒక పక్క బాకీ తీర్చమని అప్పులిచ్చిన వారు ఒత్తిడి చేస్తుండటంతో అతని భార్య గౌరమ్మ కూలి పనులకు వెళ్తోంది. ఇప్పుడా కుటుంబానికి ఒక పూట తిండి ఉంటే మరో పూట లేని పరిస్థితి దాపురించింది. కిడ్నీ వ్యాధిగ్రస్తునికి ఆర్థిక సాయం చేయాలనుకునే దయామయులు 9000262902 ఫోన్ నంబర్‌కు ఫోన్ చేయాలని సర్పంచ్ గొర్లె దేముడు, రోగి భార్య గౌరమ్మ విజ్ఞప్తి చేశారు.

Advertisement
Advertisement