‘దేశం’లో గందరగోళం | Sakshi
Sakshi News home page

‘దేశం’లో గందరగోళం

Published Fri, Apr 18 2014 4:23 AM

Country' in the chaos

  •      బీజేపీతో పొత్తుపై తొలగని సందిగ్ధం
  •      మదనపల్లెలో టీడీపీ నేతల నామినేషన్లు
  •      తంబళ్లపల్లెలో కలిచర్ల లేదా ఆయన మేనల్లుడు ఇండిపెండెంట్‌గా పోటీ చేసే అవకాశాలు
  •      తిరుపతి, సత్యవేడు అభ్యర్థుల ప్రకటనలో బాబు నాన్చుడు ధోరణి
  •      నేడు అనుచరులతో చదలవాడ సమావేశం
  •  సాక్షి, తిరుపతి: సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేందుకు ఇక శనివారం ఒక్క రోజు మాత్రమే ఉంది. ఇప్పటికి కూడా తెలుగుదేశంలో గందరగోళం వీడలేదు. బీజేపీతో పొత్తు వ్యవహారం మళ్లీ మొదటికొచ్చిం ది. దీంతోపాటు సత్యవేడు, తిరుపతి నియోజకవర్గాల అభ్యర్థుల ప్రకటనలో చంద్రబాబు నాన్చుడు ధోరణితో ఆ పార్టీ శ్రేణుల్లో సందిగ్ధత చోటుచేసుకుంది.

    బీజేపీతో పొత్తు ఉండదని ప్రచారం జరగడంతో మదనపల్లె అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ తర ఫున గురువారం ముగ్గురు నామినేషన్లు దాఖలు చేశారు. మరికొందరు శనివారం నామినేషన్లు వేస్తామని చెబుతున్నారు. మరోవైపు ఇటీవల టీడీపీలో చేరిన తంబళ్లపల్లె మాజీ ఎమ్మెల్యే కలిచర్ల ప్రభాకరరెడ్డి ఆ పార్టీకి గుడ్‌బై చెప్పే ఆలోచనలో ఉన్నారు. తిరుపతి నియోజకవర్గ ఇన్‌చార్జి చదల వాడ కృష్ణమూర్తి శుక్రవారం తన వర్గీయులతో సమావేశమవుతున్నారు. తాజా పరిణామాలతో టీడీపీ శ్రేణుల్లో నిరుత్సాహం, గందరగోళం నెలకొన్నాయి.
     
    మదనపల్లెలో ముగ్గురు నామినేషన్లు
     
    పొత్తుల్లో భాగంగా మదనపల్లె అసెంబ్లీ స్థానాన్ని బీజేపీకి వదిలిపెట్టారు. అక్కడి నుంచి జాతీయ కిసాన్ మోర్చ ప్రధాన కార్యదర్శి చల్లపల్లె నరసింహారెడ్డి ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు. కాగా ఈ సీటును బీజేపీకి ఇవ్వడం పట్ల టీడీపీ నేతలు మొదటి నుంచీ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ అంతగా బలం లేని బీజేపీకి అవకాశం ఇవ్వకూడదంటూ రాజధానికి వెళ్లి చంద్రబాబుకు మొరపెట్టుకున్నారు. వీరిని చంద్రబాబు మందలించి పంపారు.

    నామినేషన్ల దాఖలుకు చివరి క్షణాలు సమీపిస్తున్న తరుణంలో పొత్తు ఉండదని ప్రచారం జరగడంతో మదనపల్లె టీడీపీ నేతల్లో ఆశలు చిగురించాయి. టికెట్టు ఎవరికిచ్చినా పర్వాలేదనుకుని గురువారం ఒక్కరోజే మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్, రాందాస్‌చౌదరి, వల్లిగట్ల రెడ్డప్ప నామినేషన్లు దాఖలు చేశారు. మరో ముగ్గురు నాయకులు శనివారం నామినేషన్లు దాఖలు చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. రాజంపేట లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి గురువారం నామినేషన్ వేశారు.
     
    అభ్యర్థుల ప్రకటనలో జాప్యం
     
    తిరుపతి, సత్యవేడు అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థుల ప్రకటనలో చంద్రబాబు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. తిరుపతిలో అసంతృప్తులు చెలరేగే ప్రమాదం ఉండడంతో వ్యూహాత్మకంగానే ఇక్కడ అభ్యర్థి ప్రకటనలో జాప్యం చేస్తున్నారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ నుంచి ఇటీవల టీడీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే వెంకటరమణ గురువారం తిరుపతి స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.

    ఈయనకు ఇంకా బీఫారం ఇవ్వలేదు. ఎన్నికల షెడ్యూల్ ముందు నుంచి అభ్యర్థిగా ప్రచారం చేసుకున్న నియోజకవర్గ ఇన్‌చార్జి చదలవాడ కృష్ణమూర్తి తిరుపతిలో ఉన్నప్పటికీ అధికారిక ప్రకటన కోసం ఎదురుచూస్తున్నట్టు కనిపిస్తోంది. కాగా, ఆయన శుక్రవారం తన వర్గీయులతో సమావేశం ఏర్పాటు చేశారు. చదలవాడ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారోనని టీడీపీ శ్రేణులు ఉత్కంఠకు గురవుతున్నాయి. సత్యవేడు నియోజకవర్గం నుంచి రాజేష్‌కృష్ణ, తలారి మనోహర్ పేర్లు పరిశీలనలో ఉండగా గురువారం తిరుపతికి చెందిన ఎస్వీ డయాగ్నస్టిక్ సెంటర్ అధినేత బి.శ్రీహరిరావు టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. దీంతో సత్యవేడు నియోజకవర్గం అభ్యర్థిలోనూ గందరగోళం నెలకొంది.
     
    అప్ప దారెటు?
     
    తంబళ్లపల్లె మాజీ ఎమ్మెల్యే కలిచర్ల ప్రభాకరరెడ్డి ఎప్పు డు ఏ నిర్ణయం తీసుకుంటారో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. గురువారం అనుచరవర్గంతో సమావేశమై న ఆయన తన నిర్ణయాన్ని ఒకటిరెండు రోజుల్లో వెల్లడిస్తానని చెప్పడం గమనార్హం. ఇటీవల టీడీపీలో చేరిన ఆయన కొద్దిరోజుల్లోనే మనసు మార్చుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాలు లేకపోలేదని ఆయన వర్గీయులు చెబుతున్నారు. ఒకవేళ ఆయన పోటీ చేయకపోతే మేనల్లుడు మల్లికార్జున రెడ్డిని బరిలోకి తెస్తారని అంటున్నారు.
     

Advertisement
Advertisement