ఆశల దీపం ఆరిపోయింది | Sakshi
Sakshi News home page

ఆశల దీపం ఆరిపోయింది

Published Fri, Aug 30 2019 9:11 AM

Child Dies Of Cancer In Srikakulam District - Sakshi

సాక్షి, మందస: ఆశల దీపం ఆరిపోయింది. ఇన్నాళ్లు ఆ ఇంట్లో గళగళమన్న కాళ్ల పట్టీల సవ్వడి ఆగిపోయింది. అందరినీ ఎంతగానో నవ్వించిన ఆ నవ్వు మాయమైంది. ఆ చిన్నారిపై క్యాన్సర్‌ మహమ్మారి పగబట్టి తిరిగిరాని లోకాలకు తీసుకుపోయింది. దాతల సాయంతోనైన బతికించుకుందామనుకున్న ఆ తల్లిదండ్రుల ప్రయత్నాలను నీరుగార్చింది. తన గారాల పట్టి భవిష్యత్‌పై ఎన్నో కలలు కన్న వారికి గుండె కోత మిగిల్చింది. మందస మండలం లొహరిబంద గ్రామానికి చెందిన చిన్నారి నవ్య(9) అలియాస్‌ ప్రేమకుమారి బుధవారం అర్ధరాత్రి బోన్‌మారో కేన్సర్‌తో మరణించింది. రెయ్యి రాజు, లక్ష్మీకాంతం దంపతులు తమ కుమార్తె మృతితో గుండెలవిసేలా రోదించారు. పేద కుటుంబానికి చెందిన వారు కావడంతో దాతలు సాయంతో ఏడాదిపాటు బతికించారు. ఈ నేపథ్యంలో పలాస ఎమ్మెల్యే డాక్టర్‌ సీదిరి అప్పలరాజు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా రూ.5 లక్షలు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ అందజేశారు.

ఏ కష్టమొచ్చిన తామంతా ఆదుకోవడానికి ముందుంటామని ఉద్దానవాసులు నవ్య సమస్యను సోషల్‌ మీడియా ద్వారా, వ్యక్తిగతంగా, పత్రికల ద్వారా బాహ్య ప్రపంచానికి చెప్పి, ఆదుకోవడానికి ఎంతో ప్రయత్నించారు. నవ్యకు సోకిన వ్యాధి చికిత్సకు అవసరమయ్యే వ్యయం సేకరించడానికి ఉద్దానం యువత సిద్ధమవుతుండగా, హఠాత్తుగా నవ్య మరణించడంతో చిన్నారిని దక్కించుకోవడానికి ప్రయత్నించిన ప్రతిఒక్కరూ కన్నీటి పర్యవంతమవుతున్నారు. ఇక ఆమె తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరి తరమూకావడం కాలేదు. అందరి ఆశలు అడియాశలు చేసిన నవ్య అంత్యక్రియలు ప్రజల కన్నీటి సంద్రం మధ్య జరిగాయి.

Advertisement
 
Advertisement
 
Advertisement