అవి దిగజారుడు రాతలు | Sakshi
Sakshi News home page

అవి దిగజారుడు రాతలు

Published Fri, Aug 18 2017 1:30 AM

అవి దిగజారుడు రాతలు - Sakshi

వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు
సాక్షి, హైదరాబాద్‌: తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబునాయుడికి వత్తాసు పలికే కొన్ని పత్రికలు, చానెళ్లు నంద్యాల ఉప ఎన్నికల సందర్భంగా పనిగట్టుకొని వాస్తవాలను వక్రీకరిస్తున్నాయని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. దిగజారుడు రాతలతో పత్రికా విలువలను దిగజార్చడం సరికాదని హితవు పలికారు. గురువారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

 ‘‘నంద్యాల ఉప ఎన్నికల్లో ఓటర్లను మభ్యపెట్టి, భయపెట్టి గెలవాలనే తాపత్రయంతో చంద్రబాబు, మంత్రులు, టీడీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. చంద్రబాబుకి వత్తాసు పలికే కొన్ని పత్రికలు, చానెళ్లు పనిగట్టుకొని అక్కడి అంశాలను వక్రీకరిస్తున్నాయి. మాజీ ఎంపీ గంగుల ప్రతాప్‌రెడ్డి టీడీపీలో చేరితే ఆయన  వైఎస్సార్‌సీపీ నుంచి వలస వెళ్లి టీడీపీలో చేరినట్లు,  వైఎస్సార్‌సీపీకి ఎదురుదెబ్బ తగిలినట్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేశాయి. గంగుల ప్రతాప్‌రెడ్డికి, వైఎస్సార్‌సీపీకి ఎప్పుడూ సంబంధం లేదు. ఆయన వైఎస్సార్‌సీపీలో చేరలేదు, ఎప్పుడూ పనిచేయలేదు’’ అని రాంబాబు స్పష్టంచేశారు.  

దిగజారిన మీడియా అధిపతి :చంద్రబాబునాయుడితో అంటకాగుతున్న ఒక పత్రిక, చానెల్‌ అధిపతి పనిగట్టుకొని ఉపఎన్నికల ముందు ట్రెండ్‌ టీడీపీకి అనుకూలంగా ఉందని చూపించే నీచానికి దిగజారారని అంబటి దుయ్యబట్టారు. వాస్తవానికి  టీడీపీ నుంచే వైఎస్సార్‌సీపీలోకి అనేకమంది తరలివస్తున్నారని చెప్పారు.  ఎమ్మెల్సీ పదవినీ, ఇతర హోదాలను కూడా వదులుకుని శిల్పా చక్రపాణిరెడ్డి, శిల్పా మోహన్‌రెడ్డి వచ్చారని, మోహన్‌రెడ్డి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా నిలుచున్నారని గుర్తుచేశారు.

Advertisement
Advertisement