వివాహేతర సంబంధం..ఉసురు తీసింది | Sakshi
Sakshi News home page

వివాహేతర సంబంధం..ఉసురు తీసింది

Published Tue, Sep 16 2014 12:32 AM

వివాహేతర సంబంధం..ఉసురు తీసింది

కౌతాళం: 
 వివాహేతర సంబంధం నిండు ప్రాణాన్ని బలిగొంది. కుటుంబం పరువు మంటగలిపి, కట్టుకున్న భర్తను కాదని ప్రియుడితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుండటంతో కసి పెంచుకున్న  బంధువులు వేటకొడవళ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో అమరేష్‌గౌడు(30) మృత్యువాత పడగా, సుధా కొనప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. సోమవారం కౌతాళం మండలం మేళిగనూరు- నదిచాగి గ్రామాల మధ్య జరిగిన ఈ సంఘటన మండలంలో కలకలం రేపింది. చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి... కాత్రికి గ్రామానికి చెందిన సిద్రమగౌడు కుమారుడు అమరేష్‌గౌడుకు (30) కర్ణాటకలోని గోనూరు గ్రామానికి చెందిన యువతితో ఐదు సంవత్సరాల క్రితం వివాహం అయింది. వీరికి 8 నెలల కూతురు ఉంది. ఇదే గ్రామానికి చెందిన శంకర్‌గౌడుకు కర్ణాటకలోని కూడ్లురు గ్రామానికి చెందిన బసవన్నగౌడు కుమార్తె సుధాతో ఆరేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు మగపిల్లలు సంతానం. అయితే గత కొన్నాళ్లుగా అమరేష్‌గౌడు, సుధాల మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం బహిర్గతం కావడంతో శంకర్‌గౌడు, సుధాల మధ్య మనస్పర్ధలు వచ్చాయి. సుధా ప్రవర్తనపై ఆమె అన్నలు మల్లికార్జున, మరేగౌడుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి ప్రయోజన ం లేదు. రెండు నెలల క్రితం అమరేష్‌గౌడు, సుధాలు కాత్రికి గ్రామాన్ని వదిలి బెంగళూరు నగరానికి చేరారు. ఈనెల 6న సుధా కాత్రికి గ్రామానికి రావడంతో ఆమె భర్త, కుటుంబ సభ్యులు చితకబాది పెద్దల వద్ద పంచాయితీ పెట్టారు. దీంతో ఆమెను తల్లిదండ్రులు పుట్టింటికి తీసుకెళ్లారు. తిరిగి రెండు రోజులకే ఉండలేక మళ్లి తిరిగి ప్రియుడు వద్దకే వెళ్లింది. సుధా తీరుతో కుటుంబం పరువు మంట గలిసిందని భర్త, బంధువులు ఆ ఇద్దరిని కడతేడ్చాలని పథకం రచించారు. ఈ మేరకు గ్రామపెద్దలతో మాట్లాడి సంసారాన్ని చక్కబెడతామని ఆ ఇద్దరిని ఆదివారం రాత్రి బెంగళూరు నుంచి పిలుచుకొని వచ్చారు. సోమవారం తెల్లవారు జామున శిరుగుప్ప నుంచి కాత్రికి గ్రామానికి వస్తుండగా మేళిగనూరు నదిచాగి రహదారిలో వేటకోడవళ్లతో సుధా, అమరేష్‌గౌడులపై అతికిరాతకంగా దాడి చేయడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. సుధా అపస్మారకస్థితిలో పడి ఉండటంతో ఆమె కూడా చనిపోయిందని భావించి ముళ్లకంప, బురదల్లో వదిలి పరారయ్యారు. ఉదయం దాహం అంటూ సుధా అరవడంతో పొలాలకు వెళ్లే కూలీలు గమనించి నీళ్లు తాపి పోలీసులకు సమాచారం ఇచ్చారు.  సంఘటన స్థలాన్ని, ఆదోని డీఎస్పీ శివరాంరెడ్డి, కోసిగి సీఐ అన్సార్‌బాషా, కౌతాళం ఎస్‌ఐ శంకర్‌నాయక్ పరిశీలించి క్షతగాత్రురాలిని వైద్యం కోసం 108 వాహనంలో ఆదోనికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఆమె భర్త శంకర్‌గౌడుతో పాటు ఆయన బంధువులు నాగన్నగౌడు, మరేగౌడు, పరమేష్‌గౌడు, చెన్నప్పలపై పోలీసులు కేసు నమోదు చేశారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.  అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా  పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
 
 
 
 
 

Advertisement
Advertisement