Sakshi News home page

వీఆర్‌వోలు ‘వెనక్కి’?

Published Thu, Aug 17 2023 1:51 AM

VROs who cannot be accommodated in other departments - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జీతం లేదు.. సీనియారిటీ లేదు.. పదోన్నతులు రావు... పనిచేసేందుకు వెళ్లిన శాఖలో వివక్ష... ఉన్నచోట ఒక్కరికే పది పనులు.. లేనిచోట ఎలాంటి పనీ లేదు.. పేరుకే జూనియర్‌ అసిస్టెంట్‌... చేయాల్సింది మాత్రం తోటమాలి, వాచ్‌మన్, అటెండర్‌ పనులు.. ఇవీ ఇతర శాఖల్లోకి వెళ్లిన ‘గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్‌వోల)’పరిస్థితి. సర్దుబాటులో భాగంగా ఇతర శాఖల్లోకి వెళ్లినవారు ఆయా చోట్ల కష్టాలు, సమస్యలను తట్టుకోలేక.. తిరిగి రెవెన్యూశాఖలోకి తీసుకోవాలని కోరుతున్నారు. దీనిపై కొన్నినెలలుగా చర్చ సాగుతున్నా.. వీఆర్‌ఏల సర్దుబాటు నేపథ్యంలో బలంగా తెరపైకి వస్తోంది.

వీఆర్‌ఏలను సర్దుబాటు చేసిన తరహాలోనే తమకు కూడా సూపర్‌ న్యూమరరీ పోస్టులను సృష్టించి రెవెన్యూ శాఖలోనే కొనసాగించాలనే డిమాండ్‌ వస్తోంది. దీనికి ప్రభుత్వంలోని కొందరు పెద్దలు కూడా మద్దతు ఇస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలో వీఆర్వోలకు పేరు మార్చి, రెవెన్యూశాఖలోనే భూసంబంధిత పనులు కాకుండా ఇతర విధులు అప్పగించేందుకు సిద్ధమవుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. 

ఏదో ఒక ఇబ్బందితో.. 
రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది ఆగస్టులో వీఆర్వోల వ్యవస్థను రద్దు చేయడంతో.. సుమారు 5,400 మంది వివిధ ప్రభుత్వ శాఖలకు వెళ్లాల్సి వచ్చింది. విద్య, మున్సిపల్, వైద్యం, మిషన్‌ భగీరథ, పంచాయతీరాజ్‌ ఇలా పలు ప్రభుత్వ శాఖలు, విభాగాల్లో వారిని సర్దుబాటు చేశారు. రెవెన్యూ శాఖ నుంచి ఇతర శాఖల్లోకి రావడంతో వారి సీనియారిటీని కోల్పోయారు. ఆరేళ్ల నుంచి గరిష్టంగా 20ఏళ్లవరకు సీనియారిటీని కోల్పోవాల్సి వచ్చిందని వారు వాపోతున్నారు. పేరుకు జూనియర్‌ అసిస్టెంట్‌ హోదాలో ఇతర శాఖల్లో చేరినా.. ఆయాచోట్ల రికార్డు అసిస్టెంట్‌గా, తోటమాలిగా, అటెండర్‌గా పనిచేయాల్సి వస్తోందని అంటున్నారు.

మున్సిపాలిటీల్లో వార్డు ఆఫీసర్లుగా వెళ్లిన వారికి కనీసం కూర్చునేందుకు కూడా కుర్చీలు లేవని చెప్తున్నారు. హైదరాబాద్‌ శివార్లలోని ఓ మున్సిపాలిటీలో వార్డు అధికారిగా చేరిన ఓ వీఆర్వోకు శక్తికి మించిన బాధ్యతలు ఇచ్చారని.. లీగల్‌ సెల్, ఇళ్లు కూలగొట్టడం, ప్రకృతి వైపరీత్యాల పర్యవేక్షణ, చెట్ల పెంపకం, పార్కుల పరిరక్షణ, చెరువుల పరిరక్షణ, ఆసరా పింఛన్లలో వేలిముద్రల గుర్తింపు పనులు అప్పగించారని వీఆర్వో వర్గాలు చెప్తున్నాయి. అన్ని పనులు చేయలేక మానసిక వేదనతో సదరు వీఆర్వో బ్రెయిన్‌స్ట్రోక్‌కు గురయ్యారని అంటున్నాయి. 

పని లేక.. జీతాలు రాక.. 
ఇక సొసైటీలు, కార్పొరేషన్లు, కొన్ని స్థానిక సంస్థల పరిధిలోకి వెళ్లిన వీఆర్వోలకు స్థానిక నిధుల నుంచే వేతనం ఇస్తుండటంతో.. కొందరికి నాలుగైదు నెలలుగా జీతాల్లేవని అంటున్నారు. కొన్నిజిల్లాల్లో అవసరమైన ఉద్యోగుల సంఖ్య (కేడర్‌ స్ట్రెంత్‌)కు మించి పోస్టింగులు ఇచ్చారని, ఐదుగురు సిబ్బంది అవసరమైన చోటకు 10 మందిని పంపారని, అక్కడ ఎలాంటి విధులు నిర్వహించాలో కూడా తెలియక ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు.

ఆయా శాఖల్లో పనిచేస్తున్న రెగ్యులర్‌ సిబ్బంది నుంచి వివక్ష ఎదుర్కోవాల్సి వస్తోందని, తమకు పదోన్నతులు రాకుండా చేయడానికి వచ్చారా? అంటూ మండిపడుతున్నారని చెప్తున్నారు.

సొంత శాఖలో సమస్యలు కూడా పరిష్కారం కాక మాజీ వీఆర్వో లు రెవెన్యూ శాఖ చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. ప్రొబేషన్‌ డిక్లరేషన్, సర్వీసు వ్యవహారాల ఫైళ్లు సీసీఎల్‌ఏ, రెవెన్యూ కార్యదర్శి పేషీల్లో పెండింగ్‌లో ఉన్నాయని.. ప్రత్యేక, సాధారణ ఇంక్రిమెంట్లు, పీఆర్సీ వర్తింపు అంశాల్లో ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం తమకు సమస్యగా మారిందని వీఆర్వోలు వాపోతున్నారు. 

సంఘాలకు అతీతంగా సమావేశమై.. 
తాము ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు రాష్ట్రంలోని 33 జిల్లా లకు చెందిన మాజీ వీఆర్వోలు బుధవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సమావేశమయ్యారు. సంఘాలకు అతీతంగా ‘సమస్యలపై చర్చ–ప్రభుత్వానికి నివేదన’అనే నినాదంతో తమ ఉద్యోగ హక్కులకు భద్రత కల్పించాలని.. లేదంటే మాతృశాఖకు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. వీఆర్వోలను ఇతర శాఖల్లో కలపడం వల్ల సీనియారిటీ దెబ్బతింటుందని, వేల మంది ఇబ్బందిపడుతున్నారని టీఆర్‌ఈఎస్‌ఏ అధ్యక్షుడు వంగ రవీందర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

సర్వీసుకు భద్రత లేక వారంతా ఆందోళనలో కూరుకుపోయారన్నారు. అయితే.. వీఆర్వోల సమావేశం నిర్వహణ వెనుక ప్రభుత్వంలో కీల క హోదాలో ఉన్న కొందరు నాయకులు ఉన్నారని, వారి సలహా మేరకే ఈ సమావేశం నిర్వహించారని సమాచారం. భూసంబంధిత అంశాలు మినహా మిగతా రెవెన్యూ వ్యవహారాల ను చూసుకునేందుకు వీఆర్వోల పేరు మార్చి మళ్లీ రెవెన్యూశాఖలోకి తీసుకునేందుకు ప్రభు త్వం సిద్ధంగా ఉందనే ప్రచారం జరుగుతోంది.

వీఆర్‌ఏలతోనే తంటా! 
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేపట్టిన వీఆర్‌ఏ సర్దుబాటు ప్రక్రియ వీఆర్వోలలో అలజడికి కారణమైంది. తమకంటే కింది కేడర్‌లో పనిచేసిన వీఆర్‌ఏలకు పేస్కేల్‌ వర్తింపజేయడంతోపాటు సూపర్‌ న్యూమరరీ పోస్టులు సృష్టించి మరీ.. రెవెన్యూ శాఖల్లోనే కొనసాగిస్తున్నారని, అదే పద్ధతిని తమ విషయంలో ఎందుకు పాటించలేదని వీఆర్వోలు ప్రశ్నిస్తున్నారు.

సర్వీసు వ్యవహారాలు పెండింగ్‌లో ఉండటంతో చాలా జిల్లాల్లో వేతనాలు రావడం లేదని, ప్రతి విషయానికి ఏదో ఒక అడ్డంకి వస్తోందని అంటున్నారు. రెవెన్యూలో మరిన్ని సూపర్‌ న్యూమరరీ పోస్టులు సృష్టించి, తమను వెనక్కి తీసుకోవడమే ఏకైక పరిష్కారమని పేర్కొంటున్నారు.  

Advertisement

తప్పక చదవండి

Advertisement