మెట్టినింట మెరిసిన కోదాడ బిడ్డ.. ఈమె ఎవరో తెలుసా? | Sakshi
Sakshi News home page

మెట్టినింట మెరిసిన కోదాడ బిడ్డ.. ఈమె ఎవరో తెలుసా?

Published Tue, Jul 6 2021 11:13 AM

Srikala Reddy From Kodad Elected As A Jaunpur  ZP Chairperson In UP - Sakshi

సాక్షి, కోదాడ(నల్గొండ) : ఆమెది రాజకీయ కుటుంబ నేపథ్యం.. ప్రజాప్రతినిధులుగా అమ్మానాన్న చేస్తున్న సేవలను చిన్నప్పటినుంచీ చూసిన ఆమెకు రాజకీయాల పట్ల ఆసక్తి కలిగింది. ఓవైపు ఫ్యాషన్‌ డిజైనర్‌గా, ఇంటీరియర్‌ డిజైనర్‌గా రాణిస్తూనే రాజకీయంవైపు అడుగులు వేసింది. పలు పార్టీల్లో చేరి పుట్టినింట తన అదృష్టాన్ని పరీక్షించాలనుకున్నా సాధ్యపడలేదు. కానీ మెట్టినింట మాత్రం తాను అనుకున్న కలను నెరవేర్చుకుంది. ఆమె కోదాడ నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే కీసర జితేందర్‌రెడ్డి కూతురు శ్రీకళారెడ్డి. ఇటీవల  ఉత్తరప్రదేశ్‌లోని జాన్‌పూర్‌ జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌గా ఎన్నికై ప్రజాసేవబాటలో తొలి అడుగువేసింది.

జెడ్పీ చైర్‌పర్సన్‌గా ఎన్నికైన తర్వాత తన సంతోషాన్ని ‘సాక్షి’తో పంచుకుంది. వివరాలు ఆమె మాటల్లోనే.. మాది సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గ పరిధిలోని నడిగూడెం మండలం రత్నవరం. మా నాన్న కీసర జితేందర్‌రెడ్డి కోదాడ సమితి ప్రెసిడెంట్‌గా, ఎమ్మెల్యేగా పని చేశారు. మా అమ్మ కీసర లలితారెడ్డి. గ్రామ సర్పంచ్‌గా పని చేశారు. వారికి నేను ఒక్కదానినే సంతానం. మానాన్న యుక్త వయస్సులో ఉండగా పులితో కలబడ్డాడు. ఆయన చేతిని పులి గాయపర్చినా లెక్క చేయకుండా దాన్ని చంపారు. అందరూ ఆయనను పులి అంటారు. ఆయన బిడ్డను కాబట్టి నేను పులి బిడ్డను. నా విద్యాభ్యాసం మొత్తం హైదరాబాద్‌లోనే సాగింది. ఫ్యాషన్‌ డిజైనర్‌గా, ఇంటీరియర్‌ డిజైనర్‌గా కొంత కాలం పని చేశాను.

రాజకీయరంగ ప్రవేశం ఇలా..
మా తండ్రి జితేందర్‌రెడ్డి 1969లో తెలంగాణ తొలి దశ ఉద్యమంలో తెలంగాణ– ఆంధ్ర సరిహద్దు పాలేరు వంతెన వద్ద జరిగిన పోరులో ముందుండి కోదాడ పట్టణా న్ని కాపాడాడు. ఆ తరువాత కో దాడ సమితి ప్రెసిడెంట్‌గా, ఎమ్మెల్యేగా పని చేశారు. మాఅమ్మ లలి తారెడ్డి మా స్వగ్రామం రత్నవరానికి సర్పంచ్‌గా పని చేశారు. వారిని చూసి స్ఫూర్తిపొంది చిన్నతనం నుంచే రాజకీయాల ద్వారా ప్రజాసేవ చేయాలనుకున్నాను. 2004 నుంచి కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్‌సీపీల నుంచి కోదాడ ఎమ్మెల్యే టికెట్‌ కోసం ప్రయత్నించినా దక్కించుకోలేకపోయాను. తరువాత బీజేపీలో చేరాను.

భర్త, మామ ప్రోత్సాహంతో..
పుట్టింట రాజకీయరంగ ప్రవేశం చేసినా అనుకున్న లక్ష్యాన్ని చేరలేక పోయా. ఎనిమిదేళ్ల క్రితం ఉత్తరప్రదేశ్‌కు చెందిన మాజీ ఎంపీ ధనుంజయ్‌సింగ్‌తో వివాహం జరగడంతో ఉత్తర్‌ప్రదేశ్‌లో స్థిరపడ్డాను. మా మామగారు రాజ్‌దేవ్‌సింగ్‌ కూడా ఉత్తరప్రదేశ్‌లో మాజీ ఎమ్మెల్యే. వారి ప్రోత్సాహంతోనే ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో జాన్‌పూర్‌ జిల్లా పరిధిలోని మలహాని నియోజకవర్గ పరిధిలో టిక్‌రరా మండలం నుంచి బీజేపీ తరఫున జెడ్పీటీసీగా పోటీ చేశా. రెబల్‌ అభ్యర్థి ఉన్నప్పటికీ 12,900 ఓట్ల మెజార్టీతో విజయం సాధించాను. 83 మంది జెడ్పీటీసీల్లో 43 మంది మద్దతు తెలపడంతో జెడ్పీ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యాను.

మహిళలకు అండగా..
ప్రజాసేవ చేయాలనే లక్ష్యానికి ఇన్నాళ్లకు ఒక వేదిక  దొరికింది. దీని ద్వారా ప్రజలకు ముఖ్యంగా మహిళలకు ఎంత చేయగలనో అంత చేయ్యాలన్నదే నా లక్ష్యం. త్వరలోనే జిల్లా పరిస్థితులపై అవాహన ఏర్పర్చుకొని అందరి సహకారంతో ముందుకు వెళ్తాను.

Advertisement
 
Advertisement
 
Advertisement