సోలార్‌ప్యానెల్స్‌ పెట్టుకుంటేనే...గ్రేటర్‌లో ఇళ్లకు అనుమతి! | Sakshi
Sakshi News home page

సోలార్‌ప్యానెల్స్‌ పెట్టుకుంటేనే...గ్రేటర్‌లో ఇళ్లకు అనుమతి!

Published Sat, Apr 20 2024 5:12 AM

Permission to install solar panels on houses in Greater Hyderabad - Sakshi

ఆలోచన చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. లోక్‌సభ ఎన్నికల తర్వాత దీనిపై నిర్ణయం  

చిన్న, మధ్య తరహా నీటి ప్రాజెక్టుల్లో ఫ్లోటింగ్‌ సోలార్‌ ప్యానెల్స్‌ 

సోలార్‌ విలేజ్‌లతో గ్రామాల్లోనూ విస్తృతంగా విద్యుత్‌ ఉత్పాదన 

ఓపెన్‌ కాస్ట్‌ మైన్స్‌లోనూ సోలార్‌ ప్యానెల్స్‌... 

సాక్షి, హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో ఇళ్లపై సోలార్‌ప్యానెల్స్‌ ఏర్పాటు చేసుకుంటేనే ఇంటి అనుమతులు మంజూరు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. లోక్‌సభ ఎన్నికల తర్వాత దీనికి సంబంధించి విధానపరమైన నిర్ణయం తీసుకోనుంది. సౌర విద్యుత్‌కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ప్రతీ ఇంటిపై సోలార్‌ప్యానెల్స్‌ ఏర్పాటు చేసుకోవాలనే కచ్చితమైన నిబంధన తీసుకురావాలనుకుంటోంది. తద్వారా నగరాల్లో విపరీతంగా పెరిగిపోతున్న విద్యుత్‌ అవసరాలను స్థానికంగానే ఉత్పత్తి చేసుకొని వినియోగించుకునేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

కాలుష్యరహిత విద్యుత్‌ ఉత్పాదన లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకోవాలనుకుంటోంది. గ్రామాలను కూడా సోలార్‌ ఎనర్జీ హబ్‌లుగా మార్చాలని భావిస్తోంది. ప్రతీ గ్రామంలోనూ నాలుగైదు ఎకరాల విస్తీర్ణంలో సోలార్‌ ప్యానెల్స్‌ ఏర్పాటు చేసి స్థానికంగా ఉండే సబ్‌స్టేషన్లకు వీటిని అనుసంధానిస్తారు. తద్వారా ఆ గ్రామాలకు విద్యుత్‌ సమస్య ఎదురుకాకుండా చూడాలన్న అభిప్రాయానికి వచ్చారు. దీనిపై విద్యుత్‌ శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఆ శాఖ ఉన్నతాధికారులతో చర్చించి రోడ్‌మ్యాప్‌ రూపొందించారు. ఎన్నికల తర్వాత ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితోనూ పూర్తిస్థాయిలో చర్చించిన అనంతరం మంత్రివర్గంలో ఈ కీలక నిర్ణయం తీసుకొని అమలు చేయాలని భావిస్తున్నారు.

విద్యుత్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం కావాలంటే.. సోలార్‌ ఎనర్జీనే ప్రధానం అన్న అభిప్రాయానికి వచ్చారు. ప్రస్తుతం థర్మల్, హైడల్‌ జనరేషన్‌తోపాటు సౌర, పవనవిద్యుత్‌ రాష్ట్రంలో ఉత్పత్తి అవుతోంది. హైడల్‌ పవర్‌ అందుబాటులో లేని సమయంలో రాష్ట్రంలో విద్యుత్‌ అవసరాలకు బయట నుంచి ఎక్కువ మొత్తానికి విద్యుత్‌ కొనాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్న నేపథ్యంలో సౌర విద్యుత్‌కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

రిజర్వాయర్లలోనూ..: నాగార్జునసాగర్‌ రిజర్వాయర్‌లోనూ ఫ్లోటింగ్‌ సోలార్‌ప్యానెల్స్‌ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనితోపాటు చిన్న, మధ్య తరహా నీటిపారుదల ప్రాజెక్టుల్లో ఫ్లోటింగ్‌ సోలార్‌ ప్యానెల్స్‌ ఏర్పాటు చేయడం ద్వారా విద్యుత్‌ ఉత్పాదనతోపాటు, నీరు ఆవిరవ డాన్ని తగ్గించడానికి అవకాశం ఉంటుందని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. అవసరమైతే రిజర్వాయర్ల నుంచి నీరు వెళ్లే కాలువ గట్లపై కూడా సోలార్‌ ప్యానెల్స్‌ ఏర్పాటు చేయడం వల్ల వేలాది మెగావాట్ల విద్యుత్‌ ఉత్పాదనకు అవకాశం ఏర్పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

ఎల్లంపల్లి రిజర్వాయర్‌లో ఇప్పటికే సింగరేణి సంస్థ ఫ్లోటింగ్‌ సోలార్‌ప్యానెల్స్‌ ఏర్పాటు చేసిన సంగతి విదితమే. సింగరేణి ఓపెన్‌ కాస్ట్‌ మైన్స్‌లో బొగ్గు తవ్విన తర్వాత ఆ ప్రాంతాలనూ ఈ సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తికి ఉపయోగించుకోవాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. గ్రీనర్‌ ఎనర్జీకి స్కాండినేవియన్‌ దేశాలు అధిక ప్రా ధాన్యం ఇస్తున్న మాదిరిగానే తెలంగాణలోనూ ఆ మోడల్‌ను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. ప్రస్తుతం థర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్‌ల నిర్మాణంతోపాటు వాటి నిర్వహణ, బొగ్గు ధరలు ఏటేటా పెరుగుతున్న తరుణంలో విద్యుత్‌ ధర పెరుగుతూ వస్తోంది. ఇది ప్రభుత్వంపైనే కాకుండా వినియోగదారులకు మోయలేని భారంగా మారుతున్న తరుణంలో సోలార్‌ పవర్‌ను ప్రోత్సహించాలని నిర్ణయానికి వచ్చింది. థర్మల్‌ కేంద్రాలతో భారీగా వెలువడే కాలుష్యాన్ని కూడా అరికట్టడానికి వీలవుతుందని అధికారులు చెబుతున్నారు. 
 

Advertisement
Advertisement