కాళేశ్వరంపై కమిటీ! | Sakshi
Sakshi News home page

కాళేశ్వరంపై కమిటీ!

Published Sun, Jan 28 2024 3:47 AM

CM Revanth Reddy announces expert committee on Kaleshwaram: TS - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నాణ్యతపై కేంద్ర జలసంఘం, నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ, రాష్ట్రంలోని నీటిపారుదల రంగ నిపుణులతో కమిటీ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. బ్యారేజీల పటిష్టత, కుంగిపోయిన పిల్లర్ల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశాలపై సమగ్ర అధ్యయనం చేయించాలని అధికారులను ఆదేశించారు. ఆ కమిటీ నివేదిక ఆధారంగానే ముందుకు వెళ్లాలని.. తొందరపాటుతో హడావుడి చేసి మరోసారి తప్పులకు తావివ్వవద్దని స్పష్టం చేశారు.

సాంకేతికంగా అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకున్నాకే మరమ్మ తులు, పునరుద్ధరణ చర్యలపై నిర్ణయం తీసుకోవా లని సూచించారు. శనివారం సచివాలయంలో నీటిపారుదల శాఖపై మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమీక్షించారు. కాళేశ్వరం నిర్మణంపై వెంటనే కమిటీ ఏర్పాటు చేసి, రెండు మూడు రోజుల్లోనే సమావేశం నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

మేడిగడ్డ వద్ద కుంగిన పియర్లకు మరమ్మతులు చేస్తే సరిపోతుందా? లేక దెబ్బతిన్న పియర్లన్నింటినీ తొలగించి కొత్తగా కట్టాలా? కొన్నింటికి మరమ్మతులు చేసి, మిగతా వాటిని పునర్నిర్మించాలా? అనే అంశాలపై లోతుగా అధ్యయనం చేయించాలన్నారు. గతంలో అధికారంలో ఉన్నవారు చేసిన తప్పులతో తెలంగాణకు భారీ నష్టం వాటిల్లిందని చెప్పారు. సుమారు రూ.లక్షన్నర కోట్లతో చేపట్టిన ఈ భారీ ప్రాజెక్టుకు మరమ్మతుల కోసం అవసరమైతే మరో రూ.పదివేల కోట్లయినా ఖర్చు పెట్టేందుకు ఆలోచించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాల విషయంలో రాజీ పడబోమన్నారు.

ఆరోపణలొస్తే మీరేం చేస్తున్నారు?
నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులను కృష్ణాబోర్డుకు అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించినట్టుగా వస్తున్న ఆరోపణలు, ప్రచారంపైనా భేటీలో చర్చించారు. బోర్డుకు ఏ ప్రాజెక్టునూ అప్పగించలేదని, ఎలాంటి ఒప్పందాలపై సంతకాలు చేయలేదని అధికారులు సీఎంకు వివరణ ఇచ్చారు. ఈ క్రమంలో సీఎం తీవ్రంగా స్పందించారు. ‘‘కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి 45 రోజులే అయింది.

ఈ కొద్దిరోజుల్లోనే ఎప్పుడు కృష్ణాబోర్డుతో మీటింగ్‌లు జరిగాయి?ఎవరు హాజరయ్యారు? ఏమేం నిర్ణయాలు తీసుకున్నారు? మాకు తెలియకుండా అధికారులే ఏమైనా నిర్ణయాలు తీసుకున్నారా? శాఖాపరంగా ప్రభుత్వంపై ఆరోపణలు ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు వస్తుంటే మీరేం చేస్తున్నారు?’’ అని నీటిపారుదల శాఖ అధికారులను నిలదీశారు. రాయలసీమకు ఎన్ని నీళ్లు పోతున్నాయో, వాటాకు మించి నీటిని తోడుకుపోతుంటే పదేళ్లుగా అధికారంలో ఉన్న ప్రభుత్వం ఏం చేసిందో అఖిలపక్ష భేటీలో చర్చకుపెడదామన్నారు.

మండలాల వారీగా ఆయకట్టు తేల్చండి
ప్రాజెక్టులవారీగా ఆయకట్టు వివరాలలో గందరగోళం ఉందని.. గ్రామాలు, మండలాల వారీగా ప్రాజెక్టుల ఆయకట్టు వివరాలను సిద్ధం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. తక్కువ సమ యంలో, తక్కువ ఖర్చుతో పూర్తయ్యే ప్రాజెక్టులను గుర్తించి త్వరగా నీరందించే చర్యలు చేపట్టాల న్నారు. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితిపై ఆరా తీశారు. కల్వకుర్తి ప్రాజెక్టుకు భూసేకరణ ఎందుకు ముందుకు సాగడం లేదని ప్రశ్నించారు.

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ పనులను మొదటి ప్రాధాన్యతగా తీసుకొని పూర్తి చేయాలని సూచించారు. ప్రాధాన్యతల వారీగా పెండింగ్‌ ప్రా జెక్టుల పూర్తికి ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. నారాయణపేట – కొడంగల్‌ లిఫ్టుతోపాటు మహబూబ్‌నగర్‌ జిల్లాలో కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా, కోయల్‌సాగర్‌ వంటి తక్కువ ఖర్చుతో పూర్తయ్యే ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా చిన్న, మధ్యతరహా ప్రాజెక్టుల పూర్తికి అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. 

కృష్ణాజలాలపై త్వరలో అఖిలపక్షం
కృష్ణా నది జలాల్లో రాష్ట్ర వాటా, కృష్ణాబేసిన్‌లోని ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై త్వరలోనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్‌ ఆదేశించారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు కృష్ణాజలాలకు సంబంధించి జరిగిన సమావేశాలు, కేఆర్‌ఎంబీ ఎజెండాలు, చర్చల వివరాలు, మినిట్స్, నిర్ణయాలు, ఒప్పందాలన్నింటిపై సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని నీటిపారుదల శాఖ అధికారులకు సూచించారు.

వీటన్నింటిపై అఖిలపక్ష సమావేశంలో చర్చిద్దామన్నారు. కృష్ణా జలాల్లో ఉమ్మడి ఏపీకి ఉన్న 811 టీఎంసీల వాటాలో.. ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీల కేటాయింపులకు ఎందుకు ఒప్పుకున్నారు? అప్పుడేం చర్చలు జరిగాయి? ఏమేం నిర్ణయాలు జరిగాయన్న అంశాలపైనా అఖిలపక్ష భేటీలో చర్చించాలని.. వాటన్నింటినీ ప్రజల ముందు పెట్టాలని నిర్ణయించారు. తెలంగాణ ప్రజలకు మంచి జరిగే సలహాలు, సూచనలను తప్పకుండా స్వీకరిస్తామన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement