15 ఏళ్ల వధువు.. 33 ఏళ్ల వరుడు! | Sakshi
Sakshi News home page

15 ఏళ్ల వధువు.. 33 ఏళ్ల వరుడు!

Published Sat, Feb 17 2024 10:07 AM

child Marriages in Adilabad - Sakshi

ఆదిలాబాద్‌టౌన్‌: తొమ్మిదో తరగతి చదువుతున్న 15ఏళ్ల బాలికకు కుటుంబీకులు, మధ్యవర్తులు కలిసి 33 ఏళ్ల వ్యక్తితో బాల్య వివాహం జరిపించారు. విషయం ఏడాది తర్వాత ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలికను భర్త వేధింపులకు గురిచేయడంతో ఆమె తన కుటుంబ సభ్యులకు తెలియజేసింది. విషయం ఆనోటా.. ఈనోటా బయట పడడంతో పాఠశాలలో జగిత్యాల జిల్లా బాలల కమిషన్‌ విద్యార్థి వివరాలు సేకరించింది. జిల్లా బాలల సంరక్షణ అధికారులకు సమాచారం అందజేశారు. దీంతో జిల్లా అధికారులు బేలలోని ఆమె అత్తారింటికి వెళ్లి బాధితురాలిని తీసుకొచ్చారు. జిల్లా కేంద్రంలోని బాలసదన్‌లో ఉంచారు. బేల పోలీసుస్టేషన్‌లో బాల్య వివాహం కేసు నమోదైంది. 

ఏడాది క్రితం..
జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన 15 ఏళ్ల బాలికకు గత మార్చిలో తల్లిదండ్రులతో పాటు మధ్యవర్తులు బాల్య వివాహం జరిపించారు. 9వ తరగతి వార్షిక పరీక్షలు ముగిసిన వెంటనే ఈ పెళ్లి జరిగింది. అయితే మధ్యవర్తులు బేలకు చెందిన పెళ్లి కొడుకు (33 ఏళ్ల వ్యక్తి) కుటుంబీకుల నుంచి డబ్బులు తీసుకొని పెళ్లి జరిపించినట్లు పలువురు చెబుతున్నారు. బాలిక తల్లి పాచిపని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుండగా, తండ్రి దివ్యాంగుడు. ముంబాయ్‌లో ఉంటున్నాడు. పెళ్లయిన తర్వాత నుంచి ఒకట్రెండు సార్లు మాత్రమే బాలిక పుట్టింటికి వచ్చింది. కాగా పెళ్లి కొడుకు కుటుంబీకుల నుంచి మధ్యవర్తులు డబ్బులు తీసుకొని వాటిలో నుంచి ఆ బాలికకు సెల్‌ఫోన్‌ కొనిచ్చారు.  కొంత డబ్బులు ఆమె కుటుంబీకులకు ఇచ్చినట్లు సమాచారం. బాలిక భర్త గొడవలు, వేధింపులకు పాల్పడేవారని ఆమె తల్లి పేర్కొంది.

15 రోజులుగా బాలసదన్‌లో..
బాల్య వివాహం జరిగిందనే సమాచారం అందడంతో బాలల హక్కుల పరిరక్షణ సమితి సభ్యులు బేలకు చేరుకొని బాధిత బాలికను జిల్లా కేంద్రంలోని బాలసదన్‌కు 15 రోజుల క్రితం తీసుకొచ్చారు. అప్పటి నుంచి ఆమె ఇక్కడే ఉంటుంది. ఆమెకు ఛాతినొప్పితో పాటు పచ్చకామెర్లు వచ్చినట్లు కుటుంబీకులు తెలిపారు. అయితే పలుసార్లు బాలసదన్‌ సిబ్బంది ఆమెను రిమ్స్‌లోని ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించారు. ఆమె అక్కడ ఉండనంటూ పుట్టింటికి వెళ్తానంటూ కన్నీరుమున్నీరవుతోంది. ఈ విషయమై ఐసీపీఎస్‌ అధికారి ప్రసాద్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా.. పక్షం రోజుల క్రితం విషయం తెలియడంతో బాలికను బాలసదన్‌ను తీసుకు వచ్చినట్లు ఆయన తెలిపారు. కుటుంబీకులపై బేల పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేయించినట్లు పేర్కొన్నారు. బేల ఎస్సైని వివరణ కోరగా, చైల్డ్‌ మ్యారేజ్‌ యాక్ట్‌ కింద కేసు నమోదు చేశామని, పోక్సో యాక్ట్‌కు సంబంధించి లీగల్‌ ఒపీనియన్‌ తీసుకుంటున్నామని తెలిపారు. ఇరు కుటుంబీకులతో పాటు పెళ్లికి హాజరైన వారిపై సైతం కేసులు నమోదు చేయనున్నట్లు               వివరించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement