వైఎస్సార్‌సీపీ విజయం ఖాయం | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ విజయం ఖాయం

Published Wed, May 15 2024 5:05 AM

వైఎస్సార్‌సీపీ విజయం ఖాయం

నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి

వెంకటగిరిరూరల్‌: సోమవారం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు వైఎస్సార్‌సీపీకే పట్టం కట్టారని, ఈసారి కూడా ప్రభంజనం సృష్టిస్తామని ఆ పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు, వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని నేదురుమల్లి నివాసంలోని ఎన్‌జేఆర్‌ భవనంలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన సంక్షేమ ఫలాలు, మంచితో రాష్ట్ర ప్రజలు మరోసారి అవకాశం ఇస్తున్నట్లు తెలిపారు. అత్యధిక స్థానాలు వైఎస్సార్‌సీపీ కై వసం చేసుకుందని, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రెండోసారి సీఎంగా విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేస్తారన్నారు. వెంకటగిరి నియోజకవర్గంలో 80 శాతం ఓట్లు పోలైనట్లు తెలిపారు. కార్యకర్తలు, నేతలు తన గెలుపు కోసం కృషి చేశారని, అదేవిధంగా వలంటీర్లు రాజీనామా చేసి పార్టీ కోసం పనిచేసినట్లు పేర్కొన్నారు. వారికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ శ్రేణులకు ఎళ్లవేళలా అండగా ఉండనున్నట్లు తెలిపారు.

ఓటమి భయంతో టీడీపీ నేతలు

ఓటమి భయంతోనే రాష్ట్రంలో టీడీపీ నేతలు అల్లర్లకు పాల్పడుతున్నట్లు నేదురుమల్లి చెప్పారు. దీంతో పలుచోట్ల వివాదాలకు తెరలేపుతూ, విధ్వంసాలు సృష్టిస్తున్నట్లు ఆరోపించారు. పట్టణంలోని రాణిపేట సమీపంలోని అంబేడ్కర్‌ విగ్రహాన్ని ధ్వంసం చేయడం హేయమైన చర్య అని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు నేదురుమల్లి తెలిపారు. ఆ ప్రాంతంలో అంబేడ్కర్‌ భవనం నిర్మాణానికి చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు.

వెంకటగిరి(సైదాపురం): పట్టణంలోని నేదురుమల్లి నివాసం మంగళవారం వైఎస్సార్‌సీపీ నేతలతో కోలాహలంగా మారింది. నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన నాయకులు రామ్‌కుమార్‌రెడ్డి కలిశారు.

Advertisement
 
Advertisement
 
Advertisement