చరిత్ర సృష్టించిన సింధు బృందం | Sakshi
Sakshi News home page

చరిత్ర సృష్టించిన సింధు బృందం

Published Sat, Feb 17 2024 3:37 AM

Sindhu team that made history - Sakshi

 ఆలమ్‌ (మలేసియా): అంచనాలకు మించి రాణించిన భారత మహిళల జట్టు ఆసియా బ్యాడ్మింటన్‌ టీమ్‌ చాంపియన్‌షిప్‌లో తొలిసారి పతకాన్ని ఖాయం చేసుకుంది. హాంకాంగ్‌తో శుక్రవారం జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో పీవీ సింధు బృందం 3–0తో గెలిచి సెమీఫైనల్‌కు చేరుకుంది. తద్వారా కనీసం కాంస్య పతకాన్ని ఖరారు చేసుకుంది. నేడు జరిగే సెమీఫైనల్లో జపాన్‌తో భారత్‌ ఆడుతుంది.

హాంకాంగ్‌తో జరిగిన పోరులో తొలి మ్యాచ్‌లో పీవీ సింధు 21–7, 16–21, 21–12తో లో సిన్‌ యాన్‌పై నెగ్గి భారత్‌కు 1–0తో ఆధిక్యం అందించింది. రెండో మ్యాచ్‌లో అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో ద్వయం 21–10, 21–14తో యెంగ్‌ టింగ్‌–యెంగ్‌ పుయ్‌ లామ్‌ జోడీని ఓడించింది. మూడో మ్యాచ్‌లో అషి్మత 21–12, 21–13తో యెంగ్‌ సమ్‌ యీపై గెలిచి భారత్‌కు చిరస్మరణీయం విజయాన్ని అందించింది.  

గెలుపు వాకిట శ్రీకాంత్‌ బోల్తా 
భారత పురుషుల జట్టు మాత్రం క్వార్టర్‌ ఫైనల్లో 2–3తో జపాన్‌ చేతిలో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించింది. స్కోరు 2–2తో సమమయ్యాక నిర్ణాయక ఐదో మ్యాచ్‌లో కిడాంబి శ్రీకాంత్‌ 21–17, 9–21, 20–22తో ప్రపంచ మాజీ చాంపియన్‌ కెంటో మొమోటా చేతిలో ఓడిపోయాడు. మూడో గేమ్‌లో శ్రీకాంత్‌ 19–12తో ఆధిక్యంలో నిలిచి విజయానికి రెండు పాయింట్ల దూరంలో నిలిచాడు.

అయితే ఇప్పటి వరకు శ్రీకాంత్‌ను 15 సార్లు ఓడించిన మొమోటా ఏమాత్రం ఆందోళన చెందకుండా ఆడి వరుసగా 8 పాయింట్లు గెలిచి 20–19తో ఆధిక్యంలోకి వచ్చాడు. ఆ తర్వాత శ్రీకాంత్‌ 20–20తో స్కోరును సమం చేశాడు. అయితే వెంటనే మొమోటా వరుసగా రెండు పాయింట్లు గెలిచి గేమ్‌ను 22– 20తోపాటు మ్యాచ్‌ను 3–2తో జపాన్‌కు అందించి భారత శిబిరాన్ని నిరాశలో ముంచాడు.

అంతకకుముందు తొలి మ్యాచ్‌లో ప్రణయ్‌ ఓడిపోగా... రెండో మ్యాచ్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి జోడీ గెలిచింది. మూడో మ్యాచ్‌లో లక్ష సేన్‌ నెగ్గగా... నాలుగో మ్యాచ్‌లో ధ్రువ్‌ కపిల–అర్జున్‌ జంట ఓటమి పాలైంది.

Advertisement
 
Advertisement
 
Advertisement