నన్ను క్షమించండి సన్నీ సార్‌.. మరోసారి అలా చేయను: సర్ఫరాజ్‌ | Sakshi
Sakshi News home page

నన్ను క్షమించండి సన్నీ సార్‌.. మరోసారి అలా చేయను: సర్ఫరాజ్‌

Published Thu, Mar 14 2024 4:34 PM

Sarfaraz Khans Response After India Greats Don Bradman Reminder - Sakshi

టీమిండియా క్రికెటర్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌ తన అరంగేట్ర టెస్టు సిరీస్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన సంగతి తెలిసిందే. రాజ్‌కోట్ వేదిక‌గా జ‌రిగిన ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టు  ద్వారా డెబ్యూ చేసిన సర్ఫరాజ్‌.. తన బ్యాటింగ్‌ స్కిల్స్‌తో అందరని అకట్టుకున్నాడు. సర్ఫరాజ్‌ తన అరంగేట్ర టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లలోనూ హాఫ్‌ సెంచరీలతో చెలరేగాడు.

అదేవిధంగా ధర్మశాల వేదికగా ఐదో టెస్టులోనూ ఈ ముంబైకర్‌ సత్తాచాటాడు. అయితే ఆఖరి టెస్టులో మంచి టచ్‌లో కన్పించిన సర్ఫరాజ్‌ ఓ చెత్త షాట్‌ ఆడి తన వికెట్‌ను కోల్పోయాడు.  టీ బ్రేక్ అనంతరం ఎదుర్కొన్న తొలి బంతికే సర్ఫరాజ్‌ పెవిలియన్‌కు చేరాడు.

షోయ‌బ్ బ‌షీర్ బౌలింగ్‌లో బంతిని త‌ప్పుగా అంచ‌నా వేసిన స‌ర్ఫ‌రాజ్‌.. లేట్‌ కట్‌ షాట్‌ ఆడి స్లిప్‌లో జో రూట్ చేతికి చిక్కాడు. మొత్తంగా 60 బంతులు ఎదుర్కొన్న స‌ర్ఫ‌రాజ్ ఖాన్ 8 ఫోర్లు, ఓ సిక్స్ సాయంతో 56 ప‌రుగులు చేశాడు.

కాగా సర్ఫరాజ్‌ ఔటైన వెంటనే భారత బ్యాటర్లు వరుస క్రమంలో పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఈ సమయంలో కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న భారత క్రికెట్‌ దిగ్గజం సునీల్‌ గ‌వాస్క‌ర్.. సర్ఫరాజ్‌ ఔటైన తీరుపై అసంతృప్తిని వ్య‌క్తం చేశాడు.

"బంతి ఒక్కసారిగా పైకి పిచ్‌ అయ్యింది. అది షాట్‌ ఆడాల్సిన బాల్‌ కాదు. అయినా ఆడేందుకు వెళ్లి మూల్యం చెల్లించుకున్నాడు. టీ బ్రేక్ తర్వాత తొలి బంతినే ఆవిధంగా ఆడాల్సిన అవసరం లేదు. కాస్త దృష్టి పెట్టి ఆడాల్సింది.

ఇటువంటి సమయంలో దిగ్గ‌జ ఆట‌గాడు డాన్ బ్రాడ్‌మాన్‌ మాటలను గుర్తు చేసు​కోవాలి. తాను 200 పరుగులు సాధించినా సరే ఎదుర్కొనే తర్వాత బంతిని సున్నా స్కోరు పై ఉన్నాను అని అనుకుని ఆడేవాడిన‌ని చెప్పేవారు.

కానీ సర్ఫరాజ్‌ టీ విరామం తర్వాత తొలి బంతికే చెత్త షాట్‌ ఆడి ఔటయ్యాడని" సన్నీ కాస్త సీరియస్‌ అయ్యాడు. అయితే గవాస్కర్‌ అంతలా సీరియస్‌ అవ్వడానికి ఓ కారణముంది. ఎందుకంటే మ్యాచ్‌కు ముందు షాట్ల ఎంపికపై దాదాపు గంట సేపు సర్ఫరాజ్‌కు గవాస్కర్‌ కీలక సూచనలు చేశాడు. కానీ సర్ఫరాజ్‌ మాత్రం చెత్త షాట్‌ ఆడి ఔట్‌ కావడంతో లిటిల్‌ మాస్టర్‌కు కోపం వచ్చింది.

అయితే గవాస్కర్ సీరియస్‌ కావడంతో సర్ఫరాజ్ ఖాన్ బాధపడ్డాడని, ఆయనకు క్షమాపణలు కూడా చెప్పాడని ప్రముఖ వ్యాపారవేత్త శ్యామ్ భాటియా తెలిపారు. ఈయన గవాస్కర్‌కు అత్యంత సన్నిహితుడు. ‘సన్నీ సార్‌కు నేను క్షమాపణలు చెబుతున్నా. నేను తప్పు చేశా. మరోసారి అలాంటి తప్పిదం పునరావృతం కాదు’ అని యువ ఆటగాడు అన్నాడు’’ అని శ్యామ్ భాటియా చెప్పుకొచ్చారు.
చదవండి: Ind vs Eng: పుజారాను వద్దని.. వాళ్ల కోసం రోహిత్‌, ద్రవిడ్‌లను ఒప్పించి మరీ..

Advertisement
Advertisement