గుకేశ్‌ ‘భూకంపం’ తెచ్చాడు! | Sakshi
Sakshi News home page

గుకేశ్‌ ‘భూకంపం’ తెచ్చాడు!

Published Wed, Apr 24 2024 4:24 AM

Gukesh qualified for the World Chess Championship - Sakshi

గ్యారీ కాస్పరోవ్‌ ప్రశంస 

గ్యారీ కాస్పరోవ్‌ ప్రశంస టొరంటో: క్యాండిడేట్స్‌ టోర్నీలో విజేతగా నిలిచి వరల్డ్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌ పోరుకు అర్హత సాధించిన భారత యువ గ్రాండ్‌మాస్టర్‌ దొమ్మరాజు గుకేశ్‌పై ‘ఆల్‌టైమ్‌ గ్రేట్‌’ గ్యారీ కాస్పరోవ్‌ ప్రశంసలు కురిపించాడు. ప్రపంచ చెస్‌లో కొత్త మార్పునకు ఇది సూచన అని ఈ మాజీ వరల్డ్‌  చాంపియన్‌ అభిప్రాయపడ్డాడు. ‘గుకేశ్‌కు అభినందనలు. టొరంటోలో ఒక భారతీయుడు భూకంపం సృష్టించాడు.

17 ఏళ్ల కుర్రాడు చైనా చాంపియన్‌ డింగ్‌ లిరెన్‌ను ఢీకొనబోతుండటం ప్రపంచ చెస్‌లో ఆధిక్యం ఒక దిక్కు నుంచి మరో దిక్కుకు  మారిందనేదానికి సరైన సూచిక. విశ్వనాథన్‌ ఆనంద్‌ ‘పిల్లలు’ అన్ని చోట్లా దూకుడు ప్రదర్శిస్తున్నారు. గుకేశ్‌ మరింత పైకి ఎదుగుతాడు. చైనా, భారత్‌కు చెందిన కుర్రాళ్లు చెస్‌లో ఏదైనా సాధించే సంకల్పంతో దూసుకుపోతుంటే ఇంగ్లండ్, అమెరికా జూనియర్‌ ఆటగాళ్లు మాత్రం చూస్తూనే ఉండిపోతున్నారు’ అని కాస్పరోవ్‌ వ్యాఖ్యానించాడు.

ఆదివారం ముగిసిన క్యాండిడేట్స్‌ చెస్‌ టోర్నీలో ఓపెన్‌ విభాగంలో భారత్‌ నుంచి గుకేశ్,  ప్రజ్ఞానంద, విదిత్‌ సంతోష్‌ గుజరాతి పోటీపడ్డారు.  గుకేశ్‌ విజేతగా అవతరించగా... ప్రజ్ఞానంద ఐదో స్థానంలో, విదిత్‌ ఆరో ర్యాంక్‌లో నిలిచారు. ఇదే టోర్నీ మహిళల విభాగంలో భారత గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి రన్నరప్‌గా నిలువగా, వైశాలికి నాలుగో స్థానం లభించింది. 

Advertisement
Advertisement