రైల్వే విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించట్లేదు | Sakshi
Sakshi News home page

రైల్వే విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించట్లేదు

Published Mon, Sep 4 2023 4:48 AM

state government did not cooperate for the expansion of railways - Sakshi

సాక్షి, హైదరాబాద్‌/బన్సీలాల్‌పేట్‌: రైల్వే లైన్ల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని... తెలంగాణలో అత్యంత తక్కువగా రైల్వే లైన్లు ఉండటంతో ఇక్కడ భారీ ఎత్తునరైల్వే ప్రాజెక్టుల ఏర్పాటుకు చొరవ తీసుకుంటోందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అన్నారు.

కానీ గతేడాదిగా రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, సహాయ నిరాకరణ వల్ల రాష్ట్రంలో దాదాపు 700 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ల పనులు ముందుకు సాగడం లేదన్నారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ వాటా చెల్లింపు, భూసేకరణలో బాధ్యతారాహిత్యంగా కేసీఆర్‌ సర్కారు వ్యవహరిస్తుండటం వల్లే ఈ పనులు నిలిచిపోయాయని ఆరోపించారు.  

రాష్ట్రంలో రైల్వే వ్యవస్థ అభివృద్ధికి కేంద్రం పెద్దపీట.. 
తెలంగాణలో రైల్వే వ్యవస్ధ అభివృద్ధికి 30 ప్రాజెక్టుల కోసం కేంద్రం రూ. 83,543 కోట్లు మంజూరు చేయడంతోపాటు 5,239 కిలోమీటర్ల మేర నూతన రైల్వే లైన్ల ఏర్పాటుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందని కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి వెల్లడించారు. తెలంగాణ చరిత్రలో ఇంత పెద్ద మొత్తంలో, ఏకకాలంలో రైల్వే ప్రాజెక్టులు చేపట్టడానికి కేంద్రం నిర్ణయం తీసుకోవడం ఇదే తొలిసారని వివరించారు.

దాదాపు 15 కొత్త రైల్వే లైన్ల ఏర్పాటు కోసం ఫైనల్‌ లొకేషన్‌ సర్వేకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని ఆయన వివరించారు. దీంతోపాటు 8 లైన్ల డబ్లింగ్, 3 ట్రిప్లింగ్, 4 క్వాడ్రప్లింగ్‌ లైన్లకు రైల్వే శాఖ పచ్చజెండా ఊపిందని, ఈ మొత్తం ప్రాజెక్టులకు ఫైనల్‌ లొకేషన్‌ సర్వే కోసం నిధులు మంజూరయ్యాయని తెలిపారు. సర్వే పూర్తవగానే సవివర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) పనులు ప్రారంభమవుతాయని చెప్పారు.

రాష్ట్రంలో 40 రైల్వేస్టేషన్ల ఆధునీకరణకు రైల్వే శాఖ ఆమోదముద్ర వేయగా అందులో 21 స్టేషన్ల ఆధునీకరణకు ప్రధాని మోదీ వర్చువల్‌గా శంకుస్థాపన చేశారని కిషన్‌రెడ్డి తెలిపారు. ఈ 40 స్టేషన్ల ఆధునీకరణ, అభివృద్ధికి కేంద్రం రూ. 2,300 కోట్లు విడుదల చేసిందని చెప్పారు. తెలంగాణలో 2014కు ముందు ఏడాదికి సగటున 17.4 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ల నిర్మాణం జరిగితే మోదీ ప్రభుత్వం అధికారంతోకి వచ్చాక రాష్ట్రంలో ఏటా సగటున 55 కిలోమీటర్ల రైల్వే లైన్ల నిర్మాణం జరుగుతోందన్నారు.  
 

Advertisement
Advertisement