బీహార్‌ ఎవరిది? ఎన్డీఏ- మహాఘటబంధన్‌ హోరాహోరీ? | Sakshi
Sakshi News home page

Bihar: బీహార్‌ ఎవరిది? ఎన్డీఏ- మహాఘటబంధన్‌ హోరాహోరీ?

Published Thu, Apr 25 2024 1:51 PM

Lok Sabha Election 2024 Bihar Analysis who is the Juggler of Bihar - Sakshi

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో దేశంలో రాజకీయ వేడి అంతకంతకూ పెరుగుతోంది. ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు పరిస్థితి ఇదేవిధంగా కొనసాగనుంది. అయితే అటు ప్రధాని మోదీ- నితీష్‌, ఇటు ఆర్జేడీ నేత తేజస్వి - రాహుల్‌(కాంగ్రెస్‌)కు ప్రతిష్టాత్మకంగా మారిన బీహార్‌ రాజకీయాలపైనే అందరి దృష్టి నిలిచింది. 

బీహార్‌లో మోదీ-నితీష్ జోడీ గెలుపు గ్యారెంటీనా? రాష్ట్ర ప్రజలు ఎవరికి పట్టం కట్టనున్నారు? నితీష్ ఫ్యాక్టర్ ఎన్డీఏకు విజయాన్ని అందిస్తుందా? మహాఘటబంధన్‌ తన సత్తా చాటగలదా? ఇలాంటి ప్రశ్నలు అందరి మదిలో మెదులుతున్నాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో నితీష్ కుమార్ ఎన్డీఏలో ఉన్నారు. 2019లో ఎన్డీఏకి 53.20 శాతం ఓట్లు రాగా, మహాఘటబంధన్‌కు 31.90శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. ఎన్డీఏలోని బీజేపీకి 23.6 శాతం ఓట్లు వచ్చాయి. జేడీయూకి 21.8శాతం, ఇతరులకు 7.9శాతం ఓ‍ట్లు దక్కాయి. మహాఘటబంధన్‌కు వచ్చిన 31.90 శాతం ఓట్లలో ఆర్‌జేడీకి 15.4శాతం ఓట్లు, కాంగ్రెస్‌కు 7.7 శాతం ఓట్లు, ఇతరులకు 8.8 శాతం ఓట్లు వచ్చాయి. 2015, 2020 అసెంబ్లీ ఎన్నికల్లో నితీష్ కుమార్ సారధ్యంలోని అధికార కూటమి విజయం సాధించింది.

2014 లోక్‌సభ ఎన్నికల్లో మోదీ, నితీష్‌లు విడివిడిగా పోటీ చేసినప్పుడు ఎన్డీఏకు 31 సీట్లు లభించగా, 2019లో  వీరిరువురూ కలిసి పోటీ చేసినప్పుడు 39 సీట్లు  దక్కించుకున్నారు. ఈసారి బీహార్‌లోని మొత్తం 40 లోక్‌సభ స్థానాల్లో ఎన్డీఏ, మహాకూటమి మధ్యే పోటీ నెలకొంది. ఈసారి బీజేపీ 17 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తోంది. ఇందులో 9 స్థానాల్లో ఆర్జేడీతో పోటీ పోటీ ఏ‍ర్పడనుంది. 5 స్థానాల్లో కాంగ్రెస్ నుంచి బీజేపీకి పోటీ ఏర్పడనున్నదని సమాచారం. 

అదేవిధంగా జేడీయూ 16 స్థానాల్లో పోటీ చేస్తోంది. ఇందులో ఆర్జేడీతో కలిసి 10 స్థానాల్లో పోటీ చేయనుంది. మూడు స్థానాల్లో కాంగ్రెస్ నుంచి  పోటీ  ఏ‍ర్పడనున్నదని సమాచారం. మహాకూటమిలోని ఇతర పార్టీల నుండి మూడు స్థానాల్లో మాత్రమే పోటీ ఉండనుంది. ఎన్డీఏలోని ఇతర పార్టీలకు బీజేపీ ఏడు సీట్లు ఇచ్చింది. ఈ స్థానాల్లో బీజేపీకి నాలుగు స్థానాల్లో ఆర్జేడీతో, ఒక స్థానంలో కాంగ్రెస్‌తో, రెండు స్థానాల్లో మహాకూటమికి చెందిన ఇతర పార్టీలతో పోటీ  ఏర్పడనుంది. బీహార్‌లోని 23 లోక్‌సభ స్థానాల్లో ఆర్జేడీ పోటీ చేస్తోంది. కాంగ్రెస్ 9 స్థానాల్లో, మహాకూటమికి చెందిన ఇతర పార్టీలు మొత్తం 8 స్థానాల్లో  ఎన్నికల బరిలోకి దిగాయి.

Advertisement
Advertisement