Colors of Politics: నెహ్రూ నుంచి మోదీ వరకూ.. | Colors Of Politics Amid Power Struggle, Leaders Also Play Colors of Holi - Sakshi
Sakshi News home page

Colors of Politics: నెహ్రూ నుంచి మోదీ వరకూ..

Published Mon, Mar 25 2024 7:56 AM

Leaders Also Play Colors of Holi - Sakshi

హోలీకి భారత రాజకీయాలకు మధ్య సంబంధం ఎంతో ప్రత్యేకమైనది. మొఘల్ చక్రవర్తులు, బ్రిటీష్ పాలకులు కూడా హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. దేశ మొదటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ హోలీ సందర్భంగా ప్రజల కోసం తన నివాసం తీన్ మూర్తి భవన్ తలుపులు తెరిచేవారు. 

నాటి ప్రధాని ఇందిరా గాంధీ, అటల్ బిహారీ వాజ్‌పేయి కూడా ఢిల్లీ ప్రజలతో కలిసి హోలీ వేడుకలు చేసుకున్నారు. ఎన్నికల సంవత్సరంలో జరిగే హోలీ వేడుకలు రాజకీయాలకు మరింత ఉత్సాహాన్ని అందిస్తున్నాయి. తీన్ మూర్తి భవన్ గతంలో నాటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ నివాసంగా ఉండేది. అప్పటి అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్‌ కెన్నెడీ భార్య జాక్వెలిన్ భారత్‌లో జరిగిన హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. నాటి దౌత్యవేత్త బీకే నెహ్రూ తన ఆత్మకథ ‘నైస్ గైస్ ఫినిష్ సెకండ్’లో  జాక్వెలిన్ హోలీ వేడుకల్లో పాల్గొన్న విషయాన్ని ప్రస్తావించారు. 

హోలీ వేడుల్లో నెహ్రూ..
1962లో కెన్నెడీ భార్య జాక్వెలిన్ తొమ్మిది రోజుల వ్యక్తిగత పర్యటన నిమిత్తం భారతదేశానికి వచ్చారు. అయితే ఆమె హోలీ రోజు తిరుగు ప్రయాణమయ్యారు. ఆరోజు ఆమె జవహర్‌లాల్ నెహ్రూకు వీడ్కోలు చెప్పడానికి తీన్ మూర్తి భవన్‌కు  వెళ్లారు. ఆమె ఆరోజున ఫ్యాషన్ దుస్తులు ధరించారు. అక్కడ ఉన్న నాటి అమెరికన్ అంబాసిడర్ గాల్‌బ్రైత్ కుర్తా పైజామా ధరించి వచ్చారు. బికె నెహ్రూ తెలిపిన వివరాల ప్రకారం ప్రధాని నెహ్రూ హోలీ వేడుకలను ఎంతో ఇష్టపడేవారు. 

జాక్వెలిన్ తీన్ మూర్తి భవన్‌కు చేరుకోగానే వివిధ రంగులలో గులాల్ నింపిన చిన్న గిన్నెలను వెండి ట్రేలో ఆమె ముందుకు తీసుకువచ్చారు. నెహ్రూ.. జాక్వెలిన్ నుదుటిపై గులాల్ రాశారు. అక్కడే ఉన్న ఇందిరా గాంధీ కూడా జాక్వెలిన్‌కు రంగులు పూశారు. అనంతరం నెహ్రూ..  పాలం విమానాశ్రయంలో జాక్వెలిన్ కెన్నెడీకి వీడ్కోలు పలికారు. దేశ తొలి ప్రధాని నెహ్రూతో పాటు తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్రప్రసాద్ కూడా హోలీ ఆడేవారు. తీన్ మూర్తి భవన్‌లో హోలీని జరుపుకునే ఈ ప్రక్రియ 1963 వరకు కొనసాగింది. 1964లో నెహ్రూ అస్వస్థతకు గురయ్యారు. ఆ సంవత్సరం అక్కడ హోలీ జరగలేదు. 1964లో ఆయన మరణానంతరం ప్రధానమంత్రి నివాసంలో హోలీ వేడుకలు నిలిచిపోయాయి.

ఇందిర నివాసంలో..
ఇందిరా గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు సఫ్దర్‌జంగ్ రోడ్‌లోని ఆమె ప్రభుత్వ నివాసంలో  హోలీ వేడుకలు జరిగేవి. ఆరోజు వచ్చిన అతిథులందరికీ ప్రత్యేక వంటకాలు వడ్డించేవారు. తరువాతి కాలంలో రాజీవ్ గాంధీ, సోనియా గాంధీలు తమ ఇంట్లో హోలీ ఆడేవారు. పలువురు కాంగ్రెస్ నేతలు వారి నివాసానికి చేరుకుని హోలీ వేడుకల్లో పాల్గొనేవారు. 

వాజపేయి, మోదీల రంగుల కేళి

అటల్ బిహారీ వాజపేయి దేశ ప్రధాని అయ్యాక ఆయనకు గులాల్ పూయడానికి చాలా మంది ఆయన నివాసానికి వెళ్లేవారు. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ నాటి ప్రధాని వాజపేయి సమక్షంలో హోలీ వేడుకలు చేసుకున్న ఉదంతం 1999లో జరిగింది. వాజ్‌పేయి తన నివాసంలో హోలీ మిలన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనిలో మిత్రపక్షాలే కాకుండా బీజేపీ నేతలు కూడా పాల్గొన్నారు. నాడు నేటి ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. నాడు వాజ్‌పేయి, మోదీ  పరస్పరం రంగులు పూసుకున్నారు. అప్పటి కేంద్ర మంత్రి విజయ్ గోయల్ కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

అద్వానీ ఇంట్లో నీళ్లతో హోలీ
మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీ ఇంట్లో నీళ్లతో హోలీ ఆడేవారు. నాటి రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం హోలీ వేడుకలను మానసిక వికలాంగ చిన్నారుల మధ్య జరుపుకునేవారు. ఇందులో రంగులు, గులాల్ బదులు పూలు జల్లుకునేవారు. ఢిల్లీలోని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధికారిక నివాసంలో కూడా హోలీ వేడుకలను ఉత్సాహంగా జరుగుతుంటాయి. 

పాత ఢిల్లీ వీధుల్లో ఉరిమే ఉత్సాహం
పాత ఢిల్లీ వీధుల్లో హోలీ వేడుకలు ఘనంగా జరుగుతుంటాయి. ఇందులో అధికార, ప్రతిపక్షాలకు అతీతంగా నేతలంతా ఒకరినొకరు కలుసుకుని హోలీ శుభాకాంక్షలు తెలుపుకుంటారు. నేటి ప్రధాని నరేంద్ర మోదీ కూడా హోలీ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. తాజాగా ఆయన దేశ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు.  అందరి జీవితాల్లో నూతన చైతన్యం, ఉత్సాహం వెల్లివిరియాలని ఆయన ఆకాంక్షించారు. 

Advertisement
Advertisement